రమణులు చెప్పిన శాశ్వత సంతోషం!!

 

రమణులు చెప్పిన శాశ్వత సంతోషం!!

ఈ లోకంలో ప్రతిప్రాణీ సుఖాన్ని, ఆనందాన్నే కోరుకుంటున్నది. అందుకోసం ఎన్నో విషయ వస్తువుల వెంట, సుఖాల వెంట పిచ్చిగా పరుగులు పెడుతూ వాటిని అందుకుంటూ, అనుభవిస్తూ ఆనందిస్తున్నాం. అలా అనుభవించి మరలా మరొక వస్తువు కొరకు, మరొక సంతోషం కొరకు పరుగుతీస్తున్నాం. అందినప్పుడు ఆనందిస్తున్నాం. అందకపోతే దుఃఖ పడుతున్నాం. అందితే అంతటితో ఊరుకోవటం లేదు. మరొక దానికోసం పరుగులు పెడుతున్నాం. ఇలా ఎప్పుడూ పరుగులు తీస్తూ శాశ్వత సుఖాన్ని పొందలేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నాం. 


మరి శాశ్వత ఆనందం ఎలా వస్తుంది? అది బయట వస్తువులలో ఉందా? లేక లోపల నీలోనే ఉందా? ఆనందం బయటి వస్తువులలో లేదని తేలిపోయింది.

కనుక నీలోనే ఉందేమో పరిశీలన చేయాలి. అంటే నీ యదార్ధ స్వరూపం ఏమిటో పరిశీలన చెయ్యాలి. ప్రతి వస్తువుకు ఒక సహజ స్వభావం వుంటుంది. ఆ వస్తువు దాని స్వభావాన్ని విడిచి ఉండదు. అగ్ని యొక్క స్వభావం వేడి. అగ్ని వేడిని విడిచి ఉండదు. మంచు యొక్క స్వభావం చల్లదనం. ఈ మంచుముక్క చల్లదనాన్ని విడిచి ఉండదు. పంచదార తీపి. పంచదార తీపిని విడిచి ఉండదు. ఈ విధంగా ఆలోచిస్తే మన సహజ స్వభావం ఏమిటి? దు:ఖమా, ఆనందమా? మన సహజ స్వభావం దుఃఖం అనుకుందాం. ఇదే నిజమైతే మనం దుఃఖాన్ని విడిచి ఉండలేం. అలాంటప్పుడు దుఃఖం కలిగితే ఎందుకు పారద్రోలాలని ప్రయత్నిస్తాం? ఎప్పుడూ దుఃఖం ఉండాలనుకుంటాం. ఎందుకంటే దుఃఖం బాధ కలిగించదు. భారం కాదు. కాని మన అనుభవం దీనికి పూర్తిగా వ్యతిరేకం. మనం ఆనందం కావాలనుకుంటున్నాం. దుఃఖం వస్తే పంపేయాలను కుంటున్నాం. దీనిని బట్టి మన సహజ స్వభావం దుఃఖం కాదు. అయితే మరేమిటి? మన సహజ స్వభావం సుఖమే అయివుండాలి. అందుకే సుఖంగా ఉండాలనుకుంటున్నాం. అలా ఉంటే హాయిగా ఉంటున్నాం. అలా లేకపోతే ఎలా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలా? అని ఆలోచిస్తున్నాం. 

కనుక మనం ఆనంద స్వరూపులమే. కాని ఆనందంగా ఎల్లప్పుడూ ఉంటున్నామా? వుండటం లేదు. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. మన నిజస్వరూపంలో మనం ఉండనందువల్ల. నేను శరీరాన్ని అనుకోవటం వల్ల. ఆత్మను అని గ్రహించక పోవటం వల్లనే. నేను దేహాన్ని అనుకొని, దుఃఖంలో ఉన్నాను అనుకొని, ఆనందం కోసం ఏవో విషయాలతో సంపర్కం పెట్టుకుంటున్నాం. రాత్రింబవళ్లు ఇలా సంబంధం పెట్టుకున్నా కోరుకున్న ఆనందం లభ్యం కావటం లేదు.

పటిక బెల్లం ముక్క తీపికోసమని బెల్లంతో, పంచదారతో సంబంధం పెట్టుకొని ఎంత సేపు దానిలో పొరలాడినా ఏం ప్రయోజనం? అది తాను తీపి వస్తువునే అని తెలుసుకుంటే చాలు. తన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలు. అలాగే మనం ఈ శరీరాలు మాత్రమే కాదని, మన యదార్ధ స్వరూపం ఆత్మయేనని తెలుసుకుంటే, ఆత్మ ఆనంద స్వరూపం గనుక మనం ఎల్లప్పుడూ ఆనందంలో ఉన్నట్టే. కనుకనే ఈ దిశగా విచారణ సాగాలి. నా సహజ స్వభావం, స్వరూపం ఏమిటి? అని విచారణ సాగాలి. అందుకు సద్గురువు ద్వారా నిరంతర శాస్త్ర శ్రవణం చేసి విచారణ చేయాలి. అప్పుడు తెలుస్తుంది నేను ఆత్మను, అవ్యయ, అభవ, ఆపూర్ణచిత్ ఆనంద స్వరూపాన్ని అని.

నేను అవ్యయుణ్ణి ఏమార్పులు, వికారాలు, నాశనం లేనివాణ్ణి. దేహం నశించినా నేను నశించను. 'నహన్యతే హన్యమానే శరీరే' అని గీత చెబుతున్నది. ఆత్మ నిష్ఠునికి, ఆత్మారామునికి నాశనం లేదు. అతడికి శరీరంతో సంబంధం లేదు.

సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కావేరి ఒడ్డున ఇసుకలో పడుకున్నారు. నది పొంగి వస్తున్నది. అది చూసిన వారు ఆయనకుచెప్పి దూరంగా రమ్మన్నారు. ఆత్మానందంలో రమించే ఆయనకు ఇదేమీ తెలియదు. వారు చేసేది లేక దూరంగా వెళ్ళి నిలబడ్డారు. నీరు రావటం, ఆయనను ముంచి వెయ్యటం, కొట్టుకు పోవటం కూడా చూసారు. 4 నెలల తరువాత బండ్లతో ఇసుకను తోలుతున్నారు. పారతో తవ్వుతుంటే రక్తం. జాగ్రత్తగా త్రవ్వి చూస్తే ఈ మహాత్ముడు. ప్రాణాలతోనే ఉన్నాడు. స్వామి ఎలా ఉండగలిగారు? అని అడిగితే "పూర్ణ బోధోహం, సదానంద పూర్ణ బ్రహ్మాం, నిత్యోహం, అభయోహం, అద్భుతాత్మాహం" అని కీర్తన ద్వారా తెలిపాడు. అట్టి మహాత్ములకు దేహంతో సంబంధం ఉండదు. రమణ మహర్షీ అంతే. వారికి పుట్టుక లేదు. నాశం లేదు. ఆ రెండూ దేహానికే. 'ఆపూర్ణ చిత్సుఖం' పరిపూర్ణమైన ఆనందాన్ని ఆత్మానుభూతి చెందిన వారు స్వానుభవంగా పొందుతూ ఉంటారు. ఇలా సద్గురువు వద్ద విచారణ చేస్తూ అవ్యయ, అభవ, ఆపూర్ణచిత్ సుఖస్వరూపంగా ఉండిపోతారు. 

అదే అలాంటి అనుభూతి కలిగితే ఏర్పడేదే శాశ్వత సంతోషం!!

◆ వెంకటేష్ పువ్వాడ