Read more!

శ్రీ ఆంజనేయం

 

శ్రీ ఆంజనేయం

ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేర్గాంచాడు.  ‘జై భజరంగభళీ’ అంటూ శక్తికి చిహ్నంగా ఆంజనేయుని కొలవడం భారతీయులలో ఎక్కువగా కనిపిస్తుంది.అంజనీపుత్రునకు గురువు సూర్యుడు. ఉదయాద్రి, అస్తాద్రి రెండింటిపై పాదాలుంచి వేద వేదాంగములను, సకల శాస్తమ్రులను అభ్యసించాడు. చిన్నతనాన సూర్యుని చూసి పండు అనుకొని అందుకోబోయ ఇంద్రుని శరాఘాతానికి గురయ్యాడు. అపుడు వాయుదేవుడు తన పుత్రునికి వచ్చిన కష్టాన్ని చూసి స్తంభించిపోయాడు. దానివలన సకలలోకాలు అల్లాడిపోయాయ. సిద్దులు, సాధ్యులు, సకల దేవతలూ వచ్చి వాయుదేవుని స్తుతించి హనుమంతునికి వచ్చిన కష్టాన్ని దూరం చేసి అనేక వరాలను ఇచ్చి వాయుదేవుని సంతోషింప చేశారు. అలా సకల దేవతల ఆశీర్వాదాలను ఆంజనేయుడు అందుకున్నాడు. దాంతో వాయుదేవుడు ప్రసన్నుడై తన పుత్రుని సకలాభీష్టాలు నెరవేరేట్టు ఆశీర్వదించాడు. అలా చిన్ననాటినుంచే అల్లరిపనులు చేస్తూ తన శక్తి తనకే తెలీయకుండా పోతుందనే శాపాన్ని మునుల వలన పొందినా ఆ శక్తిని ఇంకెవరైనా గుర్తుచేస్తే ఆ స్వామి బలోపేతుడై అందరినీ రక్షిస్తాడనే వరాన్ని మునులదగ్గరనుంచే లభింపచేసుకొన్న రామభక్తుడు ఆంజనేయుడు.

స్వామిని ఎలా పూజించాలి :

స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.