Read more!

"ఓం" అనేదానికి అసలైన అర్థం!!

 

"ఓం" అనేదానికి అసలైన అర్థం!!

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః౹౹

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥

బ్రహ్మను ఓం అనీ, తత్ అనీ, సత్ అనీ మూడు విధములుగా నిర్ణయిస్తారు. ఈ మూడు పేర్లతోనే పూర్వము బ్రాహ్మణులను, వేదములను, అందులో చెప్పబడిన యజ్ఞవిధులను నామరూపములతో నిర్వచించారు.


ఇక్కడ మరొక విషయం ఓం కారమును ప్రణవం అని అంటారు. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓంకారము. ఓం కారమునే బ్రహ్మ అని అంటారు. "ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ" అని సంధ్యావందనంలో చెప్పుకుంటారు. ప్రతి పదమునకు ముందు ఓం అని చేరుస్తారు. అష్టోత్తరములో కానీ, సహస్రనామములలో గానీ, ఓం ముందు ఉంటుంది. ఈ ఓం కారము వలననే వేదములు, సమస్త వాఙ్మయము ఏర్పడింది. యజ్ఞములలో ఓంకారము అత్యంత ప్రాధాన్యమయింది. పరబ్రహ్మ స్వరూపమునకు పేరు లేదు, రూపము లేదు. కాని పరబ్రహ్మను ధ్యానించాలంటే ఏదో ఒక శబ్దము కానీ, రూపము కానీ ఉండాలి కదా. అందుకే ప్రణవ పుట్టింది. అదే ఓంకారము. అకార, ఉకార, మకారాలు కలిస్తే ఓంకారము. తరువాతవి తత్ సత్ ఈ మూడు మంత్రముల ద్వారా పరబ్రహ్మను ధ్యానించేవారు పూర్వపు ఋషులు. ఓం తత్ సత్ అనేవి పరబ్రహ్మకు ప్రతీకలు.

"తన్యవాచకః ప్రణవః" ఆ పరమాత్మయొక్క నామమే ఓంకారము "తజ్ఞపస్తదభావనమ్" ఓంకారమును జపిస్తూ దాని అర్ధమును మనసులో భావించాలి.

ఓం అంటే మనలను పోషించేది, రక్షించేది అని కూడా అర్థం. అదే పరబ్రహ్మ స్వరూపము. తత్ అంటే “అది" అన్నిటి కన్నా దూరంగా, వేరుగా, అగోచరమైనది, రూపములేనిది. అందుకని దానిని తెలుసుకోవడానికి మనం శబ్దమునే ప్రమాణంగా స్వీకరిస్తాము. ఆ శబ్దమే ఓం. తత్ అంటే ఆ ఓం కారము సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, నాశము లేనిది, మార్పులేనిది. ఈ ఓం తత్ సత్ నుండి బ్రహ్మను గురించి తెలుసుకున్న బ్రాహ్మణులు, వారు అధ్యయనం చేయడానికి వేదములు, ఆ వేదములలో చెప్పబడిన ప్రకారము చేయవలసిన క్రియలు అంటే యజ్ఞములు ఆవిష్కరింపబడ్డాయి.

మనం ఎన్నో పుణ్యకర్మలు, యజ్ఞయాగములు వ్రతములు చేస్తుంటాము. వాటిలో మనకు తెలియకుండా ఎన్నో లోపాలు తప్పులు జరుగుతుంటాయి. ఉచ్ఛారణ దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఓం తత్సత్ అనే మంత్రంతో పటాపంచలయిపోతాయి. ఏ దోషమూ అంటదు. అందుకే ఏ కార్యక్రమం అయినా ఓం తత్సత్ అనే మంత్రంతో పూర్తి చేస్తాము. కాని ఈ మంత్రమును కేవలం యాంత్రికంగా కాకుండా అర్థం తెలుసుకొని అంటే పరమాత్మను మనసులో భావిస్తూ ఆ మంత్రము పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమే అని భావిస్తే, ఆ మంత్రము ఎక్కువ శక్తిమంతంగా పనిచేస్తుంది.

వేద మంత్రములు ఉచ్ఛరించేటప్పుడు, యజ్ఞయాగములు చేసేటప్పుడు ప్రతి మంత్రం ముందు ఓం కారము జపిస్తారు. అందువలన ఈ బీజాక్షరములను ఓంకారము అంటే ఏకాక్షర మంత్రంగా ఋషులు మనకు అందజేసారు. ఏ మంత్రము జపించలేని వారు ఓంకారమును జపిస్తే చాలు. ఓమ్ అంటే పరబ్రహ్మ స్వరూపము. తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే, సత్ సత్యమైనది, నిత్యమైనది. నాశము, మార్పులేనిది. పరబ్రహ్మము తప్ప మిగిలినది అంతా నాశనం అయ్యేదే మార్పుచెందేదే. ఈ ఓంతత్సత్ అనే పదం నుండి బ్రహ్మ సత్యం జగన్మిధ్య అనే సూక్తి ఆవిర్భవించింది. కాబట్టి అందరూ ఓంతత్సత్ అనే మంత్రమును జపిస్తూ, దాని అర్థం. తెలుసుకొని, పరమాత్మ ఒక్కడే సత్యము మిగిలినది అంతా అసత్యము, మిథ్య, ఈ రోజు ఉండి రేపు ఉండకుండా పోయేదే అనే సత్యమును గ్రహిస్తూ ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని, అనుబంధాన్ని తగ్గించుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ