Read more!

రావణాసుడు సీతను అపహరించిన ముహూర్తం పేరు!!

 

రావణాసుడు సీతను అపహరించిన ముహూర్తం పేరు!!

 

రాముడు సీతను వెతుక్కుంటూ జంతువులు పరిగెత్తుతున్నవైపు వెళ్ళాడు. రాముడి వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. వాళ్లిద్దరూ దూరంగా నెత్తుటి మడుగులో పడి ఉన్న జటాయువును చూసారు.  ఈ జటాయువు మనదగ్గర నమ్మకంగా ఉంటూ మనం లేని సమయంలో సీతను తినేసిందేమో, అందుకే రక్తం చుట్టుపక్కల పడిందేమో అనుకున్నాడు రాముడు. 

కానీ దూరం నుండి రాముడిని చూసిన  జటాయువు "రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా, నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా పాదములు నరికేశాడు. అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు" అన్నాడు.

జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.

"నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను. సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా!" అన్నాడు. అలాగే 'జటాయు!! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకు వెళ్ళాడు. ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు" అన్నాడు.

అప్పుడా జటాయువు "ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. 

వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య" అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి "ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు" అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.

◆ వెంకటేష్ పువ్వాడ.