అజ్ఞానాన్ని వధించే కరవాలం ఈ శ్లోకం!!

 

అజ్ఞానాన్ని వధించే కరవాలం ఈ శ్లోకం!!

 

కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా భోదచేస్తాడు. అందులో ఇదీ ఒకటి. ప్రతి మనిషి కచ్చితంగా తెలుసుకోదగ్గది ఈ కింది శ్లోకం

【తస్మాదజ్ఞానసమ్భూతం హృత్సం జ్ఞానాసినాత్మనః౹

 ఛిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారతః॥

 జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికెయ్యి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే!! ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు బంధనములు అంటవు.】 ఇదీ పరమాత్మ బోధ.

ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు. "అజ్ఞానసమ్భూతమ్" అంటే అజ్ఞానము వలన పుట్టినవి అని.  అజ్ఞానము వలన పుట్టేవి ఏమిటి అంటే సంశయాలు, మోహము, మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్టసంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానము అంటే ప్రతిదానినీ దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అంటే నిజాన్ని తెలుసుకోకుండా మన బుర్రలో ఉన్న ఆలోచనల ప్రకారం ఎదుటి దాన్ని నిర్ణయించడం. ఎలా అంటే అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం. అన్నీ మనకే కావాలని అనుకోవడం. అన్నిటికీ నేనే మూలం నావలననే జరుగుతున్నాయి. అని భావించడం.

"జ్ఞానాసినా” అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికెయ్యాలి. అంటే జ్ఞానము కత్తి లాంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి.

"హృతమ్" అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము. స్థావరం అంటే నివాసం. ఈ అజ్ఞానం నివాసం ఎక్కడ అంటే అది మన హృదయమే దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించేకంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్టవేసుకొని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకరు నివృత్తి చేయలేరు.

ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు. మన అప్పు మరొకరు తీర్చగలరు. కాని మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం ఎంతో ముఖ్యమైనది అని నొక్కి వక్కాణిస్తున్నది.

ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి "యోగమతిష్ట" అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహములు పోవడానికీ, జ్ఞానం రావడానికీ, అవసరమైనది నిష్కామ కర్మయోగము. ఎటువంటి సంగము అంటే ఎలాంటి స్వలాభాపేక్ష కానీ ఏదో ఒకటి ఆశించినట్టు కాకుండా నిస్వార్థంగా, కర్ఘృత్వభావన లేకుండా, ఏకాగ్రచిత్తంతో అంటే పని మీద మాత్రమే మనసు పెట్టి కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు. అంటే ఆ పని తాలూకూ పాపం, పుణ్యం అనేవి మనిషిని వెంటాడవు.

అందుకే ఓ అర్జునా! నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్లంతా మరణిస్తారు. వర్ణ సంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధం చేయను. సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను. ఈ రక్తపు కూడు తినలేను అనే పనికిమాలిన మాటలు కట్టిపెట్టి 'ఉత్తిష్ఠ' అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా యుద్ధం చెయ్యి ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. ఇదే ప్రతి మనిషి తను చేసే పనికి అన్వయించుకోవాలి అప్పుడు అలా చేసిన మనిషికి  ఆ కర్మ తాలూకూ ఫలాలు జన్మజన్మనూ వెంబడించవు.

◆ వెంకటేష్ పువ్వాడ