Read more!

రాముడిని సీతమ్మ ఎందుకు ప్రశ్నించింది??

 

రాముడిని సీతమ్మ ఎందుకు ప్రశ్నించింది??


రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి అడవిలో నడుస్తున్నప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది.  "నేను పెద్దల దగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, 

అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. 

ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యను, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. 

మూడవది ఏంటంటే  ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం.

కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తపస్సు చేసుకునే మునుల ఆశ్రమాలకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు తమని హింసిస్తున్న రాక్షసుల నుండి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుండి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, మునులని హింసించే రాక్షసులని ఇకనుండి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. 

మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి. కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు వాళ్లతో రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు.

 కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శతృత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి.

పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. "అయ్యా! నేను ఆపదలో ఉన్నాను. నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దగ్గర ఉంచండి" అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు. 

మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. 

కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది. తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు. కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరములు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? అని ప్రశ్నించింది సీతమ్మ.


                                  ◆వెంకటేష్ పువ్వాడ.