Read more!

స్థితప్రజ్ఞత రహస్యం

 

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 7

స్థితప్రజ్ఞత రహస్యం

లక్ష్యాన్ని ఎంచుకున్నాం. దాన్ని చేరుకోవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తున్నాం. ప్రలోభాలకు అతీతంగా, ఎవరి మీదా ఆధారపడకుండా… మన వంతుగా కష్టపడుతున్నాం సరే! కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక కష్టం పలకరిస్తుంది. అనూహ్యమైన సమస్య ఏదో జీవితాన్ని కుదిపేస్తుంది. చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎల్లకాలం మనకు అనుకూలంగా ఉండవు కదా! ఇలాంటి సందర్భంలోనే మనసు కుంగిపోతుంది. అప్పుడే గీతలోని శ్లోకాలు నిబ్బరాన్ని అందిస్తాయి.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।।

అంటుంది గీతలోని సాంఖ్యయోగం. దుఃఖాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా… ఆ రెంటికీ అతీతంగా భయం, కోపం లాంటి ఉద్రేకాలు లేకపోవడమే స్థితప్రజ్ఞత అని సూచిస్తుందీ శ్లోకం. కానీ మనసు చంచలమైంది… ఎంతగా దాన్ని అదుపుచేయాలనుకుంటే అంతలా పెనుగులాడుతుంది. అందుకే ధ్యానంలాంటి పద్ధతుల ద్వారా దాన్ని సంబాళించుకోవాలని చెబుతుంది గీత.

ధ్యానం ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు. మతంతో దాన్ని జోడించల్సిన పని లేదు. మెదడు తరంగాల రూపంలో పనిచేస్తుందనీ… ఆ ఉధృతిని నియంత్రించగల మార్గం ధ్యానమనీ విజ్ఞానశాస్త్రం ఒప్పుకుంటోంది. ధ్యానంలో ఒత్తిడి తగ్గుతుందనీ, తక్కువ తప్పులు చేస్తామనీ, సృజన పెరుగుతుందనీ… ఆఖరికి మన జన్యువుల్లో కూడా మార్పు వస్తుందనీ రకరకాల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కాబట్టి పరీక్షలకు సిద్ధపడేవారు, కెరీర్‌ లో ముందు ఉండాలనుకునేవారు అంతర్ముఖంగా, భౌతికంగా ఎలాంటి ఒత్తిడీ లేకుండా లక్ష్యం మీద స్థిరంగా దృష్టి పెట్టడానికి ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకోవడం ఉపయోగమే!

గాలిలేని చోట దీపం ఎలాగైతే రెపరెపలాడకుండా నిశ్చలంగా వెలుగుతుందో… మనసు మీద పట్టు అందుకున్నవాడి ధ్యానం కూడా అంతే స్థిరంగా ఉంటుందని చెబుతుంది గీత. ధ్యానం, యోగం, తపస్సు లాంటి మాటలన్నింటినీ తీక్షణమైన చర్యలుగా భావించడం తప్పనీ చెబుతుంది. ‘ఉన్నతమైన భావాలు, సౌమ్యత్వం, మౌనంగా ఉండటం, మనసును స్వాధీనంలో ఉంచుకోవడం… ఇవన్నీ కూడా మానసికమైన తపస్సే (మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః। భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే।- 17వ అధ్యాయం)

ఆధ్యాత్మిక గ్రంథంలా తోచే భగవద్గీత ఇలా లక్ష్యానికి చేరువయ్యే మార్గాలను చూపుతుంది కాబట్టే… వివేకానందుడు ‘గీతలోని ప్రతి పుటలోనూ స్పష్టంగా కనిపించే సందేశం, చురుగ్గా పనిచేయడమే. ఆ చురుకుదనం మధ్య అనంతమైన ప్రశాంతత కలిగి ఉండటమే. ఇదే పనిలోని రహస్యం’ అంటూ ఆ సందేశాన్ని ప్రచారం చేశారు.

- నిర్జర.