ఇంద్ర-బ్రహ్మ లోకాలు గెలిచిన శరభంగముని !!

 

ఇంద్ర-బ్రహ్మ లోకాలు గెలిచిన శరభంగముని !!


సీతారమ లక్ష్మణులు అడవులలో ప్రయాణం చేస్తూ శరభంగ ముని ఆశ్రమానికి చేరుకున్నారు, వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డార అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.

ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి "లక్ష్మణా! లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు, ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చె ఇంద్రా, అని పిలుస్తాము కదా, అదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను" అన్నాడు.

అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు.

"రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి" అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు.

"రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్ని గెలిచాను, అందుకని నన్ను తీసుకు వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిథి వచ్చాడు. అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామా! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు" అని శరభంగుడు అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు "మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను" అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు ఇక్కడికి దగ్గరలో సుతీక్షుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామా! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను. అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం (ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది. దానికి కాలం అయిపోయింది) కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను" అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు.

ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరముతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకములోకి వెళ్ళిపోయాడు.

అలా రామాయణంలో ఎంతో గొప్ప తపశ్శక్తితో బ్రహ్మ లోకాన్ని చేరిన శరభంగుడు కూడా ఉన్నాడు.


                               ◆ వెంకటేష్ పువ్వాడ.