శ్రావణ పౌర్ణమి.. రాఖీ పండుగ.. ఎలాంటి రాఖీ కట్టాలి.. సోదరుల విధి ఏమిటి!

 

శ్రావణ పౌర్ణమి.. రాఖీ పండుగ.. ఎలాంటి రాఖీ కట్టాలి.. సోదరుల విధి ఏమిటి!


హిందూ ధర్మంలో ఒక్కో పండుగకు ఒక్కో విధి ఉంటుంది.  ఆ పండుగ వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ పూర్ణిమ విషయానికి వస్తే.. దీన్ని సోదర సోదరీమణుల మధ్య ఉండే ఎంతో పవిత్రమైన  బంధాన్ని గుర్తు చేస్తూ రక్షా బంధన్ పేరుతో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్లపక్ష చివరి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు.  రక్షా బంధనం అనేది సోదరుడికి కట్టే ఒక గొప్ప రక్ష.  ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగను జరుపుకుంటారు.  ఇది ఆగస్టు నెల 9వ తేదీన వచ్చింది.  ఈ సందర్భంగా రాఖీ పండుగ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

సోదరభావానికి ప్రత్యేక ప్రాముఖ్యత..

రక్షా బంధన్ పండుగను వయస్సు లేదా కులంతో సంబంధం లేకుండా జరుపుకుంటారు. ఈ పండుగ సోదరభావానికి చిహ్నం. ఈ పండుగ రోజున సోదరులు మరియు సోదరీమణులు, వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరు ప్రేమ, ఆప్యాయత,  ఆదరాభిమానాలు వ్యక్తం చేస్తారు. సోదరులు,  సోదరీమణుల మధ్య ప్రేమ  లోతును వర్ణించడం అసాధ్యం. పురాణాల కాలంలో అయినా, భారతీయ చరిత్రలో అయినా, సోదరభావానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రక్షా బంధన్ ముగిసిన తర్వాత తన సోదరిని జీవితాంతం రక్షించడం సోదరుడి విధి అవుతుంది.

శ్రీకృష్ణ,  ద్రౌపది బంధం..

శ్రీ కృష్ణుడు,  ద్రౌపది మధ్య ఉన్న బంధం.. నమ్మకం అందరికీ తెలిసిన కథ. ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీ కృష్ణుడు ద్రౌపదికి అండగా నిలిచాడు.  ఇంకా చెప్పాలంటే వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ద్రౌపది  గౌరవాన్ని కాపాడాడు. అదేవిధంగా కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది  తన చీరను చింపి శ్రీకృష్ణుడికి కట్టు కట్టి అతనికి సహాయం చేసింది. బ్రిటిష్ వారు రాణా ప్రతాప్ సింగ్ ను చంపడానికి వచ్చినప్పుడు, ఒక స్త్రీ పోరాడి అతని ప్రాణాలను కాపాడింది. కాపాడిన ఆ స్త్రీ తో రాణాప్రతాప్ సింగ్ చివరి వరకు సోదరుడిగా సోదరభావంతో మెలిగాడు.   మొత్తం మీద మన భారతీయ మహిళలు ప్రపంచానికి సోదరీమణుల పాఠాన్ని నేర్పించగలరు.

భావాలు ముఖ్యమైనవి, సంబంధాలు కాదు..

పైన పేర్కొన్న పలు సంఘటనల  నుండి మనం నేర్చుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్షా బంధన్ జరుపుకోవడానికి సంబంధం మాత్రమే ముఖ్యం కాదు. సంబంధం ఎంత ముఖ్యమో వైఖరి కూడా అంతే ముఖ్యం. గణేష్ చతుర్థి, గౌరీ పూజ, దీపావళి లాగా అందరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది. మన దేశంలో ఒకరినొకరు కలిసినప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. అదేవిధంగా రక్షా బంధన్ రోజున సోదరులు,  సోదరీమణులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు.

రాఖీ ప్రాముఖ్యత..

చేతికి కట్టే రాఖీ ఒక రకమైన యుద్ధ కంకణం లాంటిది. చరిత్రలో చూస్తే..  ఒక స్త్రీ తన సోదరుడికి  రాఖీ కట్టిన క్షణం నుండి, ఆ స్త్రీ రక్షణ పూర్తిగా ఆ వ్యక్తిదే. సోదరులు తమ సోదరీమణులకు పూర్తి రక్షణ కల్పిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు. అదేవిధంగా, సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు,  విజయం కోసం ప్రార్థిస్తారు. రక్షా బంధన్ రోజున, ఉదయం లేచి అభ్యంగ  స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి, తమ దగ్గర ఉన్న రాఖీని దేవుని దగ్గర ఉంచి దానిని పూజించాలి. సోదరులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి.  స్త్రీలు రాఖీ కట్టే ముందు తమ సోదరుల దీర్ఘాయుష్షు,  విజయం కోసం దేవుడిని ప్రార్థించాలి.

ఎలాంటి రాఖీ కట్టకూడదు.. ఎలాంటిది కట్టడం మేలు..


ఏలైనంత వరకు నలుపు రంగు రాఖీలు కట్టకూడదు. అదేవిధంగా ఆయుధాల చిహ్నాలు ఉన్న రాఖీలు కట్టకూడదు. రాఖీలలో అగ్ని చిత్రాలు కూడా ఉండకూడదు. సోదరులు,  సోదరీమణులు ఒకరికొకరు స్వీట్లు తిని, ఆపై కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ స్వీట్లు పంచుకోవాలి. మొత్తం మీద   రక్షా బంధన్ పండుగకు మతపరమైన, పౌరాణిక,  చారిత్రక నేపథ్యం ఉంది. మతపరమైన ఆచారాలను పూర్తి అర్థంతో జరుపుకోవడం మనందరి విధి.

                                   *రూపశ్రీ.