Read more!

ప్రచారం కాదు – ఆచారం ప్రధానం

 

ప్రచారం కాదు – ఆచారం ప్రధానం

 

ప్రేమ – ప్రేమ – ప్రేమ అంటూ భగవాన్ బాబా తమ అమూల్య, అద్వితీయ అఖండ ప్రేమను ఎంతోమందికి ప్రసాదిస్తుంటారు. తెల్లవారిన దగ్గర నుంచి స్వామి ప్రేమ కోసం వెయ్యి కళ్లతో, అర్రులు చాస్తూ ఉంటారు. వేలకు వేల భక్తులు. ప్రేమ నా స్వభావం అనేసి మాట్లాడక ఊరుకోరు స్వామి.

నెమ్మది నెమ్మదిగా, అడుగులో అడుగులు వేసుకుంటూ, మందస్మిత వదనంతో బారులు తీరి కూర్చున్న భక్తుల దగ్గరకు వచ్చి, తమ ప్రేమను అందిస్తూ, “నేనే ప్రేమ, ప్రేమే నేను” అనే విషయాన్ని ఆచరణలో చూపిస్తారు.

అదే సామాన్య మాతాచార్యులో, గురువులో అయితే, శిష్యులు వారి దగ్గరకు లైనుల్లో వెళ్లి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకునేవారు.

కాని, స్వామి భక్తుల దగ్గరకు తాము స్వయంగా వెళ్లి వారికి స్వాంతన కలుగచేసేవారు. భగవాన్ అనుగ్రహించిన ఈ ప్రేమ యొక్క ప్రభావం వర్ణనాతీతం. స్వామి ఒక్కసారి చూస్తే చాలు, భక్తులు తనువులు పులకరించి తబ్బిబైపోయేవారు. ఇంకా కొంచెం ముందుకి వచ్చి భక్తుల చేతిలో ఉన్న ఉత్తరాల్ని, వినతిపత్రాల్ని తీసుకుంటే ‘ఆనందానికి అవధులుండేవికావు. అదృష్టం ఇంకా బాగుండి, భగవాన్ మాట్లాడితే, ‘బంగారూ’ అని ప్రేమగా పలకరిస్తే: ఇంక వారి అదృష్టం పండినట్లే. స్వామి interview కి రమ్మంటే – ఇంకేముంది ప్రపంచంలో ఉన్న సంపదంతా ఒళ్లో పడ్డట్లే మరిసిపోయేవారు. భక్తుల అవసరాలను గ్రహించిన భగవాన్ రకరకాలుగా తమ ప్రేమను ప్రసాదించేవారు. ఇది ప్రచారం కోసం కాదు.

“ప్రపంచంతో నాకు పని లేదు. ఆచారమే నాకు ప్రధానం. మీరేమి భావించినా, నా సత్యం నా సత్యమే. ప్రేమ, త్యాగంలోనే నాకు ఆనందం. ఆ ఆనందంలోనే ఇంత కాలం ఈ కార్యాలీ చేస్తున్నాను. మీ ఆనందమే నా ఆహరం” అన్నారు భగవాన్. స్వామి ఐ విధంగా స్వార్ధ రహితంగా తను ప్రేమను ‘ఆచరణ’ రూపంలో లక్షల మందికి అందివ్వటమే కాకుండా, మానవులుగా జన్మించినందుకు పవిత్ర ప్రేమను పది మందికి పంచాలని మనకు చెపుతారు. ఆచారం మొదట – ప్రచారం తర్వాత అన్నారు భగవాన్.

“మానవులు ఆచరణ, ఆచరణ అని ఆడంబరాలు పలుకుతారు. ఇవన్నీ లెక్చర్లు – ఒట్టిగ్యాస్, ఇవన్నీ పుస్తకాలు చదివేది, నోటు చేసుకొనేది. లెక్చర్లు చెప్పేది. ఆచరణ చూస్తే జీరో” అంటారు బాబా, ఆడంబర భక్తులు గురించి బాధగా, ‘గంగ గోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అన్నట్లు ఏ ఒక్క ఆచరణ మంచినైనా ఆచరలో పెట్టాలి, అదే చాలు. “భగవద్గీతను పారాయణం చేస్తారు. శ్లోకాల్ని కంఠస్థం చేస్తారు. కాని ఏమి ప్రయోజనం? ఏ గూళ్లోకో, హరికథకో, పురాణానికో వెళ్ళి, కూర్చుంటే చేసేదంతా అనవసర ప్రసంగాలు, ఆడంబరాలు, అనేకత్వ ప్రదర్శనలు.

“భగవద్గీత, బైబిల్. ఖూరాను, గ్రంధ సాహెబ్ మొదలైన పవిత్ర గ్రంథాలు పారాయణ నిమిత్తమై ఆవిర్భవించలేదు. ఆచరించే నిమిత్తమై అందించినట్టివి. మనము ఆచరణలో పెట్టాలి. శ్లోకాలు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వ్యాఖానాలు చేసి ఏమి ప్రయోజనం? ఇది భక్తి అవుతుందా? కాదు. కాదు. ఇది ఆడంబరమైన తత్వము. ఈనాడు ఆకారమానవుని కంటే, ఆచార మానవుడు అత్యవసరము” అని చెప్పారు స్వామి.

ఈ ప్రేమతత్వాన్ని ప్రచారంగా కాక ‘ఆచారం’గా స్వీకరించాలని భగవాన్ తమ ప్రబోధల ద్వారా విపులీకరిస్తారు. ప్రేమ తత్వం పట్టుబడాలంటే భ్రమకి, బ్రహ్మకి ఉన్న వ్యత్యాసం గుర్తించాలన్నారు బాబా.

“ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటమే భ్రమ. అనేకత్వమును ఏకత్వముగా స్వీకరించడమే బ్రహ్మ! వేదంలో ‘సహనావవతు సహనౌ భునక్తు; వీర్యం తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై’ అని ఏకత్వం బోధిస్తుంది.

వేదము బోధించే పవిత్రమైన నిత్యసత్యమైన సూక్తులను మానవుడు గుర్తించి ఆచరణలో పెట్టాలి అని సర్వజీవులకు ప్రాణ సమానమైనది, జాతి మత భేదము లేమాత్రము లేనిది, అనంతమైన విశాల భావములతో కూడినది. సర్వధర్మములకు మూలమైనది అయిన పవిత్ర వేదములో ఉన్న సత్యసూక్తులను ఎవ్వరూ సరిగా గుర్తించటం లేదు. సంకలనం

– తూమూలూరు ప్రభ