Read more!

ఆత్మబల సంపన్నం లేకపోతే ఏమవుతుంది?

 

ఆత్మబల సంపన్నం లేకపోతే ఏమవుతుంది?

ఆనందాన్ని పొందాలన్న తృష్ణ మానవులందరికీ పుట్టుకతో వచ్చే సహజలక్షణం. కానీ, దానిని పొందగలిగే శక్తి కానీ, పొందిన తర్వాత దానిని నిలుపుకునే సమర్ధత అందరికీ ఉండవు. అలా చేయడానికి తగిన ఓర్పు, నేర్పు అవసరము. అందుచేతనే. అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోను పుట్టిన మహాత్ములందరూ స్వీయ క్రమశిక్షణకు, ఆత్మసంయమనానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. క్రమశిక్షణ కలిగిన ఆత్మ చెల్లాచెదరైపోతున్న మన శక్తులను సమీకరించి, వాటిని క్రమబద్ధం చేసే బలాన్ని మనకు ఇస్తుంది. దీనివలన మన ఆలోచనాశక్తి, కార్యదక్షత గొప్పగా వృద్ధి చెందుతాయి. మన శరీరాన్ని పనిచేయించే శక్తులు అనేకంగా ఉన్నట్టు మనకు తోచినా, అది నిజం కాదు. ఏ శక్తి అయితే మన మెదడును, హృదయాన్ని పనిచేయిస్తోందో, అదే శక్తి మన కాళ్ళు, చేతులను కూడా పనిచేయిస్తోంది. ఇంతవరకూ సమన్వయం, సహకారం లేకపోవడం వలన ఈ శక్తి వృథా అవుతూ వస్తోంది. దానిని మనం సమీకరించి, నియంత్రించినప్పుడు ఇది మన జీవితంలో అతి గొప్ప శక్తిగా పరిణమించగలదు.

ప్రాపంచికమైన ఆస్తిపాస్తులను అనేకానేకంగా సంపాదించడం కన్నా, ఆత్మసంయమనాన్ని సాధించడమే గొప్ప సంపద. అదే కనుక లేకపోతే మనకు ఎన్ని అందమైన వస్తువులున్నా వాటిని సరిగా వినియోగించుకోలేము. అంతేకాక, తెలియకుండానే మన జీవనానికి ఆధారమైన మూలాలను పాడుచేసుకుంటాము. ఈర్ష్య వలన, అణచుకోలేని తీవ్రమైన ఉద్రేకం వలన మనం తెలిసి తెలిసి వినాశకరమైన పనులను చేస్తాము. ఆ తర్వాత జీవితమంతా పశ్చాత్తాపపడవలసి రావచ్చు. అలా ఎందుకు చేశావని అడిగితే, తొందరపాటులో, తృటిలో అది తనకు తెలియకుండానే జరిగిపోయిందని, తప్పు చేశానని సమాధానం వస్తుంది. 

అసలు అలాంటి ఉద్దేశపు ఆలోచన క్షణంలో ఎలా పుట్టింది? ఎందుకంటే మనం దానికి అంతకు ముందే పునాది వేశాం కనుక. అటువంటి పొరపాట్ల ఉచ్చులో మనం పడిపోవడమనేది యాదృచ్ఛికంగా జరగడం లేదు. అలాంటి వ్యతిరేకభావాలకు కారణం మనమే. అంతేకాక, దాన్ని ఆపగలిగే శక్తి కూడా మనలోనే ఉంది.

మన జీవితపు లోతులలోకి చొచ్చుకుపోయి, నిశితంగా పరిశీలిస్తే, మనం చేసే ప్రతి పనికి న్యాయమైన ఒక కారణం తప్పక ఉంటుందని మనకే తెలుస్తుంది. ఒక మనిషి తనలోనికి దుర్మార్గపు ఆలోచనలను రానిచ్చి, తనను తాను మరచిపోవడం వల్లనే అతడు తనకు తాను కానీ, ఇతరులకు కానీ హాని చేసే పరిస్థితికి దిగజారుతున్నాడు. తనను తాను వశంలో ఉంచుకోలేకపోతే, విజయానికి చేరువ అవుతున్న తరుణంలో కూడా. క్షణంలో పతనానికి గురైపోతాడు. అంతవరకూ చేసిన కృషి అంతా వృథా అయిపోతుంది.

భారతీయ వేదాంతంలో దీనికి ఉదాహరణగా ఒక చక్కని కథ చెప్పబడింది. మండువేసవిలో ఒకడు పొలంలో పనిచేస్తున్నాడు. చాలాసేపు ఎంతో శ్రద్ధగా నీటిని తోడి పొలంలోకి పారిస్తున్నాడు. కానీ తర్వాత వెళ్ళి చూస్తే, ఆ నీరు పొలంలోని మొక్కలకు పారకుండా. ఎలుక కన్నాలలోకి వెళ్ళిపోయి, వృథా అయిపోయింది. చూడబోతే మన పని కూడా అలాగే కనిపిస్తుంది. చక్కగా అధ్యయనం చేసి, ప్రార్థనలు, ధ్యానం చేస్తూ, మంచి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుందని మనం అనుకుంటాము. అయితే మనం ముందుకుపోము సరికదా, వెనకడుగు వేస్తున్నట్టుగా తోస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే మనం 'ఆత్మబలసంపన్నులం" కాలేదు కాబట్టి. ఒక మనిషి, నీతినియమాల గురించి ఎన్ని ఉపన్యాసాలు దంచినా. నిజజీవితంలో అత్యవసరమైన ఆ మౌలిక లక్షణం కనుక అతడికి లేకపోతే, ఓర్పు, సహనం, క్షమ కోల్పోయి కోపంతో మండిపడితే అప్పటిదాకా ఉన్న అతడి విశ్వాసాలు, సిద్ధాంతాలు అన్నీ వమ్మైపోతాయి.

జీవితంలో 'సమతుల్య స్థితి' కనుక లేకపోతే మనం పరమానందాన్ని పొందగలమన్న ఆశ లేదు. ఆనందం అనేది ఒక మానసిక లక్షణం. అది మన లోపలే ఉండే విషయం. మనలో లేనిదేదైనా సరే, అది బయటనుంచి వచ్చి మనల్ని చేరదు. అదే కనుక మన మనస్సులో ఉంటే, మనకెన్ని అవరోధాలు ఎదురైనా సరే మనం సంతోషంగా ఉండగలుగుతాము. 


                                           ◆నిశ్శబ్ద.