శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యల వెనుక అసలు నిజాలు ఇవే..!
శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యల వెనుక అసలు నిజాలు ఇవే..!
హిందూ పౌరాణికాలలో దేవుళ్ల మీద చాలా రకాల సందేహాలు, ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇతిహాసాల గురించి, పౌరాణిక గ్రంథాల గురించి పూర్తీగా తెలియకపోయినా సరే.. చాలా మంది కొన్నివిషయాలు నిందిస్తూ, విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో శ్రీకృష్ణుడి 16వేల మంది భార్యల విషయం ఒకటి. అయితే దీని వెనుక చాలామందికి తెలియని నిజాలు తెలుసుకుంటే..
పౌరాణిక కథ ప్రకారం
నరకాసురుని విజయం తర్వాత:
నరకాసురుడు అనే అసురుడు 16,100 యువతులను అపహరించి తన కారాగారంలో బంధించి ఉంచాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించాడు. అతని చెరలో ఉన్న ఆ యువతులు స్వతంత్రంగా బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. అప్పటి సమాజంలో ఒకసారి ఎవరో ఒకరు బంధించిన మహిళలను మళ్ళీ వారివారి ఇంటికి తీసుకెళ్లడమంటే పెద్ద అవమానంగా భావించేవారు. దీంతో వారు శ్రీకృష్ణుడి పాదాలకు శరణు వేడారు. “మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమవుతాం, దయచేసి మమ్మల్ని అంగీకరించండి.” అని వేడుకున్నారు. ఫలితంగా, శ్రీకృష్ణుడు వారిని ‘భార్యలుగా’ అంగీకరించాడు . కానీ ఇది సంసారిక అర్థంలో కాదని పౌరాణిక గ్రంథాలు స్పష్టంగా చెప్తాయి.
ఆధ్యాత్మికత పరంగా ..
శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. 16,000 మంది భార్యలు అనేది మనుషులలోని 16,000 కోరికలు, భావనలు, మనోభావాలు అని భావించవచ్చు. పరమాత్మ ఎన్ని కోణాల్లోనైనా, ఎంత మందితోనైనా ప్రేమతో సంబంధం పెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అనే సందేశం. ప్రతి జీవాత్మకి తన పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నదనీ, ఆత్మ పరమాత్మతో కలిసే యాత్ర అన్నదే అసలు అర్థం. ఈ కోణంలో చూస్తే, కృష్ణుని 16,000 భార్యలు అన్నవి మానవుని వివిధ శక్తులు, పరమాత్మతో ఐక్యతను కోరే రూపాలు.
కృష్ణుని ప్రేమ, కరుణ, ధర్మం.. ఇవి విస్తృతంగా ఉంటాయి. ప్రతి జీవికి, ఎంత దూరంగా ఉన్నా, ఒకటే అశ్రయం.. అదే పరమాత్మ ప్రేమ."
శ్రీకృష్ణుడికి ఆధ్యాత్మిక, చారిత్రకంగా ప్రధానమైన భార్యలు ఎనిమిది మందే. వీరిని "అష్టమహిషులూ" అంటారు. ఇక 16వేల మందితో శ్రీకృష్ణుడికి ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి.
*రూపశ్రీ.