మారీచుడి మాయ!!
మారీచుడి మాయ!!
మారీచుడు ఒక రాక్షసుడు. రామాయణంలో రావణాసుడికి సీతను ఎత్తుకుపోయే అవకాశాన్ని కల్పించడానికి రామ బాణం దెబ్బకు తన ప్రాణాన్ని కోల్పోయినవాడు. ప్రతీకారం కోసం రావణాసుడు రగిలిపోతూ, శూర్పణఖ రెచ్చగొట్టినట్టు సీతను ఎత్తుకురావాలని అనుకున్నాడు.కానీ 14,000 వేలమంది రాక్షసులను ఒక్కడే గంటా ముప్పై నిమిషాలలో చంపిన రాముడంటే మనసులో తెలియని భయం అలుముకుంది. అందుకే సీతను ఎత్తుకుని వెళ్ళడానికి మారీచుడిని బలిపశువును చేసాడు.
చెప్పినట్టు చేయనని వ్యతిరేకంగా మాట్లాడిన మారీచుడిని రాముడి చేతిలో చస్తావో, నా చేతిలో చస్తావో నిర్ణయించుకోమని భయపెట్టి చివరకు మారీచుడిని రాముడి ఆశ్రమం దగ్గరకు తీసుకెళ్లి సీత కంట పడేలా చేసి సీత ఆ జింకను కావాలనే పరిస్థితి సృష్టించాడు. రాముడు సీత కోసం జింకను తీసుకొస్తానని కోదండం పట్టుకుని వెళ్ళాడు.
జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు. కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్థానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది.
"దీన్ని చూసి సీత అలా అడగడంలో ఆశ్చర్యం లేదు. దీన్ని ఎలాగైనా తీసుకెళ్లాలి. కానీ ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కోదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది.
ముందుగానే రావణాసుడు చెప్పిన పథకం ప్రకారం మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా "హా! సీత, హా! లక్ష్మణా" అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుండి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.
ఆ దృశ్యాన్ని చూసిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు.
ఆ గొంతు ఆశ్రమంలో ఉన్న సీతమ్మకు వినబడింది. రాముడు ఎదో ప్రమాదంలో ఉన్నాడనుకుని భయపడిపోయింది. వెంటనే రాముడిని కాపాడటం కోసం లక్ష్మణుడిని వెళ్ళమని చెప్పింది. అలా మారీచుడి మాయ రావణాసుడికి అవకాశం కల్పించింది.
◆ వెంకటేష్ పువ్వాడ.