Read more!

నిజమైన క్షత్రీయుడు ఎవరు??

 

నిజమైన క్షత్రీయుడు ఎవరు??


భారతదేశంలో క్షత్రీయుల పాత్ర అమోఘం. యుద్ధవీరులు, వీరు మరణాలు, రాజ్యాలు వీటి మధ్య క్షత్రీయులు తమ శౌర్యప్రతాపాలతో  మెరిసిపోయేవాళ్ళు. అయితే వాళ్ళు మాత్రమే క్షత్రియులు కాదని నిజమైన క్షత్రియులంటే ఇలా ఉంటారు అని గీతలో కృషుడు ఇలా చెబుతాడు.

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్|| 

ధైర్య, శౌర్య, పరాక్రమాలు కలిగి ఉండటం, తేజస్సు కలిగి ఉండటం, ఎదుడి వాడితో పోరాడే సామర్థ్యం కలిగి ఉండటం, అమితమైన పట్టుదల కలిగి ఉండటం, పిరికితనం, యుద్ధంలో పారిపోయే బుద్ధి లేకుండా ఉండటం, పేదలకు అర్హులకు దానధర్మాలు చేయడం, పరిపాలనా దక్షత, న్యాయశాస్త్ర నైపుణ్యము కలిగి ఉండటం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా క్షత్రియుడే.

దేశాలకు మధ్య జరిగే యుద్ధాలలో సైనికులు పాల్గొంటారు. ధైర్యంతో పోరాడతారు. కాని, మనలో కూడా ప్రతిరోజూ మంచి చెడులకు మధ్య. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అవునా కాదా.... అనే సమస్యలు.... ఈ విరుద్ధభావాల మధ్య నిరంరతం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొంత మంది భయపడి పిరికి వాళ్ల లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి కొందరు ఎటువంటిసమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి కొందరు సమస్యలకు భయపడి పారిపోతారు. దైనందిన సమస్యలను ఎదుర్కోడంలో ప్రతివాడూ క్షత్రియగుణమును ప్రదర్శించాలి. వాడే క్షత్రియ స్వభావము కలవాడు. పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడితే వాడికి క్షత్రియ స్వభావము లేనట్టే. 

అంతే కాకుండా క్షత్రియ స్వభావాలలో పరిపాలన, న్యాయనిర్ణయం ముఖ్యమైనవి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ పరిపాలన, న్యాయవ్యవస్థలో కూడా అవినీతి వేళ్లూనుకు పోయింది. రాజకీయనాయకులు, కార్యదర్శి స్థాయి అధికారులు అవినీతికిపాల్పడుతున్నారు. న్యాయవ్యవస్థ కూడా అప్పుడప్పుడు ఈ అవినీతి ఊబిలో చిక్కుకుపోతూ ఉంది. ఇటువంటి వారిని క్షత్రియస్వభావం కలవారు అని అనలేము. క్షత్రియుడి మూలస్వభావము అవినీతి రహిత జీవనము, నిస్వార్థపరత్వము, నిష్పక్షపాతము. ఇవి లేకపోతే అతడు క్షత్రియుడు కాలేడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కాబట్టే యమధర్మరాజును సమవర్తి అని అన్నారు. 

అంటే ఇక్కడ యమధర్మరాజు మనుషులు చేసే పాపాలను, పుణ్యాలను బట్టే చనిపోయిన తరువాత నరకానికో, స్వర్గానికో పంపుతూ ఉంటాడు. కానీ యమధర్మరాజు అనగానే ప్రాణాలు తీసే ఓ రాక్షసుడులా అందరూ అనుకుంటారు. ఆయనంటే అందరూ భయపడతారు. మనిషి జీవితకాలంలో చేసిన తప్పొప్పులను అనుసరించి చక్కని న్యాయం చెప్పేవాడు యమధర్మరాజు మాత్రమే. డబ్బున్నవాడని, పేదవాడు అని తేడాలు చూపించడం. రాజు అని, పనివాడు అని ఒకరిని గొప్పగా, మరొకరిని తక్కువగా లెక్కలోకి తీసుకోవడం అనేది ఉండదు. తప్పు చేసినవాడు ఎవడైనా యమధర్మరాజు దృష్టిలో ఒకటే. అందుకే ఆయనను సమవర్తి అంటే అందరినీ సమానంగా చూసేవాడు అని అంటారు. కాని మన సినిమాలు ఆయనను ఎలా చిత్రీకరిస్తున్నారో చూస్తే మనం సిగ్గుపడాలి.

ఇక ఇందులో చెప్పినట్టు సాధారణ మనిషిలో కూడా క్షత్రీయ ధర్మాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయా మనుషులలో  ఉండే వ్యక్తిత్వాలే. జీవితంలో సమస్యలు ఎన్నైనా రాని, వాటిని ఎంతో పట్టుదలతో, కష్టపడి పరిష్కరించుకోవాలి. ప్రస్తుత కాలంలో 90% మంది సమస్య ఎదురైతే ఆ సమస్య నుండి తప్పించుకోవడం లేదా అది నాకు సంబంధించింది కాదు అనుకునేలా వంకర కారణాలు వెతుక్కోవడం కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేని పిరికివాళ్లుగా తయారవుతారు. ఎప్పుడైనా పెద్ద సమస్య ఎదుదైతే దాన్ని ఎదుర్కొనే ధైర్యం, పరిష్కరించుకునే నేర్పు వాళ్లకు లేకుండా చేతులెత్తేస్తారు. 

కాబట్టి కత్తులు పట్టుకుని యుద్ధం చేసేవాళ్లే క్షత్రియులు కాదు, జీవితంలో సమస్యలతో పోరాటం చేసేవాళ్ళు కూడా క్షత్రీయులే అనేది సారాంశంలో అర్థం.

◆ వెంకటేష్ పువ్వాడ