Read more!

జంతువులు రాముడికి దారి ఎలా చూపించాయి??

 

జంతువులు రాముడికి దారి ఎలా చూపించాయి??

అడవిలో ఎదురుపడిన లక్ష్మణుడిని చూసి రాముడు భయపడ్డాడు, సీతను వదిలి ఎందుకొచ్చావని లక్ష్మణుడిని ప్రశ్నించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఆశ్రమం కట్టుకున్న చోటుకు వెళ్లారు. రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు. కాని సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, దగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దగ్గరికి వెళ్ళి "ఓ ఏనుగా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జెడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసుంటుంది సీత ఎక్కడుందో, నాకు చెప్పవా" అన్నాడు. దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి "సీత ఎక్కడుందో మీకు తెలిసుంటుంది. నాకు నిజం చెప్పరా" అన్నాడు. అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళి "సీత మీతో ఆడుకునేది కాదా, సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా" అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ "అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, హా! రామ, హా! రామ" అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్ర శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చెయ్యగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను" అని ఏడిచాడు.

రాముడి బాధని చూసి లక్ష్మణుడు "అన్నయ్యా! బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను" అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు.

తిరిగొచ్చిన లక్ష్మణుడు "సీతమ్మ ఎక్కడా కనపడలేదు" అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి "గోదావరి! నిజం చెప్పు, ఎక్కడుంది సీత. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు. కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు" అన్నాడు.

అక్కడున్న పంచభూతాలు జరిగినది చూసాయి. కాని చెపుదాము అంటే, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో "గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము" అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి. కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి.

మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు "అన్నయ్యా! ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది. ఈ మృగాల వెనకాల వెళదాము" అన్నాడు.

                            ◆ వెంకటేష్ పువ్వాడ.