Read more!

ప్రేమ నేను , నేనే ప్రేమ - సత్యసాయి బాబా

 

ప్రేమ నేను , నేనే ప్రేమ - సత్యసాయి బాబా

 

“ప్రేమ నా స్వరూపం, నా స్వభావం. ప్రేమే నేను. నేనే ప్రేమ” అన్నారు భగవాన్ సాయి. ''నా జీవితమే నా సందేశం. ప్రేమే నా సందేశం'' అనేవారు.

“ప్రపంచంలో ఉన్న అసమానత్వాన్ని అడుగడుగునా వెలికితీసి వెక్కిరిస్తుంటుంది, ప్రేమ అభావం. ‘అనేకత్వంలోని ఏకత్వాన్ని రుచి చూసి, ధరించిన దేహం, ఆత్మ చైతన్యం – ఒక్కటే సుమా. ఆ చైతన్యం ఉన్నంతవరకూ ఈ దేహాలు ‘శివం’గా మంగళకరంగా మనగల్గుతాయి.

ఆ చైతన్యం వీడిన వెంటనే ఏమీ విలువ లేని శవాలుగా శ్మశానవాటికకు తరలింపబడుతాయి. ఈ సత్యాన్ని గ్రహించండి. అర్థం చేసుకోండి. కలతలు, ద్వేషాలు, హెచ్చుతగ్గులు తగ్గించుకోండి” అనేదే బాబా హెచ్చరిక.

ఈ సత్యాన్ని గ్రహించే తత్వం మానవులలో మంగళకరమైన మంచి భావాల్ని ఆవిర్భవింపచేస్తుంది. అప్పుడా మంచి భావాలు సుందరంగా రూపొంది, వారిచేత మంచి పనుల్ని చేయిస్తాయి.

ఈ విధంగా మనస్సుతో మానవులలోని సమానత్వాన్ని గ్రహించే తత్వం, హృదయంతో మంచిగా ఉండాలి. మంచి చెయ్యాలనే స్పందన ఉద్బవించటం, వెనువెంటనే చేతుల్తో (క్రియలు) మంచి పనులు చెయ్యటమనే ప్రక్రియ జరుగుతుంది. ఈ త్రికరణాలు – మనస్సు, హృదయం, చేతులు భగవాన్ చెప్పే మూడు Hలు Head, Heart, Hands.

త్రికరణ శుద్దితో, పవిత్రతతో మానవులు ప్రేమ స్వరూపులుగా, దివ్య స్వరూపులుగా మారుతారు. నేను వచ్చింది “ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చటానికి, మీలో ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దటానికి. అదే నా అవతార లక్ష్యం. నా కర్తవ్యం” అని చెప్పేవారు సత్యసాయి.

భగవంతుడు యోగభూమి, త్యాగభూమి, పుణ్యభూమి అయిన పవిత్ర భారతావనిలో, వివిధ కాలాల్లో దశావతారాల్లో వచ్చాడు. తాత్కాలిక ఫలితాలే అయినా సమయానికి, పరిస్థితులకి తగ్గట్లు ఏదో ఒక లక్ష్యసాధనకు ఏదో ఒక రూపంలో వస్తుంటాడు.

యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత!

అభ్యుత్థాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్!!

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.

“ఓ మానవుడా నీకు ప్రేమ లేకపోవడం చేతనే, నీకు స్వార్థం కలుగడం చేతనే ఇన్ని విధాల బంధాలతో జగత్తులొ చిక్కుపడి ఉన్నావు. త్యాగము, ప్రేమ, ధర్మము నీలో కలిగినపుడు దివ్యమైన మానవునిగా రూపొందుతావు” అంటూ ఏ రూపమైనా, ఏ నామమైనా అనేకత్వం లోని ఏకత్వాన్ని ప్రబోధించేవారు.

భగవంతుడు అద్వితీయుడు, అప్రమేయుడు. అతనిని వర్ణించటానికి ఏ ప్రమాణమూ అక్కర్లేదు. రెండవ పదార్థముంటేనే పోలిక అనేది జరుగుతుంది. సర్వత్రా ఉన్నది ఒక్క సర్వేశ్వరుడే. రెండవ పదార్థమే లేదు.

“ఏకం ఏవ అద్వితీయ బ్రహ్మ “అనే భగవత్తత్వాన్ని గుర్తింప చేసి నిమిత్తమే భగవంతుడుద్భవిస్తాడు, అందుకే మానవుడు కూడా భగవత్తత్వాన్ని గ్రహించి, గుర్తించి, అర్థం చేసుకుని, తాను బ్రహ్మ యందే పుట్టి, బ్రహ్మలోనే పెరిగి, బ్రహ్మలోనే ఐక్యమవుతానన్నది తన ధ్యేయంగా భావించాలి.

‘భగవంతుడా, నీకంటే అన్యముగా భావించ వీలు కాదు. నేను నీలోనే, నీతోనే ఉండాలి, నీతోనే జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఇదే నా లక్ష్యం’ అనాలి. ఆ విధంగా భక్తితో, రక్తితో, అనురక్తితో, రాగంతో, అనురాగంతో భగవంతుని రకరకాలుగా ఆరాధిస్తుంటారు మనుష్యులు.

భగవంతుడెక్కడో మందిరాల్లో, మసీదుల్లో. చర్చీల్లో ఉన్నాడని భావించి, ప్రార్ధిస్తుంటారు. భగవంతుడు తమ ప్రార్ధనలకు స్పందించి, సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తారు.

ఇంకా ఆక్రోశంతో విలపిస్తూ, ‘నీకు చెవులు లేవా, విన్పించడం లేదా; నీది రాతి గుండె అయిపోయిందా కరగటం లేదా’ అని విలవిలలాడతారు. వేదన వెలిబుచ్చుతారు.

క్రమేపి ఆధ్యాత్మికం వంటబట్టి భగవంతుడెక్కడో లేడు, నాలోనే ఉంటున్నాడు. నా హృదయ పీఠికలోనే ఉన్నాడనే విశ్వాసంతో ఉంటుంటారు.

నిండు సభలో కౌరవులచే అవమానింపబడి ద్రౌపది ఆవేదనతో కృష్ణభగవానుని ‘హే ద్వారక వాసా, మధుర నగర నివాసా’ అని మొరపెట్టుకుంటే వెంటనే ఆర్తత్రాణపరాయణుడు ఆమెకు సహాయసహకారాలు అందించాడు.

ఆ విధంగా పరిత్రాణాయ సాధునాం. అని ఆనాడు ( ఆ యుగంలో) పలికిన కలియుగంలో ధర్మం క్షీణించి, మానవతా విలువలు మట్టిలో కలిసిపోయి, తోటి మనిషిని హింసించి ఆనందించే నేపద్యంలో భగవానుడు శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాగా అవతరించి, ‘ప్రేమ’ అనే దివ్యాస్త్రంతో ప్రపంచ రూపులేఖల్ని మార్చటానికి కృషి చేశారు. ప్రేమ రెండక్షరముల పదమే అయినప్పటికీ దీని విలువ అత్యధికమైనది. ప్రేమ లేకున్న ప్రాణమే లేదు. ప్రేమను సత్య,ధర్మ,శాంతి,అహింసల యందు అంతర్వాహినిగా ప్రవహింపచేసుకోవాలి.

“ప్రేమ అంతర్వాహినిగా లేకున్న అది సత్యమూ కాదు ధర్మమూ కాదు, శాంతమూ కాదు. అహింసా కాదు. ప్రేమ మన ఆలోచనలో, సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యం.

ప్రేమను మన చర్యలలో నిరూపించిన అదే ధర్మమవుతుంది. ప్రేమతో కూడిన భావం, శాంతి, ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు అది అహింస కాదు. ప్రేమ మన ఆలోచనలో, సంకల్పంలో ప్రేవేశిస్తే అది సత్యం.  ప్రేమతో కూడిన భావం శాంతి. ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు అది అహింస అవుతుంది. మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వాన్ని సేవించటం భక్తి. భక్తికి రూపం ప్రేమ, దైనందిన కార్యక్రమాన్ని ప్రేమతో ప్రారంభించు. దినమంతా ప్రేమతో నింపు; ప్రేమతోనే రోజును ముగించు; అదే భవవంతుని చేరే మార్గం” అని ప్రేమకు నిర్వచనం చెపుతారు భగవాన్.

గత 60 సంవత్సరాలుగా భగవాన్ బాబా సాగిస్తున్న ఈ పవిత్ర యజ్ఞంలో వీలైనంతమంది పాల్గొని, మరింకెంతో మందిని పాల్గొనేటట్లు చేసి, తమ వంతు కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలి. నిర్వర్తించటానికి దీక్ష పూనాలి. ప్రస్తుతం కనిపిస్తున్న భీకర ప్రళయాగ్ని సమసిపోయేటట్లు పవిత్ర ప్రేమ వాహినిని ప్రవహింపచేద్దాం.

ఈ సందర్భంగా భగవాన్ మాటల్నిజ్ఞాపకం చేసుకుందాం- “మీ హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించడానికే నేను వచ్చాను. ఏ ఒక్క ధర్మ ప్రచారం కోసం నేను రాలేదు. మీ ప్రేమ వాహిని విశాలమై ప్రవహించాలి. ప్రవహించకుండా నిలిచిన నీరు దుర్గంధ భూయిష్టమగును. అందుచే ప్రేమను ప్రవహించనివ్వండి. ప్రేమయే ఆనందం, శక్తి, జ్యోతి, దైవం. నాకొక పేరు ఉండాలని మీరు తలిస్తే [ప్రేమ స్వరూపుడని పిలవండి” - ఇవీ ఆ మహనీయుని మాటలు.

ప్రస్తుత పరిస్థితుల్లో భీకర ప్రళయంకారులుగా మారణ హోమాన్ని ప్రజ్వరిల్లచేస్తున్న వారి దుష్టభావాన్ని సమిధలుగా ఆ హోమంలోనే ఆహుతి చేసేటట్లు ప్రార్ధిద్దాం. ఆ పవిత్ర హోమగుండంలో దుష్టభావాల్ని ఆహుతి చేస్టారని ఆశిద్దాం.

అట్టి దివ్యత్వంలో, ప్రేమాత్మ స్వరూపులుగా వినుతికెక్కి, వారు సమాజానికి, దేశానికి, ప్రపంచానికి విశిష్ట, విశేష’ సేవలందించారు. ఆ విధంగా, “నేనే ప్రేమ – ప్రేమే నేను – ప్రేమే నా జీవితం సందేశం” అంటూ భగవానులు చేసిన దివ్యప్రేమ యజ్ఞంలో మనందరం శాంతి దూతలుగా ప్రేమ మంత్రాన్ని నలు దిశలా పఠిస్తూ పవిత్ర సేవలనంద చేద్దాం.

‘నా హృదయ పీఠికలో నాట్యమాడే దేవా’ అనుకుని, నమ్మి, ప్రార్థిస్తున్న మనం, ఆ దేవదేవుడే అందరి హృదయాల్లోను కూడా నాట్యమాడుతున్నాడనే సత్యాన్ని గ్రహించి, ఆ గ్రహింపు ఫలితంగా ఆవిష్కరించే దివ్య ప్రేమను అందరికీ పంచుదాం. లోక కల్యాణానికి పాటు పడదాం.

“లోకస్సమస్తాః సుఖినోభవంతు!!”

సంకలనం – తూములూరు ప్రభ