Read more!

శ్రీకృష్ణ తత్వమిదే!

 

శ్రీకృష్ణ తత్వమిదే!

భారతీయ హిందూ ధర్మంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. హిందువులకు ఉన్న గొప్ప అవకాశం ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు పూజించుకోవచ్చు. కానీ ముఖ్యంగా అందరూ చెప్పే విషయం ఒకటుంది. అదే మహావిష్ణువు దశావతారాలు. దశావతారాలు వివిధ కారణాల వల్ల మహావిష్ణువు ఎత్తిన వివిధ జన్మల్లాంటివి. ఈ మహావిష్ణువే సర్వం వ్యాపించి ఉన్న భగవంతుడు అని పిలవబడతాడు. ఈ భగవంతుని అవతారాలలో శ్రీ కృష్ణావతారం ఒక ప్రత్యేకత సంతరించుకొంది. తాను కృష్ణునిగా అవతరిస్తూ దేవతా కోటిని మీరు భూలోకంలో మీకు నచ్చిన రూపంలో జన్మించమన్నాడు ఆ మహావిష్ణువు. 

ఋషులుగా, గోపికలుగా, గోవులుగా, పక్షులుగా, పశువులుగా, చెట్లుగా, నదులుగా, కొండలుగా వారందరూ భూమి మీద జన్మించారు. అలా జన్మించిన చరాచర జగత్తును తన స్పర్శతో పునీతం చేసి పుణ్యగతులు కల్పించిన అవతారం కృష్ణావతారం. అందుకే కృష్ణావతారానికి అంత ప్రత్యేకత ఏర్పడింది. 

దశావతారాల వరుసలో ఎనిమిదోది. శ్రీకృష్ణునికి ఈ ఎనిమిది సంఖ్యకు విశేషమైన సంబంధం ఉంది. అతడు దేవకీదేవికి అష్టమగర్భంలో జన్మించాడు. అతని జన్మతిథి అష్టమి. అతనికి భార్యలు ఎనిమిది మంది. వీరందరూ అష్టమహిషులుగా ప్రసిద్ధులు, అంతేకాదు అందరూ పేర్కొనే ఎనిమిదిమంది అష్టవిధ శృంగారనాయికలకు ప్రతీకలు. శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్న ప్రకృతులు కూడా ఎనిమిది. ఇలా అష్ట సంఖ్యకు, శ్రీకృష్ణునికి గల సంబంధం చాలా ఉంటుంది. 

'దేవ దేవి గర్భజననమ్'  అని కృష్ణుని జన్మను తలచుకుంటే ఎంత హాయిగానో అనిపిస్తుంది. ఋగ్వేదంలో కృష్ణ శబ్ద విశేషాలు ఉంటాయి. కృష్ణుడి శరీరం నీలపు రంగులో ఉంటుంది. దాని గురించి వివరాలను అందులో వివరించారు. ఇంకా పోతన తను రచించిన భాగవతంలో కృష్ణ జనన వృత్తాంతాన్ని వివరించారు,  దేవకీ వసుదేవుల పూర్వజన్మ గాథలను కూడా అందులో పేర్కొన్నారు.  చేసే పనినీ, చూసే చూపునీ... స్మృతినీ ధృతినీ... అన్నింటినీ వశం చేసుకొనే మోహనమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఈయనను అర్థం చేసుకుంటే నిజమైన భక్తి, నిజమైన వ్యక్తిత్వం, నిజమైన మానవ గుణాలు ఎలా ఉండాలి?? వంటి విషయాలు అర్థమైపోతాయి.

శ్రీమన్నారాయణుని అవతార విభూతులన్నింటిలో కృష్ణావతారమే పరిపూర్ణం. అందుకే మనిషి కూడా ఈ పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఆచరణలో పెట్టాలి.  రాముడిలోని ఉత్తమ నాయకత్వ గుణాలను చూసి లోకం దేవుడని తరువాత కొనియాడింది. మొదట రామావతారం, ఆ తరువాత కృష్ణావతారం సంభవించాయి. ఈ రామావతారం అవతార దైవలక్షణాలను నిరూపించింది. సమగ్రమైన ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, సంపద, వైరాగ్యం, మోక్షమనే ఆరు లక్షణాలకీ నిలయుడైన వాడే భగవంతుడు.

గమనిస్తే కృష్ణుడిలో ఈ ఆరు లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను సంపూర్ణుడు అంటారు. ఎక్కడైనా సరే కృష్ణుడి ఆహార్యం వేసుకున్న వారిని గమనించినా, శ్రీ కృష్ణుని గురించి చదివినా ఆయన ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడే తప్ప ఆయనలో బాధ అనేది ఏ కోశాన ఉండదు.  పరిపూర్ణమైన వ్యక్తిలో ఉండాల్సినది ఇదే!! అందుకే అందరూ కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి నిలకడగా ఉండాలని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, కష్ట సుఖాల విషయంలో తటస్థంగా ఉండాలని చెబుతారు. అర్థం చేసుకుంటే భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంటుంది. ఇదే శ్రీకృష్ణ తత్వం.

                                     ◆నిశ్శబ్ద.