Read more!

రత్నాచలంపై సత్యదేవుడు!

 

రత్నాచలంపై సత్యదేవుడు!!

కోరిన కోర్కెలు తీర్చే దైవంగా వెలసిల్లినవాడు అన్నవరం సత్యనారాయణ స్వామి. తూర్పు గోదావరి జిల్లాలో శంఖవరం మండల కేంద్రం నుండి 10 కిలోమీటర్లు, తుని పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఇంకా కలకత్తా-మద్రాస్ జాతీయ రహదారిలో రాజమహేంద్రవరానికి 70 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలలో అన్నవరం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 

ఎలా వెలిసాడు ఈ దేవుడు??

మేరు పర్వతం ఒక గొప్ప పర్వతం. పురాణాల ప్రకారం మేరు పర్వతం పర్వతాల రాజు. ఈయన భార్య మేనక. వీళ్లిద్దరి పుట్టిన  కొడుకులు భద్రుడు, రత్నకుడు. 

భద్రుడు శ్రీరామచంద్రుడి గురించి తపస్సు చేసి ఆ రామచంద్రుడిని ప్రసన్నం చేసుకుని తన కొండనే నివాసంగా మార్చుకోవాలని కోరిక కోరతాడు. దాంతో రామచంద్రుడు సరేనని భద్రాచలం కొండమీద వెలిసాడు. ఆ భద్రాచలం తెలంగాణలో ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది.

ఇంకొక కొడుకు రత్నకుడు ఆ శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేయగా సత్యనారాయణ స్వామి అవతారంలో కొండమీద నివాసం ఉంటానని మహావిష్ణువు చెప్పి అదే విధంగా వెలిసాడు. అందువల్ల ఈ కొండకు రత్నాచాలం అనే పేరు కూడా వచ్చింది.

ఆలయ నిర్మాణం!!

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (సం. కృష్ణకుటజము, కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు. ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు.

ప్రత్యేకత!!

పెళ్లి కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇతర శుభకార్యాలు కావచ్చు. ప్రతి కార్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరిగా చేసుకుంటారు. చేస్తున్న కార్యం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అయితే ఈ అన్నవరం క్షేత్రంలో పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతాలు జరగడం ఎంతో ముచ్చటగానూ, భక్తిసంద్రంలో ఒలలాడినట్టుగానూ అనిపిస్తుంది. 

ప్రసాదం ప్రీతికరం!!

కొన్ని పుణ్యక్షేత్రాలలో ప్రసాదం భలే ఉంటుంది. తిరుపతి లడ్డు లా అన్నవరంలో ప్రసాదం కూడా అద్భుతంగా ఉంటుంది. పైగా అక్కడ విస్తరాకులో ఇచ్చే ఆ స్వామివారి ప్రసాదాన్ని ఆకుతో సహా నాకేస్తారు అంటే దాని రుచి ఊహించవచ్చు. గోధుమరవ్వ ఉపయోగించి తయారుచేసే ఈ ప్రసాదం అన్నవరం పేరును మరొక లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. 

దర్శనం, సందర్శనం!!

స్వామివారి దర్శనం ఉచితం. అయితే వ్రతాలు, పూజలు చేయించాలని అనుకుంటే టికెట్ తీసుకుని అక్కడ పూజలు చేయించుకోవచ్చు. శాశ్వత నిత్యపూజ, సప్తగోపుర పూజ వంటివి జరుగుతాయి. వీటికి ధర చెల్లించి టికెట్ తీసుకోవచ్చు.

ఇకపోతే భక్తుల కోసం గుడి వరకు ఘాట్ రోడ్డు నిర్మించారు కాబట్టి ప్రయాణానికి ఇబ్బంది లేదు, మెట్ల మార్గం గుండా కూడా వెళ్ళచ్చు. 460 మెట్లు ఎక్కి పైకి చేరుకోవచ్చు. 

" మూలతో బ్రహ్మరూపాయ

మధ్యతశ్చ మహేశ్వరం

అధతో విష్ణురూపాయ

త్ర్త్యెక్య రూపాయతేనమః " అని ఆ స్వామిని నిత్యం స్మరించుకుంటూ ఉంటే అందరికీ అన్ని కాలాల్లో తన చేయుతను అందిస్తాడు. సత్యనారాయణుడు రత్నాచాల నివాసుడు.

అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం ఈ మాసంలో జరుగుతుంది.

◆వెంకటేష్ పువ్వాడ.