Read more!

అగస్త్య బ్రాత ఆశ్రమమని ఎందుకంటారు??

 

అగస్త్య బ్రాత ఆశ్రమమని ఎందుకంటారు??

పురాణాలలో అగస్త్య మహాముని గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంటుంది. ఈయన ఏ తల్లి గర్భంలో నుండి పుట్టలేదు. ఒకసారి వరుణుడు, మిత్రుడు ఇద్దరూ యజ్ఞం చేస్తున్నప్పుడు వారి ముందు అప్సరస అయిన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆమెను చూసిన వాళ్ళిద్దరితో మొహం పుట్టి వారి వీర్యం జారిపడుతుంది. అది నేరుగా అక్కడున్న కుండలోకి పడుతుంది. ఆ కుండలో అగస్త్యుడు, వశిష్ఠుడు ఇద్దరూ కవలలుగా పెరుగుతారు. అందుక్స్ అగస్త్యున్ని కుంభయోని అని అంటారు. అంటే కుండలో నుండి పుట్టినవాడు అని అర్థం.

ఇక అగస్త్యున్ని ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అది ఎమిటంటే, పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలో ఇల్వలుడికి చనిపోయిన వారిని బతికించే సంజీవని విద్య తెలుసు.  వాతాపికి నచ్చిన జంతువు రూపంలోకి మారే విద్య తెలుసు.  ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, "అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి" అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు (త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టే తద్దిన భోజనంలో మాంసం వండేవారు. ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత ఇల్వలుడు తనకు తెలిసిన సంజీవని మంత్రం చెప్పి వాతాపి! రా అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.

ఇలా చాలాకాలం, చాలా మందిని వాళ్లు చంపి తిన్నారు. ఒకరోజు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని వాళ్లిద్దరూ చూసారు. వాళ్ళకు అగస్త్య మహర్షి అని, ఆయన ఎంతో శక్తిగల వాడు అని తెలియదు. వాళ్ళు ఆయన్ను కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది(భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు గురించి అన్ని వివరంగా తెలిసిపోతూ ఉంటాయి) కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు అగస్త్య ముని.  ఇది తెలియని ఇల్వలుడు ఎప్పటిలా సంజీవని మంత్రం చెప్పి "వాతాపి రా!!" అన్నాడు.

"నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా" అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.

ఆ మాటలు విని ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపానికి మారి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే  అగస్త్య భ్రాత ఆశ్రమం అయ్యింది.

ఇప్పటికీ ఎవరైనా తిన్నది జీర్ణం కాకుంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉండటం గమనించవచ్చు.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.