Read more!

అధికారి ఎలా ఉండాలి?

 

అధికారి ఎలా ఉండాలి?

దిలీప మహారాజును వర్ణిస్తూ కాళిదాసు, ముందు దిలీపుడి ధర్మప్రవర్తనను వివరిస్తాడు. ఆ తరువాత దిలీపుడు రాజుగా ఉండటంతో, ప్రజలు కూడా ధర్మప్రవర్తన కలవారై ఉన్నారని అంటాడు. దిలీపుడు తమను పాలిస్తుండగా, ఎలాగైతే రథచక్రం క్రమం తప్పకుండా తిరుగుతుందో, అలాగే ప్రజలు ధర్మమనే బాటను క్రమం తప్పకుండా, ఇసుమంతైనా తేడా లేకుండా అనుసరిస్తున్నారు.

దిలీపుడు రాజు. రాజు ప్రవర్తన ప్రజలను ప్రభావితం చేస్తుంది. రాజు స్థానంలో ఆఫీసర్ని ఉంచితే, ఓ ఆఫీస్ పరిస్థితి ఆఫీసర్ ప్రవర్తనను సూచిస్తుంది. దిలీప మహారాజు ప్రజలను పాలించిన విధానం, ఆధునికసమాజంలో ఆఫీసర్లు వ్యవహరించాల్సిన తీరును స్పష్టంగా సూచిస్తుంది.

ప్రజానాం వినయాధానాద్ర క్షణాద్భరణాదపి! 
సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః!!

తన ప్రజలను విజ్ఞానవంతులను చేస్తూ, వారికి రక్షణనిస్తూ, వారికి అండగా నిలుస్తూ, రాజు, వారిని తన సంతానంలా, తాను వారికి తండ్రిలా వ్యవహరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే వారి తల్లిదండ్రులు కేవలం వారికి జన్మనిచ్చినవారు. మిగతా జీవితమంతా రాజు వారికి తండ్రిలా వ్యవహరిస్తున్నాడు.

వయసుతో నిమిత్తం లేకుండా ప్రతివ్యక్తిలో 'పిల్లవాడు' సజీవంగా ఉంటాడు. అందుకే ప్రతివ్యక్తి తనపైవాడు తన ప్రతిభను గుర్తించాలని, తనను అభినందించి, సత్కరించాలని ఆశపడుతూంటాడు. తాను చేసిన పనిని పైవాడు గుర్తించి అభినందిస్తే ఉప్పొంగిపోతాడు. మరింత చురుకుగా పని చేస్తాడు. అధికారి ఇది గుర్తించాలి.


తన కింద పనిచేసేవారంతా. వయసుతో నిమిత్తం లేకుండా తన సంతానంలా భావించాలంటే అధికారి అయిన వాడికి ఎంతో పరిపక్వత ఉండాలి. ఎంతో విజ్ఞానం ఉండాలి. ఎందుకంటే అధికారి అన్నవాడి పట్ల అతని కింద పని చేసేవారిలో ఓ రకమైన వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతలో వ్యక్తిగతమైనదేదీ ఉండదు. అధికారి ఇది అర్థం చేసుకోవాలి. ఎలాగైతే తండ్రి, ఎటువంటివాడైనా తన సంతానాన్ని ప్రేమిస్తూ, వారి అభివృద్ధికై పాటు పడతాడో, అలాగే అధికారి తన కింద పనిచేసేవారిని ఆనందంగా ఉంచేందుకు ఆలోచించాలి. వారిని విజ్ఞానవంతులను చేయాలి. వారిని రక్షించాలి. వారికి మద్దతునివ్వాలి. ప్రోత్సాహం ఇవ్వాలి. ఇక్కడే మేనేజ్మెంట్లో మొదటిసూత్రం అత్యంతప్రాధాన్యం వహిస్తుంది.

తన కింద పనిచేసేవారు జీతం ప్రకారం, ఉద్యోగనియమాల ప్రకారం ఒకే స్థాయివారైనా, వ్యక్తిగతంగా ఎవరికివారు భిన్నమైనవారని గ్రహించాలి. అందరినీ ఒకేలాగ చూడటం కుదరదనీ అర్థం చేసుకోవాలి. వారి ప్రవృత్తులు వేరని గ్రహించాలి. కష్టపడి పని చేసేవారు కొందరుంటారు. ఆడుతూ పాడుతూ పనిచేసేవారు కొందరుంటారు. పని చేయగలిగీ చేయనివారు కొందరుంటారు. పనిచేతకాక చేయనివారు కొందరుంటారు. ఆసక్తి లేని వారు కొందరుంటారు. అందరినీ ఒకే రకంగా చూడటం కుదరదు. కాబట్టి అధికారి, తనకింద పనిచేసేవారి లక్షణాలను, గుణగణాలను, ప్రవృత్తి, ఆసక్తులను అర్థం చేసుకోవాలి. 

పొగడ్తలతో పనిచేసేవారిని పొగడాలి. తనతో సమానుడుగా చూడటం వల్ల ఉత్సాహంతో పని చేసేవాడిని సమానంగా గౌరవిస్తూ పని తీసుకోవాలి. తాను అధికారినన్న దర్పం చూపకూడదు. కొందరిని స్వేచ్ఛగా వదిలేస్తే అద్భుతంగా పనిచేస్తారు. వారి స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగినా, వారిపై అధికారం చలాయించినా ముడుచుకుపోతారు. అటువంటివారిని స్వేచ్ఛగా వదిలేయాలి. కానీ ఓ కన్నేసి ఉంచాలి. ఇంకొందరు మాటిమాటికీ వెంటపడుతూంటేనే పని చేస్తారు. ఇలాంటి వారి వెంట పడాలి. ఇంకొందరు మొండివాళ్లుంటారు. వారి మొండితనాన్ని మన్నిస్తూనే, మంచి మాటలతో వారి నుండి పని తీసుకోవాలి. ఇదంతా చేయాలంటే 'ఆఫీసర్'కి మానవ మనస్తత్వంతో పరిచయం ఉండాలి. 

ముఖ్యంగా, మనిషిపై గౌరవం ఉండాలి. ప్రతి మనిషిలో గొప్పతనం అంతర్గతంగా దాగి ఉందనీ, పరిస్థితుల ప్రభావంవల్ల వ్యక్తి తన ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నాడనీ అర్ధం చేసుకోవాలి. అతడి ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. దీనికి ఆఫీసరు అన్నవాడికి తన కిందివారి పట్ల గౌరవం ఉండాలి. సానుభూతి ఉండాలి. విధి పట్ల, దైవం పట్ల నమ్మకం ఉండాలి… అందుకే ఒక మహారాజు తో పోలిక చేసి చెప్పారు. 

                                ◆నిశ్శబ్ద.