Read more!

కర్మఫలాన్ని స్పష్టం చేసే బుద్ధుడి కథ!

 

 

కర్మఫలాన్ని స్పష్టం చేసే బుద్ధుడి కథ!

అద్భుతాన్ని చేసి సంచితకర్మను మార్చే వీలుందికానీ, ప్రారబ్ధకర్మను మార్చే వీలులేదని అనేవారున్నారు. ఒక ప్రత్యేక శక్తిని సాధించినవారు దేశదేశాల్లో ఈ అద్భుతాలను ప్రదర్శిస్తూనే వున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత ఎలెక్సిన్కారెల్ ఇలాంటి వాటిని నమ్మకూడదని ఎంతగా అనుకున్నప్పటికీ ప్రత్యక్ష నిదర్శనాలు చూసిన తర్వాత "నమ్మకుండా ఉండడమెలా?" అని ప్రశ్నించాడు. శాస్త్రీయ దృక్పధాన్ని విడనాడకుండానే తత్త్వదర్శనం చేయడానికి పూనుకున్న మహామేధావుల్లో కారెల్ ఒకడు. ఎలెక్సిన్

మనుషులు సామూహికంగా జరిపే ప్రార్ధనల్లో నుండి ఒకరకమైన ద్రవం వంటిదేదో స్రవిస్తుందనీ, దానికి మానవనరాల మండలం మీద సత్ప్రభావం వుంటుందనీ, ఆ విధంగా మనిషికి కొంత శాంతి, సౌఖ్యం లభిస్థాయనీ కారెల్ “లొర్డెన్ యాత్ర" అనే తన గ్రంథంలో వ్రాశాడు. అయితే మానవ అవయవాలను ఆవరించిన వ్యాధిపై ఈ ప్రార్థనలవలన ఏమీ ప్రయోజనం వుండదని నమ్మాడు.

కానీ మేరీ ఫెర్ట్రాండ్ అనే వనిత క్షయవ్యాధికి గురై తన జీవితంలో చాలా భాగం ఆసుపత్రులలో గడిపిన విషయం అతడు స్వయంగా చూసాను. ఆవిడకు మరణమాసన్నమవుతున్నదని డాక్టర్లంతా నిశ్చయించారు. ఆవిణ్ణి భర్త రైల్లో లొర్డెన్కు తీసుకువచ్చాడు. తన భార్యకు ప్రాణభిక్ష పెట్టమనీ తన విశ్వాసాన్ని గట్టిచేయమనీ లొర్డెన్లోని అధిష్ఠాన దేవత మేరీకన్యను ప్రార్థించాడు. ఎలెక్సిన్కారెల్ ఇదంతా చూస్తూనే వున్నాడు.

ఆశ్చర్యమేమిటంటే మేరీ ఫెర్రాండ్ వ్యాధి వెనక్కుతీయడం మొదలెట్టింది. ప్రార్థన ప్రభావం కారెల్ అనుకున్నట్లుగా నరాల మండలం మీదే కాదు; అవయవాల మీద కూడా కనిపించసాగింది. ఊపిరితిత్తులు బాగుపడసాగాయి. వారం రోజులు గడిచేలోగా మేరీ ఫెర్రాండ్కు స్వస్థత చేకూరింది.

ఏ రకమైన కర్మను అద్భుతాల ద్వారా సవరించే వీలుందో, ఏ కర్మను మార్చే వీలులేదో ఆ శక్తిగలవారికే తెలియాలి. కానీ ఒకటిమాత్రం నిజం. వ్యక్తుల విషయంలో కర్మను తప్పించడం సాధ్యమేమోకానీ, సమాజము, మొత్తం జాతి విషయంలో కర్మను తప్పించే మార్గం లేకపోవచ్చు.. 

బుద్ధుడి శిష్యవర్గంలో మోంగా వ్యాన్ అనే శిష్యుడికి అమానుష క్రియలు, అద్భుతాలు అమిత ఇష్టంగా వుండేవి. అతడొకరోజున ధ్యానం చేసుకుంటూ కూచోనుండగా కపిలవస్తు రాజ్యంలో యుద్ధం సంభవించనున్నట్లు, అనతి కాలంలో అది నాశనం కానున్నట్లు తెలిసొచ్చింది, "ఏదో ఒకటి చేయకపోతే వారం తిరిగేలోగా ఆదివారం మిట్టమధ్యాహ్నం వేళకు కపిలవస్తు రాజ్యం సర్వనాశనమవడం తథ్యం" అనుకుంటూ గౌతమబుద్ధుడి వద్దకు వెళ్ళి "భగవాన్, పై వారంలో మీ స్వజనం అనేకులు మరణించనున్నారని మీకు తెలుసా” అని ఆదుర్దాగా అడిగాడు.

" తెలుస”న్నాడు బుద్ధుడు నెమ్మదిగా…

 "ఐతే మరి వారిని రక్షించడానికి పూనుకుంటున్నారా?” అన్నాడు మోంగ్వ్యాన్.

"నావల్లకాదు" అన్నాడు బుద్ధ భగవానుడు. 

"మీకు మానవాతీతమైన శక్తులున్నాయి కదా? అవసరమొచ్చినప్పుడు అద్భుతాలు చేయగలరు. వారినెందుకు కాపాడకూడదు?" అని అడిగాడు.

"చేసుకున్న కర్మ అనుభవింపక తప్పదు నాయనా" అన్నాడు బుద్ధుడు. 

కానీ మోంగ్వ్యాన్కు బుద్ధుడిమాటల్లో నమ్మకం కుదరలేదు. బుద్ధుడికి తగినంత కరుణలేదని భావించి ఆగ్రహావేశుడయ్యాడు. ఇక ఆయనమీద ఆధారపడి లాభం లేదని తానే పూనుకున్నాడు. కపిలరాజ్యాన్నంతా కలిపి ఒక చిన్న ఉండగా తయారు చేసి ఒక ఆహారపాత్రలో పడేశాడు. ఆ పాత్రమీద మూత పెట్టి దాన్ని తీసుకుని లోకాలన్నీ దాటి కట్టకడపటి స్వర్గం మీదికి తీసుకువెళ్ళాడు. 

సుఖశాంతులు నెలకొన్న ఆ స్వర్గంలోని ఒక రాజమందిరంలో పాత్రనుంచి తిరిగివచ్చాడు. వారం రోజులు గడువు తీరిపోయింది. ఆదివారం మధ్యాహ్నం దాటిపోయింది. గండం గడిచిందని సంతోషిస్తూ హుటాహుటిన ఆ స్వర్గానికి వెళ్ళి ఆ పాత్రను జాగ్రత్తగా భూమిమీదకు తీసుకువచ్చాడు. మూతతీసి చూచాడు. చిన్న పరిమాణంలోకి మారిన కపిలవస్తు రాజ్యం, ఒక చిన్నసైజు యుద్ధకారణంగా సర్వనాశనమైందని గ్రహించాడు మోంగ్వ్యాన్. 

దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… కర్మఫలం ఉన్నప్పుడు ఎవరు ఎంత అడ్డుకోవాలని చూసినా అది జరగక మానదు.

                                     ◆నిశ్శబ్ద.