Read more!

దానంకూ కొన్ని నియమాలున్నాయి!!

 

 దానంకూ కొన్ని నియమాలు ఉన్నాయి!!

 


దాతవ్యమితి యద్ధానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్||


దానము చెయ్యాలి అనే కోరికతో, పుణ్యక్షేత్రములోగానీ, పర్వదినములలో కానీ, ఆ దానము తీసుకోడానికి యోగ్యుడైన వానికి, అతనినుండి ఏ ఉపకారము ఆశించకుండా చేసే దానమును సాత్విక దానము అని అంటారు.


దానం అంటే ఏమిటి? తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం. తన జీవనానికి సరిపడా ధనం ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇవ్వడం. దీని వలన మనిషిలో ఉన్న లోభగుణం నశిస్తుంది. పరపీడనం పోయి పరోపకార గుణం అలవడుతుంది. పైగా ఒకరి దగ్గరే ఎక్కువ ధనం ఉంటే అది అతనికి భారంగా పరిణమిస్తుంది. దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతుంటాడు. అతని ధనానికే కాదు, ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. తద్వారా మనశ్శాంతిని కోల్పోతాడు. కానీ, దానం వలన ఆ అవస్థల నుండి బయటపడతాడు.


ఈ దానాలు కూడా మూడు రకాలు. అవే సాత్విక, రాజసిక, తామసిక దానాలు. అందులో


మొదటిది సాత్విక దానము. ఈ దానము దేశ, కాల, పాత్రతను బట్టి చేయాలి. పుణ్య క్షేత్రములలో, పర్వదినముల సందర్భాలలో చేయాలి. యోగ్యుడు అయిన వాడికే దానం చేయాలి. దానం చేసిన తరువాత ఎవరికైతే దానం చేసాడో వాడి నుండి ప్రత్యుపకారం కోరకూడదు. అది దానం అనిపించుకోదు. కర్ణుడు చేసిన దానం అటువంటిదే. కర్ణుడు ఇంద్రుడికి తన కవచ కుండలములు ఇచ్చి దాని బదులు ఇంద్రుడి వద్దనుండి శక్తి అనే ఆయుధమును తీసుకున్నాడు. అది రాజసదానం అవుతుంది కాని సాత్విక దానం అనిపించుకోదు.


“దాతవ్యం ఇతి” అంటే దానం చేయడం నా ధర్మం. నేను దానం చేయాలి అని నిశ్చయించుకోవడం. పేరు ప్రతిష్ఠల కోసంక్ ఒకరి మెప్పుకోసం దానం చేయకూడదు. దానం చేయడం తన కర్తవ్యం అని చేయాలి. తాను దానం చేయడం వలన ఇతరులను ఉద్దరించాను అని అనుకోకూడదు. దానం చేయడం వలన తనను తాను ఉద్దరించుకుంటున్నాను అని అనుకోవాలి. అదే సాత్వికదానము.


“అనుపకారిణే” అంటే ఇతరులు తనకు ప్రత్యుపకారం చేస్తారు అనే బుద్ధితో దానం చేయకూడదు. పేదవారికి, శక్తిలేని వారికి, వికలాంగులకు, దరిద్రులకు దానం చేయాలి. ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ, వారికి ప్రత్యుపకారం చేసే శక్తి ఉండదు.


దానం ఎక్కడ చేయాలి అంటే పుణ్యక్షేత్రములలో దానం చేయడం ఉత్తమం. కాలే అంటే పుణ్యకాలముల యందు అంటే గ్రహణ సమయంలో, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి లేక మహాలయము మొదలగు పితృ దేవతలను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమం. పాత్రే అంటే మనం దానం ఎవరికి ఇస్తామో వారు ఆ దానం తీసుకోడానికి అర్హులు అయి ఉండాలి. తాము చేసిన దానమును దుర్వినియోగం చేసేవారికి దానం చేయకూడదు. ఈ ప్రకారం చేసిన దానములు సాత్విక దానములు అని అంటారు.


పనడుగలప్పుడు శుభసందర్బాలలోనే ఎందుకు దానం చెయ్యాలి?? సాధారణ సమయాలలో ఎందుకు చేయకూడదు అనే అనుమానం రావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పండుగ అంటే ఇంటిల్లిపాదీ సంతోషంలో ఉన్న సమయం. కానీ కొందరు అలాంటి సమయాలలో నిస్సహాయంగా ఎలాంటి సంతోషానికి నోచుకోకుండా ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం తృప్తి పడాలని అలాంటి సమయాలలో దానం చేయమంటారు. ఇంకా చెప్పాలి అంటే పండుగలు, కార్యాల కోసం ఎంతో ఇంతో పొదుపు చేసుకుని ఉంటాము కాబట్టి అందులోంచి ఇంతరజలకు కొంత ఇవ్వడం ఆర్థికంగా కష్టమని అనిపించదు. ఇదంతా సగటు మనిషి జీవితాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినదే!!


ఇవ్వాలి అనే మనసు ఉంటే మాత్రం ఎప్పుడైనా ఏదైనా దానం ఇవ్వచ్చు. అయితే అర్హత కలిగిన వారికే!!


                          ◆వెంకటేష్ పువ్వాడ.