సీతా - రావణాసుల వాదన!!

 

సీతా - రావణాసుల వాదన!!

రావణాసుడు బ్రాహ్మణుడి వేషంలో సీత దగ్గరకు వెళ్ళాడు. సీతమ్మ రావణాసుడికి ఒక బ్రాహ్మణుడికి చేసినట్టే మర్యాదలు చేసింది. తరువాత  "నా పేరు సీత, నేను దశరథ మహారాజు కోడలిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను (సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది), కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు అన్ని సమయాలలో మాకు సేవ చేస్తుంటాడు.

ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు. నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు" అని అడిగింది.

అప్పుడా రావణుడు "సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు. అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకములో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చి నీకు ఇచ్చేస్తాను' అన్నాడు.

 రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ "రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది" అని అని పలికింది.

అప్పుడా రావణుడు "నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుండి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం. నా కన్ను నీ మీద పడింది. నన్ను నువ్వు పొందు" అని గర్వంగా అన్నాడు.

అప్పుడు సీతమ్మ " కుబేరుడి తమ్ముడిని అంటావు, పదిమంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. మాటకు ముందు శ్రీ రాముడు పనికిమాలినవాడు అంటున్నావు. మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము" అని పలికింది.

అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు. ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు. నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు "అని బెదిరిస్తూ సీతను సమీపించాడు.

                             ◆ వెంకటేష్ పువ్వాడ.