Read more!

శ్రద్ధ ఉంటే విజయం ఖాయం

 

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 6

శ్రద్ధ ఉంటే విజయం ఖాయం

 

శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం అంటుంది గీత. శ్రద్ధ ఉన్నవారికే విజ్ఞానం, విజయం లభిస్తాయని స్పష్టంగా చెప్పేస్తుంది. దీని గురించి గీతలో ఏకంగా ‘శ్రద్ధాత్రయ విభాగ యోగం’ పేరుతో ఒక అధ్యాయమే కనిపిస్తుంది. ఓ మనిషి శ్రద్ధ అతని స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుందో, వాళ్ల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది… అని ఈ అధ్యాయంలోని మూడో శ్లోకం చెబుతోంది. ఈ శ్రద్ధను ప్రభావితం చేసే స్వభావం గురించి కూడా విశ్లేషణ కనిపిస్తుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ !

ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత !!

ప్రతి మనిషిలోనూ సత్త్వరజోతమో గుణాలలో ఒకటి ప్రస్ఫుటంగా ఉంటుంది. సత్త్వ, రజో గుణాలు సహజమైనవే. ఒకటి జ్ఞానం దిశగా, మరొకటి మమకారం వైపుగా నడిపిస్తాయి. కానీ తమో గుణమే ప్రమాదకరం. అది అజ్ఞానాన్ని రగిలిస్తుంది, భ్రమలో పడేస్తుంది. నిద్ర, సోమరితనం, అజాగ్రత్త మొదలైన వాటితో మనిషిని బంధిస్తుంది.

ఇక ఆ తమస్సులో మునిగిపోయినవాడు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో కూడా చెబుతుంది…

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః ।

విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।

కట్టుబాటు లేనివాడు, వివేకము లేనివాడు, పొగరుబోతు, ఇతరులకు మంచిదైనదాన్ని పాడుచేసేవాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు, సోమరిపోతు, దిగాలుగా ఉండేవాడు, ఆలోచనలతో కాలయాపన చేసేవాడిని తామసికుడైన వ్యక్తి అంటుంది భగవద్గీత 18వ అధ్యాయంలోని ఈ శ్లోకం!

తామసికమైన పనులు వెంటనే సుఖాన్ని అందిస్తాయి. కానీ అది వెంటనే వీగిపోతుంది. దాంతో ఆ సుఖం కోసం వెంపర్లాడేలా చేస్తుంది. లక్ష్యాన్ని ఏమారుస్తుంది, చేజారుస్తుంది. విజ్ఞానపరంగా కూడా దీన్ని నిరూపించవచ్చు. మన శరీరంలో డొపమైన అనే హార్మోన్‌ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ ఉత్తేజం కోసం మళ్లీమళ్లీ డొపమైన పెంచే పనులు చేస్తాం. ఇది వ్యసనానికి దారి తీస్తుంది. అతిగా తినడం, నిద్ర, డ్రగ్స్‌, పోర్న్‌, మద్యం… ఇవన్నీ కూడా డొపమైన పెంచే అలవాట్లే!

సాత్త్విక గుణం అలా కాదు. మొదట విషంగా తోచి చివరికి అమృతంగా పరిణమిస్తుంది. (యత్తదగ్రే విషమివ పరిణామేమృతోపమమ్). ఉదయాన్నే నిద్ర లేవడం, గంటల తరబడి చదవడం, సుదీర్ఘమైన లెక్చర్స్‌ వినడం, రాత్రింబగళ్లు తేడా లేకుండా శ్రమించడం ఇవన్నీ కూడా సాత్త్వికమైన లక్షణాల కిందకి వస్తాయి. మంచి ఫలితం కావాలంటే వాటిని అలవాటు చేసుకోవాల్సిందే. అలా కాకుండా శరీరానికి కష్టం కలుగుతుందనో, బాధాకరంగా ఉందనో కర్మను మధ్యలో వదిలేస్తే ఫలితం లభించదని ముందే చెప్పేస్తోంది గీత.

- నిర్జర.