జటాయువు ఉత్తమలోకాలు ఎలా పొందాడు?

 

జటాయువు ఉత్తమలోకాలు ఎలా పొందాడు?

రావణుడితో జరిగిన పోరాటంలో జటాయువు రెక్కలు విరిగిపోయి, కాళ్ళు కోల్పోయి ఎటూ కాకుండా ఉన్నప్పుడు రామ లక్ష్మణులు వచ్చి చూసారు. అప్పుడు జటాయువు రావణుడితో ఎలా యుద్ధం చేసింది వివరంగా చెప్పి సీతమ్మ తప్పకుండా దొరుకుతుందని రాముడికి ధైర్యం చెప్పి ప్రాణాలు వదిలేసాడు. అది చూసిన రాముడు ఎంతో ఏడ్చాడు, రాముడి వెంట ఉన్న లక్ష్మణుడు కూడా ఏడ్చాడు. 

అప్పుడు రాముడు "చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. మనుషులే ఒకోసారి ఒకో విధంగా ఆలోచిస్తూ స్వభావాలు మార్చుకుంటారేమో. కానీ జంతువులు, పక్షులు తమ ప్రాణాలనే అడ్డుఓఎత్తేస్తున్నాయి. 

నేను మొదట జటాయువు మనకు ఎంతో స్నేహితుడు అని మనతో ఉండమని అన్నాను. సీత కనిపించకుండా ఈ జటాయువు చుట్టూ రక్తం కనిపించేసరికి సీతను ఈ జటాయువే తినేసి ఉంటాడని అనుకున్నాను. కానీ జరిగింది వేరు చూడు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. మనం ఏమి చేసి ఈ జటాయువు  ప్రాణాలు తీసుకురాగం??" అన్నాడు రాముడు.

"అన్నయ్య!! జటాయువు చనిపోవడం బాధగానే ఉన్నా, ప్రతి ప్రాణి ఆ దేవుడు రాసిపెట్టినట్టు, పుట్టాలి, మరణించాలి. దయచేసి నువ్వు గుండె నిబ్బరం చేసుకో" అన్నాడు లక్ష్మణుడు.

"నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.

అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము" అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).

ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి "నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు" అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.

అలా జటాయువు ఉత్తమలోకాలని పొందాడు.

◆వెంకటేష్ పువ్వాడ.