Read more!

సమత్వ ప్రాధాన్యత!

 

సమత్వ ప్రాధాన్యత!

ప్రతి మనిషికి జీవితంలో కర్తవ్యమనేది ఉంటుంది. అయితే ఆ కర్తవ్యం అనే మాటకు భగవద్గీతలో కృష్ణుడు సరైన అర్థాన్ని వివరిస్తూ ఇలా చెబుతాడు. 

కర్తవ్యములు అంటే చేయవలసిన పనులు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంతోషంతో చేయవలసినపని. అంటే మనకు ఇష్టమైన, మనం ఇష్టంతో చేసే పని. ఈరకమైన కర్తవ్యంలో వ్యక్తిగత పనులు, ఆత్మతృప్తిని ఇచ్చే పనులు ఉంటాయి.

రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని. దుఃఖమును కలిగించే పని. ఇందులో మన మనసు గురించి అవసరం లేకుండా తప్పనిసరిగా ఏదైనా చేయాల్సి రావచ్చు.

మొదటిది మనకు ఇష్టమైన పని కాబట్టి అంతే ఇష్టంగా చేస్తాము. రెండవది ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ, చెయ్యాల్సి వచ్చిందే అని చేస్తాము. కాని రెండు చేయవలసిన పనులే. తప్పించుకొనేవి కావు. కాబట్టి వీటి విషయంలో సమత్వం పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెబుతున్నాడు భగవానుడు. హిమాలయాలలో, ఎవరూ లేని చోట, సమత్వం పాటించడం గొప్ప కాదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి సమత్వం దానంతట అదే వస్తుంది. కాని, ప్రాపంచిక విషయములు అనుభవిస్తూ ప్రపంచంలో తిరుగుతూ సమత్వము పాటించడమే ఒక యోగము అని భగవానుడు అంటాడు.

మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు. మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకానీ దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు నాకు తక్కువ తెలివి ఇచ్చాడు అని అనడం వివేకంకాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచనా శక్తి ఇచ్చాడు. కాని దానిని మనం సక్రమంగా వినియోగించడం లేదు. కొంత మంది అసలు వినియోగించరు.

మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీటి చుట్టు తిరుగుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలు, టివి సీరియళ్లు చూచి ఆ సీరియళ్ల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. దానివలన మనసు ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ, ప్రేమ వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగితేలుతూ వాటి గురించే ఆలోచిస్తూ చదువు మీద ఏకాగ్రతను కోల్పోతున్నారు.

అంటే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఏదైనా మానసికంగా మనసుకు తీసుకోవడం మీదనే దాని అనుభూతి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పని చేయడం ఇష్టం లేదు అనుకుంటే దాన్ని చేయడానికి మనసు ఏదో దిగులుపడుతుంది, ఆ పని చేస్తున్నంతసేపు ఆసక్తి లేకుండా బాధపడుతూ చిరాకుపడుతూ చేయడం జరుగుతుంది. అదే ఇష్టమైన పనిని చేసేటపుడు మాత్రం ఎంతో ఉత్సాహంగా మరెంతో సంతోషంగా నవ్వుతూ చేస్తారు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఈ రెండు రకాల పనుల వల్ల వచ్చే ఫలితం మాత్రం ఖచ్చితంగా పనులు చేసిన వ్యక్తులకే చెందుతుంది.

సుఖం వచ్చినపుడు ఎగిరెగిరిపడటం ఆనంద పడటం, దుఃఖం వచ్చినపుడు కుంగి పోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖదు:ఖాలను సమంగా భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో గానీ, వ్యాపారంలోగానీ, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయాలలో కానీ, రాణించగలడు.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.