Read more!

జటాయువు పోరాటం ఎలా జరిగింది??

 

జటాయువు పోరాటం ఎలా జరిగింది??


రావణాసుడు తన నిజరూపంలోకి మారి, పది తలలు, ఇరవై చేతులతో భయంకరంగా అరుస్తూ సీతను పట్టుకుని రథం ఎక్కి  వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరములు. అప్పుడా జటాయువు "ఓ రావణా!  దుర్మార్గుడా!! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్పుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వారు అలాగే బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు, నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు. చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటే ఏంటో చూద్దువు" అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.

తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు.

ఇది చూసిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది. రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.

అప్పుడా జటాయువు ఒంట్లోనుండి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది.  జటాయువు అదుపుతప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. 

అలా జటాయువు రావణాసుడితో సీతమ్మను తీసుకుపోనివ్వకుండా కాపాడటానికి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.

◆ వెంకటేష్ పువ్వాడ.