Read more!

రమణులు చెప్పిన జగత ఈశధీయుక్త సేవనం!!

 

 రమణులు చెప్పిన జగత ఈశధీయుక్త సేవనం!!

మనిషికి నేటి కాలంలో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన చాలా అవసరం. దాని ద్వారానే పరిపూర్ణుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక గురువులు ఎంతోమందికి ఉపదేశాలు ఇస్తూ ఎంతోమందిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అయితే చాలా కొద్దిమందికి మాత్రమే గురువుల అండ లభిస్తుంది. గురువులకు సేవ చేసుకుంటూ వాళ్ళ సమక్షంలో పరిపూర్ణులుగా మారేవాళ్ళు ఉన్నారు. అయితే గురువు లేని వాళ్లకు మార్గం ఏమిటి అని ఆలోచిస్తే దానికి పరిష్కారంగా రమణ మహర్షి కింది మార్గాన్ని చెప్పారు.

నిజంగా  పూర్ణపూజ,  శ్రేష్టమైన పూజయే. అయితే ఇది చాలా కష్టంతో కూడుకున్న పూజయే. అదే 'జగత ఈశధీయుక్త సేవనం'. జగత్తును ఈశ్వరబుద్ధితో భావించి సేవించడం. జగత్తుకు, జగత్తులోని సర్వానికి సేవ చేయడం. ఇది చాలా ఆదర్శ వంతమైన పూజ.  ఎలా చెయ్యాలి ఈ పూజను? నిజంగా ఇక్కడ భగవంతుని ఆరాధించాలనే భావంతో ఎక్కడకూ పోనక్కర లేదు. ప్రత్యేకమైన కర్మలు చేయనక్కర లేదు. దీని కోసం ప్రత్యేకంగా నైవేద్యాలు తయారు చేయనక్కర లేదు. వస్తువులు సమకూర్చుకోనక్కర లేదు. వ్యక్తుల సాయం తీసుకోనక్కర లేదు. శ్రమ చేయనక్కర లేదు. డబ్బు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. కాని నీ మనస్సును భగవన్మయంగా మార్చుకోవాలి. ఎవరిని చూసినా భగవంతుని చూస్తున్నట్లే భావించాలి. సర్వత్రా పరమాత్మ దర్శనం అలవడాలి.

తుకారాం పాండురంగ భక్తుడు. ఆయన ప్రతిరోజూ పాండురంగని దర్శించేవాడు. గంటలు గంటలు తదేక ధ్యానంతో పరవశించేవాడు. కొంతకాలం తర్వాత దేవాలయానికే వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు పాండురంగడు దేవాలయములోనే ఉన్నాడని భావించి దర్శించాడు. కాని ఇప్పుడు ఎక్కడ చూచినా పాండురంగడే. అన్ని దేహాలలో అంతటా పాండురంగడే. ఎలా చూడగలిగాడు? తన మనస్సును పాండురంగమయం చేశాడు. అంతే, ఒకసారి కుక్క అన్నం నోట కరచుకొని ఇంటిలో నుండి పరుగు తీస్తున్నది. అది చూసిన తుకారాం నేతిగిన్నె పట్టుకొని దానివెంట పడ్డాడు. పాండురంగా ఆగు! ఆగు! అది వట్టి అన్నమే. ఇదిగో ఈ నేయి కలుపుకొని తిను, అని. అదీ సర్వత్రా పరమాత్మ దర్శనం అంటే. ఇందులో విషయం కుక్కకు నెయ్యి కలిపి పెట్టమని కాదు, మనం దేవుడికి నైవేద్యం కోసం ఎలాగైతే తీపి వంటకాలు, పిండి వంటలు భక్తిగా పెడతామో, ప్రేమతో పెడతామో అదే మనసు అన్ని జీవుల పట్లా ఉండాలని దాని అర్థం.

రమణ మహర్షి ఆశ్రమంలో కోతులు, గోవులు, ఉడతలు, నెమళ్ళు, కుక్కలు సహజీవనం చేస్తుంటాయి. కుక్కను కూడా ఇది అనడు ఆయన. ఇతడు అంటాడు. వీరికేంకావాలో చూడండి, వారిని బాధ పెట్టకండి అని వాటిని గౌరవిస్తూ ఉండేవాడు. మనష్యులతో ప్రవర్తించినట్లే ప్రవర్తించేవాడు.

ఇలాంటి భావన ఉంటే ఎంతో తేలికగా శ్రేష్టమైన పూజ చేయవచ్చు. నీవు వ్యాపారం చేస్తున్నావు. నీ దగ్గరకు వచ్చే కస్టమర్లను, నీ దగ్గర పనిచేసే వాళ్ళని భగవంతుని రూపాలుగా చూడు. నీవేం నష్టపడాల్సిన పని లేదు. అలాగని మోసం కూడా చేయలేవు.

నీవు ఉద్యోగం చేస్తున్నావు. జీతం ప్రభుత్వం నుండి టంచనుగా వస్తుంది. ఇక నీవు నీవద్దకు వచ్చే వారందరిని భగవంతుని రూపాలుగా చూడు. నీకు చేతనైనంతవరకు సేవ చెయ్యి. అది పరమాత్మ సేవ అవుతుంది. నీకు ఎంత ఆనందాన్నిస్తుందో అనుభవిస్తే తెలుస్తుంది.

 నీవు డాక్టరువు. నీ దగ్గరకు వచ్చే పేషెంట్లను పరమాత్మ స్వరూపులుగా చూడు. అంతే. అనవసరమైన ఆపరేషన్లు ఉండవు, ప్రాక్టీసు బాగా ఉంటుంది. ఇలా నీవు ఏ వృత్తిలో ఉన్నా సరే  భగవంతుని సేవ చేయవచ్చు. ఇలా చేస్తే  ఉద్యోగం మాననక్కరలేదు, వ్యాపారం మానక్కరలేదు. ఇవన్నీ ఎందుకు మానాలి? భగవంతుని సేవ చేయటానికండి! అంటే భగవంతుడు అక్కడ లేనట్లేగా! కనుక ఈ పరిమిత భావాలు వదిలి అన్నింటిలో భగవంతుని దర్శించటం నేర్చుకోవాలి. ఇలాంటి భావన,  అందరినీ, అన్నింటినీ భగవంతుడే  అనే భావన ఉన్నప్పుడు ఎవరికి సేవ చేసినా భగవంతునికి సేవ చేసినట్లే. ఇలా నీ స్వధర్మాన్ని భగవంతుని పూజగా మలచుకుంటే ఇదే గొప్ప పూజ. పూర్ణ పూజ. ఉత్తమ పూజ.

◆ వెంకటేష్ పువ్వాడ