సీతమ్మ లేడిని చూసి మాయలో ఎలా పడింది?
సీతమ్మ లేడిని చూసి మాయలో ఎలా పడింది?
రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దగ్గరికి వెళుతూ, మళ్ళీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
కాని మారీచుడు మిగతా మృగాల దగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి ఎదురుగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి "రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి వెంటనే రండి' అని పలికింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో "ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు" అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు.
"అన్నయ్యా ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్చితంగా మారీచుడి మాయ" అన్నాడు.
అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో "ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది. నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు, ఒంటి మీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ జింక కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి 'అబ్బ, ఏమి 'మృగం వదిన' అంటాడు, అత్తగార్లు అందరూ చూసి 'అబ్బ, ఏమి మృగం' అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే' అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడానా అలా మాట్లాడితే ఏమి అనుకోకండి" అని చెప్పింది.
అలా సీతమ్మ మారీచుడి లేడి రూపం చూసి మాయలో పడిపోయింది.
◆ వెంకటేష్ పువ్వాడ.