Read more!

వాచిక తపస్సు అంటే!!

 

వాచిక తపస్సు అంటే!!


【శ్లోకం:- అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్। 

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే॥

ఉద్వేగము లేకుండా మాట్లాడటం, నిజం చెప్పడం, ఎదుటి వారికి ప్రియము, హితము కలిగించే మాటలు మాట్లాడటం, వేదములు, శాస్త్రములు చదవడం, తాను చదువుతూ ఇతరులకు చెప్పడం, ఇటువంటి వాక్కుకు సంబంధించిన వాటిని వాచిక తపస్సు అని అంటారు.】

శరీరంలో ఉండే కర్మేంద్రియములతో పనులు చేస్తే, నోటితో మాట్లాడతాము. ఆ మాటలు కూడా ఒక తపస్సులాంటిదే. మన సంస్కృతిలో వాక్కును సరస్వతీ స్వరూపం అన్నారు. అందుకే వాగ్దేవి అని సరస్వతికి పేరు. ఈ వాక్కు రూపంలో సరస్వతీ దేవి ప్రతి వాడి నాలుక మీద నివసించి ఉంటుంది. అటువంటి సరస్వతీదేవి రూపమైన వాక్కును ఉపయోగించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధవహించాలి. పవిత్రమైన వాక్ శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు. అసభ్యంగా మాట్లాడకూడదు. ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. అందుకే వాక్కును బాణంతో పోల్చారు. వాక్బాణాలు అని అన్నారు. 

ఒక దివ్యాస్త్రమును ప్రయోగించన తరువాత ఉపసంహారం చేయవచ్చేమో గానీ, ఒకసారిమాట బయటకు వస్తే దానిని వెనక్కు తీసుకోలేము. ఏదైనా ఆయుధంతో శరీరానికి గాయం అయితే కొన్నిరోజులకు తగ్గిపోతుంది కానీ పరుషమైన వాక్కులతో మనసును గాయపరిస్తే, ఆ గాయం ఎన్నటికీ మానదు అని అంటారు. వాక్కు అంత శక్తివంతమైనది. దానిని సక్రమంగా ఉపయోగించుకోవడం మన అందరి బాధ్యత. 

అది ఎలాగంటే...... ఉద్వేగం లేకుండా మాట్లాడటం. పరుషంగా మాట్లాడకపోవడం. ఇతరుల మనసును బాధపెట్టకుండా మాట్లాడటం. ఎల్లప్పుడూ సత్యం పలకడం అంటే తెలిసిన విషయాలే మాట్లాడాలి. తెలియని విషయాలు తెలిసినట్టు మాట్లాడకూడదు. ఎదుటివారికి ప్రియం కలిగించే మాటలు మాట్లాడటం. అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వారికి ప్రియంగా హితవుగా అనిపించాలి కానీ ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. కొన్ని సందర్భాలతో చెప్పకూడనివి, మనసుకు బాధ కలిగించేవి చెప్పవలసివచ్చినపుడు, అవి చెప్పేముందు కొన్ని మంచి విషయాలు చెప్పి, తరువాత మెల్లమెల్లగా అసలు విషయాలను చెప్పాలి. అప్పుడు వినేవాడికి అంతగా బాధ అనిపించదు. పైగా నా మంచి కోరి చెప్పాడు అని అనుకుంటాడు. 

వేదములు, శాస్త్రములు, పురాణములలో విషయాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత, భాగవత, రామాయణాల గురించి మాట్లాడటం, చదివి వినిపించడం, వ్యాఖ్యానించడం. ఇవన్నీ కూడా వాచిక తపస్సు కిందికి వస్తాయి. మనసులో చెడు తలంపుపెట్టుకొని బయటకు ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సు కాదు. ధ్యానం చేయడం శారీరక తపస్సు అయితే శాస్త్రగ్రంధములలో విషయాలు చదవడం, ఇతరులకు చెప్పడం వాచిక తపస్సు. పురాణాలను, శాస్త్రాలను తమకు తోచినట్టు వక్రీకరించి చెప్పడం వాచిక తపస్సు కాదు.

ఇప్పటి కాలంలో ఎంతో మంది తాము చదివిన పురాణ శాస్త్ర విషయాలకు తమ కల్పనలు, తమ అభిప్రాయాలు జోడించి వివరణలు ఇచ్చేస్తూ ప్రవచనాలు చెబుతుంటారు. వీళ్ళందరూ గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగానూ, గురువులుగానూ చెలామణి అవుతుంటారు. ప్రజలేమో ఇవన్నీ విని ఆ గురువుల మిడిమిడి జ్ఞానాన్ని ప్రశ్నించకుండా పురాణాలను, శాస్త్రాలను, సంప్రదాయాలను విమర్శిస్తూ ఉంటారు. ఫలితంగానే నేటి కాలంలో హిందూ ధర్మము, అందులో విషయాలు విమర్శలకు గురవుతూ, చర్చలకు దారితీస్తున్నాయి. కాబట్టి ప్రజలు నిజానిజాలు తెలుసుకుని అర్థం చేసుకుంటే అపుడు వాచిక తపస్సులో విజయవంతులు అవుతారు. 

◆ వెంకటేష్ పువ్వాడ