Read more!

రావణాసురుడిని మారీచుడు ఏమని హెచ్చరించాడు??

 

 రావణాసురుడిని మారీచుడు ఏమని హెచ్చరించాడు??

 


నీకు రాజ్యం ఉంది. నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల ద్వేషం పెంచుకోకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరముతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగము చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుండి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగము చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగము చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.


నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది. వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో. నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుండి నాకు రాముడన్నా, రామబాణం అన్నా భయం.


పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళకు నాశనమయిపోతావు,


ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళీ కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిపి తాపసులని చంపి, వారిని తిందామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు. ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపేస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.


అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతి చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, 'ర' అని పలుకగానే, వారు తరువాత 'మ' అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటే, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు అన్నాడు మారీచుడు.


                                                                                               ◆ వెంకటేష్ పువ్వాడ.