Read more!

భగవద్గీత గురించి కృష్ణుడు ఏమి చెప్పాడు??

 

 భగవద్గీత గురించి కృష్ణుడు ఏమి చెప్పాడు??

 

భగవద్గీతలో ఏముంది దాన్ని ఎందుకు చదవాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా ఆ భగవంతుడిని కూడా ప్రశ్న వేస్తూ ఉంటారు. వాటికి గీతోలోనే కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చారు.


【అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః౹౹

జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టస్స్యామితి మే మతిః॥ 


ఎవరైతే మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేస్తారో, దానినే జ్ఞాన యజ్ఞము అని అంటారు. ఈ జ్ఞాన యజ్ఞము చేత నేను ఆరాధింపబడతాను. ఇదే నా నిశ్చయము】


భగవంతుని ఆరాధించడం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆవాహన చేయడం, అలంకరించడం, పూజించడం, ఆరాధించడం, నివేదనలు అర్పించడం, ఊరేగింపులు చేయడం, దేవాలయాలు కట్టించడం, ఉత్సవాలు జరిపించడం. (సగుణోపాసన) అనేకరకాలుగా చేస్తుంటారు. ఇదంతా మనిషి తన ఏకాగ్రత శక్తి పెరగడానికి ఆచరించే మొదటి  మార్గం. వీటి వల్ల ఏదో మూఢత్వం వస్తుంది అనుకునేవాళ్ళు మూర్ఖులు. 


మరి కొంత మంది నిర్గుణోపాసన అంటే నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను శాస్త్రములు చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ధ్యానము చేయడం, తద్వారా ఆత్మజ్ఞానమును పొందడం, మొదలగు ప్రక్రియల ద్వారా ఆరాధిస్తుంటారు. ఇది రెండవ మార్గం. ఈ మార్గం ఆచరించడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. వాస్తవాన్ని గ్రాంహించే సామర్థ్యము అలవడుతుంది. లోతైన విశ్లేషణ, సూక్ష్మ విషయాన్ని కూడా తర్కంగా అర్థం చేసుకునే గుణం పెంపొందుతుంది.


 కానీ ఈ కృష్ణార్జున సంవాదము ఉపనిషత్తుల సారము. యోగ శాస్త్రము. బ్రహ్మవిద్య. ఈ మూడు కలిపి చిలికి వడబోస్తే వచ్చిన సారము ఈ భగవద్గీత.  ఈ గీతను చదవడం, అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానము సంపాదించవచ్చు దీనినే గీతా జ్ఞాన యజ్ఞము అని అంటారు.

గీతా జ్ఞాన యజ్ఞము చేయడం, అంటే గీతను భక్తి శ్రద్ధలతో చదవడం, అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం ఇవి అన్నీ భగవతారాధనలలో అత్యుత్తమమైనవి. అదే నాకు చాలా ఇష్టమైనది అని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గీతను ఇతరులకు చెప్పేముందు అతడు బాగా అధ్యయనం చేయాలి. గీతా సారం తెలుసుకోవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడే ఇతరులకు బోధించగలడు. అంతకానీ ఏదో పండిత జ్ఞానం, సంస్కృత శ్లోకాలకు అర్థం తెలుసుకుని వాటికి నచ్చినట్లు విషయాలను జోడించి, క్లాపించి చెప్పడం చాలా తప్పవుతుంది. గీతను ఇతరులకు చెప్పడమే భగవంతుని ఆరాధన. గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఇతరులకు చెప్పడం ఈ మూడు ప్రక్రియలు భగవంతుని పూజించడం ఆరాధించడంతో సమానము. దాని వలన తనకు తాను మేలు చేసుకుంటాడు ఇతరులకు మేలు చేసినవాడవుతాడు. 

ఈ గీతా జ్ఞాన యజ్ఞములో జ్ఞానమే హెూమాగ్ని, గీతను బోధించేవాడు యాజ్ఞకుడు. గీతను వినేవాడు యజమాని. యజమానిలో ఉన్న అజ్ఞానమే ఆహుతులు. అతని అహంకారమే బలిపశువు. ఈ గీతా జ్ఞానయజ్ఞములో యజమానిలో పేరుకుపోయిన అజ్ఞానము అనే ఆహుతులను అగ్నిలో వేసి హుతం చేస్తున్నాడు. అహంకారము అనే పశువును బలి ఇస్తున్నాడు. ఆ యజ్ఞం చేయడం ద్వారా జ్ఞానము అనే ఫలాన్ని పొందుతున్నాడు. ఇదే గీతాజ్ఞానయజ్ఞము. గీతలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల గురించి ముఖ్యంగా చెప్పబడ్డాయి. గీతను చదివినా ఇతరులకు చెప్పినా ఈ మూడు గుణాలు కొంచెం కొంచెం అయినా వంటబడతాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. కృష్ణుడే ఇది నా నిశ్చయము అని ఉద్ఘాటించాడు. కాబట్టి గీతా పఠనం, గీతా బోధన పరమాత్మకు ఇష్టం అని మనకు తెలుస్తూ ఉంది.

ఏదో ఆ పరమాత్మకు ఇష్టం కాబట్టి ఇది చెయ్యాలా అనే వాదన కొందరు అతివాదులలో తొంగిచూడచ్చు. కానీ ఇది పూర్తిగా మనిషికి స్వలాభం తెచ్చిపెట్టేదే తప్ప ఆ భగవంతుడికి ఎలాంటి లాభం ఉండదు. ఈ గీతను స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల ఎంతో గొప్ప మనోవిశ్లేషనా గ్రంధాలలో దొరకని విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గీతలో సారం మనిషిలో సత్తువను ఇస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ