ఆదిశంకరుల రచనల పరంపర!!
ఆదిశంకరుల రచనల పరంపర!!
శంకరులు గొప్ప వేదాంతిగానే గాక అసామాన్య రచయితగా, కవిగా కూడా ప్రసిద్ధులయ్యారు. అత్యల్ప జీవితకాలంలోనే అశేష రచనలు చేశారు. శంకరుల రచనల సమగ్రజాబితా చూస్తే శంకరులు రచించిన భాష్య గ్రంథాలు 23, ప్రకరణ, ఉపదేశ గ్రంథాలు 51. స్తోత్ర స్తుతి గ్రంథాలు 76, మొత్తం 153 కేవలం 32 సంవత్సరాల జీవితంలో, నిరంతర దేశాటనం చేస్తూ, వాద ప్రతివాదాలు చేస్తూ, అవైదికమైన ఇతర మతాలను ఖండిస్తూ, వేలమంది శిష్యులకు గురుత్వం వహిస్తూ, దేశం నలుమూలలా మఠాలను స్థాపించి వైదిక మత ప్రచారానికి, పటిష్టతకు కృషి చేస్తూ 153 గ్రంధాలు రచించి రాబోయే తరాలను ఉజ్జీవింప జేశారంటే ఆయన సాధించింది. మానవాతీతంగానే కనిపిస్తుంది. గాని అది నిజం, మానవాళి అదృష్టం. ఇవి చదివి అర్థం చేసుకోవడానికి ఒక జీవిత కాలం చాలదు.
దశోపనిషత్తుల మీద, బ్రహ్మసూత్రాల మీద, భగవద్గీత మీద మొదటి సారి సమగ్ర వ్యాఖ్య వ్రాసింది శంకరులే, ఈ వ్యాఖ్యలు అద్వైతపరంగా రచించారు. ఈ వ్యాఖ్యల ప్రాముఖ్యం ఇంతింతని చెప్పరానిది. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం మీద కూడా మొదట వ్యాఖ్య వ్రాసింది వారే.
ప్రకరణ గ్రంథాలలో వివేక చూడామణి మకుటాయమానమైనది. దీనిలో 582 శ్లోకాలున్నాయి. ముందుగా గురువు గోవిందపాదులకు నమస్కరించి గ్రంథారంభంలోనే చెప్పిన శ్లోక తాత్పర్యం ఈ విధంగా ఉంది:-
జీవులలో నరుడుగా(మనిషిగా) పుట్టడం దుర్లభం, అందులోనూ, పురుషుడుగా, విప్రుడిగా, వైదిక కర్మ మార్గానువర్తిగా, విద్యాంసుడిగా, వివేచరుడుగా పుట్టడం మరీ దుర్లభం, జన్మజన్మాల సాధన వల్ల, పుణ్యఫలం వల్ల మాత్రమే ముక్తి సాధ్యం సుమా! అని ఆయన చెప్పవలసినదంతా మొదటి శ్లోకంలోనే క్లుప్తంగా చెప్పడంలోనే ఆయన ప్రతిభ కనిపిస్తుంది. మానవుడిగా పుట్టడం, మోక్షం మీద ఇచ్చ ఉండడం మహాపురుషుల ఆశ్రయం అంటే సత్సంగం అనేవి భగవదత్తాలు మాత్రమే అని ఆయన చెప్పిన ఈ గ్రంథానికి 'వివేకచూడామణి' అనేపేరు సార్థక నామం అయింది.
తరువాత ఆయన ప్రకరణ గ్రంథాలలో, నిర్వాణషట్కం, సాధన పంచకం, మనీషాపంచకం ఆత్మబోధ, సర్వవేదాంత సిద్ధాంతసార సంగ్రహం మొదలైనవి ప్రసిద్దాలు.
ఆయన స్తోత్రాలలో శ్రీ కనకధారాస్తవం, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, జగన్నాథాష్టకం, గంగాస్తోత్రం ప్రసిద్ధాలు, భజగోవింద శ్లోకాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అవి శంకరులు, వారి శిష్య బృందం కలిసి చెప్పినవి.
ఇక ఆయన స్తోత్రసాహిత్యంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందింది. సౌందర్యలహరి, ఇందులో 100 శ్లోకాలున్నాయి. మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని తరువాతి 59 శ్లోకాలను సౌందర్యలహరి అని అంటారు. ఆనందలహరిలో శ్రీవిద్య, చంద్రకళావిద్య, కుండలిని విద్య, శ్రీచక్రార్చన మొదలైనవి ఉన్నాయి. సౌందర్యలహరిలో దేవీ వైభవము, ఆ తల్లి మహిమలు, ఆమె కరుణాకటాక్షాలు వర్ణించబడ్డాయి. ఇందులో కొన్ని ఉపాసనలు, యంత్ర విశేషాలు ఉన్నందువల్ల మంత్ర శాస్త్రంలో ప్రవేశమున్నవారు మాత్రమే దీన్ని విశ్లేషించగలరు.
ఈవిధంగా ఆదిశంకరుల రచనా ప్రాశస్త్యం కూడా ఆమోఘంగా అందరినీ అలరిస్తుంది.
◆ వెంకటేష్ పువ్వాడ