Read more!

లక్ష్మణుడి మాటలు ఎలా ఉన్నాయి??

 

లక్ష్మణుడి మాటలు ఎలా ఉన్నాయి??

సీతమ్మ జాడ తెలియక రాముడు ఎంతగానో కోపోద్రిక్తుడు అయిపోయాడు. ఆయన మూడు లోకలని తన బాణాలతో కాల్చేస్తానని పట్టుబట్టాడు. కానీ లక్ష్మణుడు రాముడిని ఊరడించాడు. రాముడి  కోపం కొంచం టాగిన తరువాత లక్ష్మణుడు రాముడితో   "అన్నయ్యా! చూశావ లోకము యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. (ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అది ఎమిటంటే "యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు?" అని అడిగాడు. 

అప్పుడు యయాతి ఆలోచించి. ఎప్పుడూ పూర్తిగా తెలియని విషయాన్ని నిజం అని నిర్దారించకూడదు కదా, ఎవరి గురించో చెప్పడం ఎందుకు?? నేను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కాబట్టి నా గురించి చెబుతాను అనుకున్నాడు. అలా అనుకోగానే  ఆ యయాతి ఎంతో వినయంగా "నేను ఎన్నడూ అసత్యం పలకలేదు" అన్నాడు ఇంద్రుడితో. 

కానీ ఇంద్రుడు ఏమన్నాడు??  "నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు" అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.) జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.

అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు.

మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. 

ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రశిస్తున్నారు. మళ్ళి విడిచిపెడుతున్నారు. 

ఇలా మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి లొంగి పోయావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు. నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. అంతే" అన్నాడు.

                            ◆వెంకటేష్ పువ్వాడ.