సంపూర్ణ గోలాయణం 62
ఆ రోజు రాత్రి పడుకున్నాక మళ్ళీ ఆ విషయం గుర్తుకువచ్చి నవ్వొచ్చింది మోహన్ కి, ఆ తరువాత ఏడుపొచ్చింది. ఆ వేళ సాయంత్రం యింటికి చేరగానే "అమ్మా తల నెప్పిగా ఉంది కాఫీ యిస్తావా?” అని అడిగింది దీపిక.
“లక్షణంగా ఉంది తల్లి. చెట్టంత ఆడపిల్లవి యింటి పట్టున వుండి కాస్త నాకు సాయం చెయ్యడం పోయింది. చీకటి పడేదాకా షికార్లు తిరిగి వచ్చి కాఫీ ఇస్తావా టీ ఇస్తావా అంటూ ఆర్డర్లు చేస్తున్నావ్. ఏమిటో ఈ కొంపలో నా మాటకు విలువంటూ ఉండి ఏడిస్తేగా, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏమైనా అంటే కోపాలు. అయినా నా కెందుకోచ్చిన గోల. అందరికీ చాకిరి చేస్తూ నోరు మూసుకుని ఓ మూల పడుకుంటాను" అని విసుక్కుంది వర్ధనమ్మ.
అసలావిడకి ఆ వేళ మూడ్ బాగా లేదు. అందుకో కారణం వుంది. ఆవిడ అన్నగారు; అంటే స్వంత అన్నగారు కాదు పిన్నతల్లికొడుకు - తెనాలి దగ్గర పల్లెటూళ్ళో ఉంటాడు. ఆయనకి ఒక కూతురుంది. ఆ పిల్లకు పెళ్ళి సెటిల్ అయింది, తీరా అన్ని ప్రయత్నాలూ చేసుకున్నాక పెళ్ళి వారం రోజులు వుందనగా ఆ పెళ్ళి కొడుకు కాస్తా ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు. పెళ్ళి ఆగిపోయింది. ఆ విషయం తెలుసుకున్న వర్ధనమ్మ, అన్నగారికి సానుభూతి తెలియజేస్తూ ఉత్తరం రాసింది.
ఆయన సమాధానం రాశాడు, “జరిగిన డానికి చాలా కృంగిపోయాను వర్ధన్నీ, నాదేముంది పెద్దవాడిని అనుభవం ఉన్న వాడిని, కానీ రాధని చూస్తుంటే జాలిగా ఉంది నాకు. నాలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. కాస్త ఈ విషయం పాత బడే దాకా అమ్మాయిని ఎక్కడికైనా పంపుదామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడికి పంపుతాను? మన వాళ్ళంతా చుట్టు పక్కలే ఉన్నారు" అంటూ రాశాడు.
ఆ ఉత్తరం చదువుకుని ఎంతో బాధపడింది వర్ధనమ్మ పాపం కష్టంలో ఉన్నాడు పిల్లని పదిరోజులు ఎక్కడికైనా పంపితే బాగానే ఉంటుంది కాస్త వాతావారణం మారుతుంది. దానికి మార్పుగా ఉంటుంది. రాధని తన దగ్గరకు పంపమని రాస్తే బాగుంటుంది ఓ నెల్రోజులుండి వెళుతుంది. అనుకుని భర్త చెవిన వేసింది ఈ విషయం.
ఆయన గయ్ మని లేచాడు "నీ మొహం. ఊరికే తల తిక్క ఆలోచనలు చెయ్యకు. అసలే మన గొడవల్లో మనముంటే ఆ పిల్ల ఒక్కర్తి తక్కువ అయిందా? అసలే అదృష్టం కలిసి రావడం లేదు మనకు. ఆ నష్ట జాతకం పిల్లను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే యిక అడగనే అక్కర్లేదు. ఇవి కుదిరే పనులు కావుగానీ మాట్లాడకుండా కూర్చో!” అన్నాడు.
ఆవిడ అభిమానం దెబ్బతింది. “ఏం! నా పుట్టింటి వారంటే అంత చులకనా? మా అన్నయ్యేం తిండిపెట్టలేక దాన్ని పంపిస్తానన్నాడా? అసలైనా నా మేనకోడల్ని నాల్రోజులు నా యింటికి రప్పించుకునే హక్కు అధికారం నాకు లేదా? అన్నింటికీ మీ మాటే చెల్లాలా?” అని గట్టిగా దులిపేద్దాం అనుకుంది కానీ అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి. అందుకే ఏం మాట్లాడకుండా విసురుగా అక్కడినించి వచ్చేసింది.