Read more!

అర్జునుడి ప్రశ్నతో మనకు దొరికే సమాధానాలు!!

 

అర్జునుడి ప్రశ్నతో మనకు దొరికే సమాధానాలు!!


జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దనః

తత్కిం కర్మణీ ఘోరే మాం నియోజయసి కేశవ॥

ఓ కేశవా! నీవుచెప్పిన దానిని బట్టి కర్మకంటే జ్ఞానమే మంచిది అనేది నీ మతం అని తెలుసుకున్నాను. అలాగైతే నన్ను ఈ భయంకరమైన, హింసతో కూడిన, సర్వనాశన హేతువైన, ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? అని అడిగాడు అర్జునుడు. 

ఇప్పటి దాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పాడు. అదే మంచిది అని అభిప్రాయపడ్డాడు. కర్మకంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు నియోగిస్తున్నాడు అని అర్జునుని సందేహము.

రెండు వస్తువులను పోల్చాలంటే ఆ రెండు వస్తువులు సమాన ధర్మములు కలిగి ఉండాలి. ఇక్కడ జ్ఞానము వేరు కర్మవేరు. కర్మవల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలను ఆచరించడం జ్ఞానం సంపాదించడానికి తొలిమెట్టు. ఇది సరిగా అర్థం చేసుకోలేదు అర్జునుడు. జనార్ధనా! అంటే సమస్త జనులు తమ కోరికలు తీరడానికి ఎవరిని ఆశ్రయిస్తారో, యాచిస్తారో, ప్రార్థిస్తారో, అతనే జనార్దనుడు.


ఇప్పుడు జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా అనే సందేహం కలిగింది అర్జునుడికి, ఎటూ యుద్ధం చేయడం అర్జునుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాకుతో తప్పించుకోవచ్చని ఈ ప్రశ్న అడిగాడు.


కృష్ణా! నువ్వు నన్ను చాలా గందరగోళం చేస్తున్నావు. ఒక పక్క జ్ఞానం అన్నిటికన్నా గొప్పది. అని చెప్పి మరలా ఈ పాపపు కర్మ అయిన యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు. ఇదేం బాగాలేదు అని అన్నాడు. నిజానికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాని అర్జునుడి మనసులో యుద్ధం వలన అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి యుద్ధం మానెయ్యాలని ఉంది. అందుకే తనకు అనుకూలమైన జ్ఞానయోగం మాత్రమే తీసుకున్నాడు. 


కృష్ణుడు చెప్పింది ఏమిటంటే జ్ఞానయోగం పొందడానికి కర్మయోగము ఒక సాధనము అని చెప్పాడు కానీ ఒకదానితో ఒకటి పోల్చలేదు. ఇక్కడ అర్జునుడు జ్ఞాన యోగము కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. అదీ అర్జునుడు చేస్తున్న పొరపాటు. ఒక వస్తువు మరొక వస్తువును కంపేర్ చెయ్యాలంటే రెండు వస్తువులకు కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఇక్కడ జ్ఞానం వేరు కర్మ వేరు. ఎలా పోలుస్తాడు. అది అర్జునుడికి అర్థం కాలేదు. కృష్ణుడు చెప్పింది. ఏమిటంటే.... 'బాబూ ముందు నువ్వు నిష్కామ కర్మ చేయడం అలవాటు చేసుకో దానితో మనస్సు, ఇంద్రియములు నీ అధీనంలో ఉంటాయి. చిత్త శుద్ధి వస్తుంది. తరువాత జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి అవుతావు' అని చెప్పాడు. ఇది అర్థం కాక అర్జునుడు ఈ సందేహం లేవదీసాడు.

ఈ లక్షణం మనలో చాలా మందికి ఉంది. ఉదాహరణకు చెయ్యి కడుక్కొని భోజనం చేయి అన్నామనుకోండి. చెయ్యికడుక్కోవడం, భోజనం చేయడం ఒకటి కాదు. రెండింటినీ ఒకదానితో ఒకలి పోల్చకూడదు. చెయ్యి కడుక్కుంటే చేతులు శుభ్రపడతాయి. అప్పుడు భోజనం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే కర్మల వలన మనసు నిర్మలం అవుతుంది. అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత వస్తుంది. ఇదీ కృష్ణుడు చెప్పింది.


సాధారణంగా మనము మన మనసుకు ఏది నచ్చుతుందో దానినే వింటాము. దానిని మనకు అన్వయంచుకుంటాము. ఇతరములు మంచివి అయినా వాటి గురించి పట్టించుకోము. అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అన్నిటినీ సమబుద్ధితో స్వీకరించాలి అని అంటారు. మనకు అనుకూలమైన మాటలు విని, దానికి మన అరకొర జ్ఞానమును జోడించి దానిని మనకు అన్వయించుకుంటే అది దుష్పరిణామాలకు దారి తీస్తుంది.

                                ◆వెంకటేష్ పువ్వాడ.