Read more!

ప్రకృతి వైచిత్రాలు

 

ప్రకృతి వైచిత్రాలు

 

పరమాత్మను గ్రహించటం మాటలా! మాయకు లోబడి, దేహాభ్రాంతిలో,ఇంద్రియాలకు లోనైన మానవుడు అనేకానేక ప్రవృత్తులతో ప్రవర్తిస్తుంటాడు. ఒక్కొక్క మనిషిలో తామసిక, రాజసిక, సాత్విక ప్రవృత్తులు విడివిడిగా ఉండనక్కర్లేదు. ఒక వ్యక్తిలోనే ఈ అన్ని ప్రత్యక్షమవవచ్చు. ఆయా సమయాన్ని పరిస్థితిని బట్టి ఉదయం సత్వగుణంతో స్థిమితంగా ఉంటూ, మంచి ఆలోచనాసరళి, సాత్విక ఆహార విహారాదులతో ఉన్న వ్యక్తి రోజు గడిచే కొద్దీ, తీసుకున్న ఆహారం, కలిసి తిరిగే సంఘం (వ్యక్తుల్ని) బట్టి తామసిక ప్రకోపాలకి గురైపోవచ్చు.

ఈ విధంగా రకరకాల ప్రవృత్తులతో ఉండటం సాధారణ మానవ నైజం. అందుకే భగవాన్ సత్యసాయిబాబా “మీరు చాలాసార్లు పుట్టపర్తికి వస్తుంటారు. పవిత్ర గ్రంధాలు చదువుతారు. పండితులు చేసే ప్రసంగాలు వింటారు. నా కార్యకలాపాలను పరిశీలిస్తారు. వీటివల్ల మీరేమైనా లాభం పొందుతున్నారా? మీలో ఉన్న తామసిక, రాజసిక ప్రవృత్తులను గుర్తించుకోగల్గుతున్నారా? అని హానికరములని గ్రహించటం మొదటి మెట్టు.

తర్వాత వాటిని తొలగించుకోవాలి. ఏళ్లుపై బడ్డ కొద్దీ సాత్విక లక్షణాలను మీలో పెంచుకోగల్గాలి” అనేవారు. ఈ విధంగా తనను తాను తెలుసుకోలేదని, తన దుర్గుణాల్ని అదుపులో పెట్టుకోలేక మానవుడు ఇతరుల్ని గురించిఏమి తెలుసుకుంటాడు? ఇక పరమాత్మను గ్రహించటమంటే మాటలా?

అందుకే బాబా “నా గురించి నీకేమి తెలుసునని?” అనేవారు. మానవుడు ఎందుకు వారి గురించి సరిగా తెలుసుకోలేరో “మాయ తెర అడ్డుగా నున్నందున నా మహిమను ఏ స్వల్పభాగమో నీవు గుర్తింతువు. నన్ను గురించి ఈ దినమున ఒక విధముగను, రేపటి దినమున మరొక విధముగను మాట్లాడెదవు. నా యందు నీకు ధృడ నమ్మకం లేదు. అందుకే నా గురించి నీకేమి తెలియును? కావున, నా చరిత్రము వ్రాయదలచివేని, నీకు యదార్ధంగా అనుభవమునకు వచ్చిన విషయాలను మాత్రమే వ్రాయుము. అతిశయోక్తి వ్రాయవద్దు. నన్ను గురించి ప్రబోధము చేయుటకు అసలే సాహసించవద్దు” అని వివరించేవారు.

తమ గురించి, తమ అవతార లక్ష్యం గురించి, తాము సంకల్పించిన కార్యకలాపాల్ని గురించి వీలైనప్పుడల్లా చెప్పేవారు. సరియైన అవగాహనతో అర్థం చేసుకుంటేనే కదా, వారి జీవిత సందేశం మనకు సరిగా అందేది? మనం దాని వల్ల పొందవలసిన ప్రయోజనం పొందేది?

“కలియుగమున పతీతులైన మానవాళిని కామక్రోధాది సర్వ కలి దోషముల నుండియు ఉద్ధరించి, అవినీతిని పారద్రోలి, పరస్పర సహకార, ప్రేమ భావములతో, సుఖ సంతోషములతో (ఉండేటట్లు) తులతూగేటట్లు చేయుటకు వచ్చిన సాయిబాబాను” అని అక్టోబరు 20, 1940 ప్రకటించారు.

“విశాల విశ్వమున నాకు కావలసినంత పని యున్నది. నా భక్తులు నన్నాహ్వానించుచున్నారు. ఏ కార్యమునకై నేనవతరించితినో ఆ కార్యారంభము చేయ సర్వ సంగ పరిత్యాగినై వెడలుచున్నాను. మాయ వీడినది. నేను మీ వాడను గాను, ఇప్పటికైనను సత్యమును గ్రహింపుడ”ని గృహమును వీడి వెడలిపోయెను.

1926 వ సంవత్సరమున నవంబరు 23వ తేదీ జననమొందిన బాలుడు 1940వ సంవత్సరంలో పై మాటలు పలుకుటలోనే వారి దివ్యశక్తిని మనం గ్రహించొచ్చు. ఆ చిరుప్రాయంలో ఇంటినీ, తల్లిదండ్రులల్నీ, ఇతర బంధువర్గాల్ని వదలి, “అవ్యాజ కృపతో అవతరించిన సద్గురు చరముల చెంత సంపూర్ణ శరణాగతులుకండు”, అంటూ “మానవ భజరే గురుచారణం దుస్తరభవ సాగర తరణం సత్యాన్వేషకులారా! అనన్యమనస్కులై సద్గురు చరణముల భజింపుడు, జనన మరణ రూప సంసారార్జవమును తరించి, బంధవిముక్తనీ, నిత్యానంద ప్రాప్తినీ పొందండి” అని ప్రబోదించిన ప్రేమమూర్తి శ్రీ సత్యసాయి.

“ప్రజలపై ప్రేమ వాత్సల్యాలతో అవతార లక్షణాన్ని వివరించి చెప్పారు స్వామి. భగవాన్ ఎన్ని జీవన సత్యాలు చెప్పినా మనలో అవగాహన లోపిస్తున్నది. సత్యసాయిబాబా ప్రవచనాలను ఆచరించే ప్రయత్నం చేద్దాం. సంకలనం – తూములూరు ప్రభ