Read more!

కార్తీక మాసంలో విన్నా, దర్శించుకున్నా ముక్తినిచ్చే భీమేశ్వర లింగం!!

 

కార్తీక మాసంలో విన్నా, దర్శించుకున్నా ముక్తినిచ్చే భీమేశ్వర లింగం!!

కర్కటుడు నఏ రాక్షసుడికి కర్కటి అనే కూతురు ఉండేది. ఆమెకు పెళ్లి వయసు వచ్చాక  విరాధుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాడు. రాముడు వనవాసం సమయంలో అడవిలో తిరుగుతూ విరాధుణ్ణి చంపేశాడు. దాంతో వైరాగ్యం చెంది పిచ్చిగా తిరగసాగిన కర్కటి ఒకరోజు కుంభకర్ణుడి కంటబడింది అతడు ఆమెను బలాత్కారంగా అనుభవించి వెళ్ళిపోయాడు. దాని ఫలితంగా ఆమెకు భీమాసురుడనే కొడుకు పుట్టాడు. అతడు తన చరిత్రనంతా తల్లివల్ల తెలుసుకొని పెద్దవాడయ్యే సరికి ద్వేషం పెంచుకున్నాడు.

బ్రహ్మ గురించి తపస్సు చేసాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగానే సృష్టిలో తనను మించిన బలవంతుడు ఉండకూడదనీ, వున్న వాళ్ళందరికన్నా అధికబలాన్ని తనకు ప్రసాదించమని కోరాడు ఆ రాక్షసుడు. బ్రహ్మ సరేనని వరమిచ్చి మాయమైపోయాడు.  వరం వల్ల బలశాలియైన భీమాసురుడు  దేవలోకం మీద విరుచుకుపడి దేవతల్ని అనేక కష్టాలు పెట్టాడు. భూలోకంలో ప్రజలను హింసలు పెడుతూ వాళ్ళను  బొంగరాలు ఆడించినట్లు ఆడించాడు. పాతాళలోకం వెళ్ళి యుద్ధం చేసి ఎందరినో బానిసలు చేసుకున్నాడు. అక్కడున్న కామరూపేశ్వరుణ్ణి ఓడించి అతనినీ అతని భార్య సుదక్షిణనీ కూడా కారాగారంలో బంధించాడు.

ఆ సుదక్షిణా కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు. నిత్య శివారాధకులు, వాళ్లకు వీలైనంత సౌకర్యాల్లోనే  ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ చెరపాలలోనే రోజూ పార్థివ లింగాన్ని ప్రతిష్టించుకుని శివలింగ ఆరాధన చేయసాగారు. ఒకరోజున ఖైదీలను అందరినీ చూసి వెళ్ళడానికి వచ్చిన దండనాయకుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ చేస్తున్న పార్థివ లింగ పూజను చూసి భయపడ్డాడు. సరాసరి భీమాసురుడి వద్దకు వెళ్ళి "ఓ రాక్షస రాజా! ఆ పాతాళరాజు నిన్ను పతనం చేయడం కోసం యేదో కుతంత్రం చేస్తున్నాడు. కారాగారంలో ఏదో బొమ్మలా తయారుచేసి చెరుపో, చిల్లంగో చేస్తున్నాడు" అన్నాడు.

 అదిరిపడ్డ భీమాసురుడు ఉన్న పళంగా కారాగారానికి వచ్చి ఆ పాతాళ మహారాజుతో  "రేయ్ రాజులలో నువ్వు అధముడివి నాదగ్గర బందీగా ఉన్నావు!! అలాంటిది ఏమిట్రా నువ్వు చేస్తున్నది? అని అడిగాడు.

'శివుణ్ణి ఆరాధిస్తున్నాను" అన్నాడు కామరూపేశ్వరుడు.

అది విని ఫక్కున నవ్వాడు భీమాసురడు. “యేమిటేమిటి? మా పినతండ్రియైన బాణాసురుడి ఇంటి ముందు ద్వారపాలకుడిలా పడివున్న శంకరుడి గురించేనా నువ్వు అర్చించేది? కట్టుకోవడానికి బట్టలేనివాడూ, నిత్యం బిక్షం ఎత్తుకుని జీవించేవాడూ అయిన వాడా నిన్ను రక్షించేది? వాడు నాకు కనబడలేదు గనక సరిపోయింది. కనిపించి వుంటే కాలరాసి వుండేవాణ్ణి, నువ్వాపూజలు గట్రా ఆపేయి. లేదంటే నిన్నూ, నువ్వు ఆరాధించే ఆ మట్టి బొమ్మనీ కూడా మర్దించేస్తాను" అన్నాడు.

కామరూపుడు ఆ మాటలకు భయపడలేదు, భీమాసురుడు కామరూపుడు తన మాట వినలేదని వెర్రెక్కిపోయాడు. తనంతటి వాడిని నిర్లక్ష్యం చెయ్యడమా! అందునా ఒక ఖైదీ, పై పెచ్చు మట్టిముద్దను నమ్ముకుని! "హు:! ముందస్తుగా ఆ మట్టి కుప్పని కొట్టేయాలని అకున్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టినట్టు భీమాసురుడు తన చేతి ఖడ్గంతో కామరూపుడిచేత ఆరాధించబడుతున్న పార్ధివమూర్తిని ఒక్క వేటు వేశాడు. 

అంతే ఫెళ ఫెళమంటూ  ఆ పార్థివ లింగం నుండి వెలువడ్డాడు మృడుడు, నా భక్తుణ్ణి రక్షించుకోవడమే నా కర్తవ్యం. నా ఆశయం అంటూ ఒక్క హుం' కారం చేసేసరికి భీమాసురుడూ, వాడి సైన్యమూ కూడా బూడిదైపోయారు. అక్కడితో ఆగకుండా ఆ హుంకారాగ్ని పారిపోతున్న రాక్షసులను వెంట తరిమింది. అడవులూ, పర్వతాలూ ఆక్రమించింది. భీమాసుర పరివారాన్నంతా దగ్ధం చేసింది. ఆ బూడిదే కాలాంతరాన ఔషధం అయ్యింది.

భక్తులైన సుదక్షిణా కామరూపుల సంరక్షణార్ధం వెలసిన ఆ స్వామిని అక్కడే కొలువుండమని కోరగా భీమేశ్వరుడనే పేర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఆ పరమశివుడు. సర్వ సంకటహారకుడు, సమస్త బంధన విమోచకుడు అయిన ఆయన దర్శనం, ఆయన్ని అర్చించడం అత్యంత పుణ్యదాయకాలు. అలాంటి జ్యోతిర్లింగాన్ని కార్తీకమాసంలో దర్శించుకున్నా, ఆ కథ గురించి తెలుసుకున్నా, విన్నా ఎంతో గొప్ప పుణ్యం వస్తుంది. 

◆ వెంకటేష్ పువ్వాడ