Prema Pandem-Part 2
రోడ్డు మీదికి వచ్చిన రాంబాబు అయోమయంలో పడ్డాడు. ‘సరోజ రావడానికి ఇంకా గంట టైం వుంది’ అందాకా ఏం చేయాలి? ఎలా గడపాలి? ఫుట్ పాత్ మీద దిక్కుతోచకుండా అయిదు నిమిషాలపాటు నిలబడి పోయాడు. హఠాత్తుగా అతని మనస్సులో మెదిలింది రవీంద్రభారతి. అవును.. రవీంద్రభారతిలో ఏదో ఒక ప్రోగ్రాం వుంటుంది. లోపలికి వెళ్ళి కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది. చకచకా రవీంద్రభారతి వైపు అడుగులు వేశాడు రాంబాబు. థియేటర్ గుమ్మంలో వాలంటీర్లు నిల్చుని వున్నారు. వాళ్ళేమైనా లోనికి వెళ్ళకుండా ఆపుతారేమో అని భయపడ్డాడు. కానీ రాంబాబుని అంత దూరంలో చూడగానే వాళ్ళు చేవుల్దాకా నవ్వి ”రండి సార్… రండి” అని ఆహ్వానించారు. రాంబాబుకి అనుమానం వచ్చింది. వాళ్ళు అంతిదిగా ఆహ్వానించేది తననేనా? అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకాల ఎవరూ లేరు! వాళ్ళు ఆహ్వానిస్తున్నది తననే! వాళ్ళు చొక్కాలకి బ్యాడ్జీలు తగిలించుకున్నారు ఏదో కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు. రాంబాబు సమీపించగానే వాలు మరోసారి చేవుల్దాకా నవ్వి ”రండి సార్… రండి… లోపలికి వెళ్ళండి సార్” అన్నారు ఆదరంగా. రాంబాబు లోపలికి ప్రవేశించాడు. హాల్లో జనం పల్చగా ఉన్నారు. అక్కడ కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది అలా సర్డుకుని కూర్చున్నారు . వాళ్ళంత ఇదిగా ఎందుకు ఆహ్వానించారో అతనికి అర్థమయ్యింది. జనం ప్రాబ్లం! సినిమాలకు ఎగబడినట్టుగా జనం ఇంకా వేరే ఏ ప్రోగ్రాంకీ వెళ్ళరు. ఫ్రీ ప్రోగ్రాములైనా వెళ్ళరు. అసలు ఆ మాత్రం జనం అయినా వున్నారంటే గొప్పే. రాంబాబు ఓ చోటు చూసుకుని కుర్చీలో కూలబడ్డాడు. అప్పుడు ఆతను స్టేజి వంక చూశాడు. అక్కడ దాదాపు ఇరవై మంది కూర్చున్నారు. అందరూ సిల్క్ లాల్చీ పంచెలతో .. కండువాలు వేసుకుని ఉన్నారు. కొందరు ఖద్దరు లాల్ఛీ, పైజమాలు వేస్కుని వున్నారు. వాళ్ళ వెనుక బానర్ కట్టి ఉంది. “అఖిలాంధ్ర కవి సమ్మేళనం” అని దానిమీద రాసి ఉంది. రాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని జీవితంలో ఇదే మొదటి సారి ఒక కవి సమ్మేళనానికి రావడం. ఎలాగూ టైం గడపాలి కాబట్టి.. “చూద్దాం కవి సమ్మేళనం అంటే ఎలా ఉంటుందో!” అని అనుకున్నాడు. ఇంతలో వ్యాఖ్యాత అనుకుంటా మైక్ దగ్గరకు వచ్చి దాన్ని ఏ పీకో పట్టుకున్నట్టు పట్టుకుని ‘ఖళ్ ..’ అని దగ్గాడు. ఈసారి అయిదారు క్షణాలు ఆగి “ఖళ్ .. ఖళ్.. ఖళ్..” అని దగ్గాడు. “పాపం ఆయనకి దగ్గు వస్తున్నట్టు వుంది” అనుకోకుండా పైకే అనేశాడు రాంబాబు. అది విని పక్కనున్న వ్యక్తి రాంబాబు వంక వింతగా చూశాడు. అతను తనను అలా ఎందుకు చూస్తున్నాడో రాంబాబుకి అర్థం కాలేదు. నాలుగు క్షణాల పాటు అలా చూసిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు. ” అది దగ్గడం కాదు.. అతను మైక్ టెస్ట్ చేస్తున్నాడు.” అలా అంటున్నప్పుడు అతని ముఖంలో ఓ వింత ఎక్స్క్ష్ ప్రెషన్ ! రాంబాబు గుటకలు మింగి ఓ వెర్రినవ్వు నవ్వి…..”ఓ ……” అన్నాడు. తర్వాత మైక్ పట్టుకున్నవ్యక్తి అంకెలు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. “హలో.. హలో.. మైక్ టెస్టింగ్ .. వన్.. టూ .. త్రీ .. ఫోర్ .. ట్వంటి.. ట్వంటిటూ… ఫోర్టి…” జనంలో సహనం నశించింది. వేదిక మీదున్న కవులు కూడా కుర్చీల్లో ఇబ్బందిగా కదిలారు నల్లులు కుడుతున్నట్టు. “మైక్ బాగానే వినిపిస్తోంది. ఇంక టెస్టింగ్ ఆపండి సార్…” జనంలోంచి ఎవరో అరిచారు. వ్యాఖ్యాత చిరునవ్వు నవ్వాడు. “సభకి నమస్కారం! ప్రేక్షకులు కవుల కవితాగానం వినాలని ఎంతగానో ఎదురుచూస్తునట్టు ఉంది. నేను ఎక్కువ సమయం తీసుకోను” జనం మొత్తం ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చారు. అందరూ ఒక్కసారిగా నిట్టుర్చడంతో సుడిగాలిలా శబ్డంవచ్చింది. రెండు క్షణాలు ఆగి వ్యాఖ్యాత తన ఉపన్యాసం కొనసాగించాడు. “ఇంతదాకా మా కార్యదర్శి నివేదిక, ముఖ్య అతిథిగారి ఉపన్యాసం విన్నారు. మరికొద్ది క్షణాలలో కవుల వచన కవితామృత ధారలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉండండి.” ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. రాంబాబు అటు ఇటూ చూసి తను కొట్టకపొతే బాగుండదేమోనని తను కూడా చప్పట్లు కొట్టాడు. “మొదటగా కవిసింహం బిరుదాంకితులు శ్రీ నరసింహం గారు తమ కవితను వినిపిస్తారు. వ్యాఖ్యాత పక్కకు వెళ్లిపోయాడు. మైకు ముందుకు ‘కవిసింహం’ వచ్చాడు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టాడు రాంబాబు అటు ఇటూ చూసి తను కూడా కొట్టాడు.