Read more!

రుద్రాక్షతో కూడిన రాఖీని కడుతున్నారా... ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

 

రుద్రాక్షతో కూడిన రాఖీని కడుతున్నారా... ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!


రాఖీ పండుగ అన్నచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. ఆ రోజు వారు తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. సోదరీమణులు  రాఖీ కట్టి సోదరులకు రక్షను అందిస్తే, సోదరులు అక్కాచెల్లెళ్లను ఆశీర్వదించి తాము ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో రాఖీల తయారీలో రుద్రాక్షలు ఉపయోగిస్తున్నారు. రుద్రాక్షలు ఆధ్యాత్మిక పరంగానూ, అటు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. ఈ రుద్రాక్షలతో కూడిన రాఖీలు కొనుగోలు చేసేముందు, వాటిని సోదరులకు కట్టే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

రుద్రాక్షలు చాలా ప్రభావవంతమైనవి. శివుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలని నమ్ముతారు. దీనికి అనుగుణంగా రుద్రాక్షలు వివిధ ముఖాలలో లభిస్తాయి. సాధారణంగా చాలామంది పంచముఖ రుద్రాక్షలు ధరిస్తుంటారు. అయితే జ్యోతిష్కలు ఇలా రాఖీ పేరుతో రుద్రాక్షలు కట్టడం మంచిది కాదని అంటున్నారు.

రుద్రాక్ష ధరించడానికి  కూడా ఒక నియమం ఉంది. రుద్రాక్షలు ధరించడానికి ముందు వాటికి దైవ ఆశీర్వాదం తప్పనిసరి. అలాగే రుద్రాక్ష ధరించింది మొదలు చాలా పరిశుభ్రత అవసరం.

రుద్రాక్షను మెడలో ధరించినప్పుడు అది గుండె కొట్టుకునే తీరును దృఢంగా చేసి గుండె సంబంధ సమస్యలను దగ్గరకు రానీయదు. అదే విధంగా రుద్రాక్షను చేతికి రక్షగా కట్టినప్పుడు అది నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. కానీ రుద్రాక్ష ధరించి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల రుద్రాక్ష శక్తి తగ్గిపోతుంది. అది సాధారణ పూసగా మారిపోతుంది. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు.

నేటికాలం కుర్రాళ్లు ఆహార విహారాల విషయంలో ఏమాత్రం నియంత్రణగా ఉండరు. ఈ కారణంగా రుద్రాక్షతో కూడిన రాఖీలు కట్టి వాటిని అవమానించడం కంటే సాధారణ రాఖీలతో ఈ పండుగను జరుపుకోవడం మంచిది. లేదు రుద్రాక్ష కట్టాలని సంకల్పిస్తే సోదరులు అన్ని జాగ్రత్తలు తీసుకునే చెయ్యడం అక్కాచెల్లెళ్ళ భాద్యతే..

                                                          *నిశ్శబ్ద.