శబరి నేర్పే జీవితపాఠం… పట్టుదల!
శబరి నేర్పే జీవితపాఠం… పట్టుదల!
శబరి అనగానే రామాయణంలో కనిపించే ఓ భక్తురాలు గుర్తుకువస్తుంది. ఒక గిరిజన నేపధ్యంలో పుట్టిన శబరి, మాతంగ ముని ఆశ్రమంలో పెరిగింది. అక్కడి రుషుల మాటలు వింటూ పెరిగింది. తన మనసంతా భక్తితో నిండిపోయింది. ఇహపరాలను విడిచి ముక్తిమార్గమే మేలని నిశ్చయించుకుంది. ఇలాంటి సమయంలోనే విష్ణుమూర్తి, శ్రీరాముని రూపంలో అవతరించిన విషయాన్ని తెలుసుకుంది శబరి. ఆయన ఎప్పటికైనా తాను ఉండే వైపు రాకపోతాడా అని వేయి కళ్లతో ఎదురుచూడటం మొదలుపెట్టింది.
కాలం గడుస్తోంది. నడివయసులో ఉన్న శబరి వృద్ధాప్యంతో బలహీనపడిపోయింది. చూపు మసకబారింది. కానీ రాముడు వస్తాడనే ఆశ మాత్రం వీడలేదు. ఆ రఘుకులుడు తనని అనుగ్రహిస్తాడనే నమ్మకంతోనే రోజులు గడిపింది. రాముడు అటువైపుగా వస్తాడని శబరికి చెబుతూ మాతంగ ముని కూడా దేహం చాలించారు. మాతంగుడు దూరమైనా సరే… ఎప్పటికైనా రాముడు అటు వస్తాడనే కోరికతో రోజూ ఆ ఆశ్రమాన్ని శుభ్రం చేసి, పూలతో అలంకరించి, పండ్లు సేకరించి ఉండేది. ఇలా కూడా సంవత్సరాలు గడిచిపోయాయి. శబరి నడుము వంగిపోయింది. అయినా శబరి దినచర్యలో మార్పు రాలేదు.
శబరి గురించి తెలుసుకున్న రాముడు… తనను కరుణించేందుకు ఆశ్రమానికి రానేవచ్చాడు. తనకు చూపు లేకపోవడంతో, ఆ అవతారమూర్తిని తడుముతూ ఆయనే రాముడని గ్రహించింది శబరి. ఆయన కోసం ఉంచిన రేగుపళ్లను కొరికి చూసి మరీ… మేలు పళ్లను అందించింది. ఈ చర్యకు లక్ష్మణుడు ఆగ్రహించాడనీ, అది శబరి నిర్మల భక్తికి తార్కాణం అంటూ రాముడు వివరించాడనీ కొన్ని రామాయణాల్లో కనిపిస్తుంది.
మొత్తానికి శబరి జీవితకాల వాంఛ నెరవేరింది. తను కోరుకున్న రాముడిని నేరుగా సేవించుకుంది. ఆయన నుంచి నేరుగా మోక్షాన్ని అందుకుంది. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది? మాఘ బహుళ సప్తమి రోజు శబరి జయంతిగా భావిస్తుంటారు. 2022లో శబరి జయంతి ఫిబ్రవరి 23న వచ్చింది. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
శబరి గొప్పగా భావించే వంశంలో పుట్టింది కాదు. తనేమీ వేదాంత గ్రంథాలు వల్లెవేయలేదు. అయినా దేవుడు తనని వేతుక్కుంటూ సతీసమేతంగా కాలినడకన వచ్చాడు. కారణం… ఆమె భక్తి! శబరి జీవితం కేవలం భక్తులకు మాత్రమే ఉన్నతం కాదు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు, దాని గురించే ఆలోచిస్తూ, అది వస్తుందనే నమ్మకంతో గడుపుతూ, అందుకు అనుగుణంగా జీవించినప్పుడు… విజయం సాధ్యమవుతుంది. శబరి పట్టుకు మెచ్చి రాముడే తన చెంతకు వచ్చాడు. దాని ముందు మన రోజువారీ లక్ష్యాలెంత!
- నిర్జర.