Prema Pandem Part-1

 

రాంబాబు ఓ సారి దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని ముందు రోడ్డు మీద దుమ్ము మేఘంలా లేచింది. కాస్త దుమ్ము అతని కళ్ళలో కూడా పడింది. “నేను మరీ ఇంత ఇదిగా నిట్టుర్చకుండా ఉండాల్సింది. అనవసరంగా కళ్ళలోచచ్చేంత దుమ్ము పడింది.” అనుకున్నాడు రాంబాబు కళ్ళు నులుముకుంటూ . నిజానికి దుమ్ము అప్పుడే ఆ వైపుగా వెళ్ళిన ఒక బస్సు వల్ల పడింది. రాంబాబంతే .. ఏదయినా ఎక్కువగా ఆలోచిస్తాడు.. లేదా అంచనా వేస్తాడు.

అతనికి విపరీతమైన ఇమేజినేషన్ వుంది. ఒక సంఘటన జరిగితే దాని ఆధారంగా ఎన్నెన్నో ఊహలూ, ఆలోచనలూ అల్లుకుపోతాడు. అప్పుడు సమయం ఆరు కావస్తోంది. సాయంకాలం సమయంలో ఓ నగరంలో రోడ్డు మీద ఎంత రద్దీ ఉండాలో అంత రద్దీ ఆ సమయంలో వుంది. ఫుట్ పాత్ మీద జనం వంట గదిలో గృహిణి చీపురు దెబ్బలు తిన్న బొద్దింకలు వలె కంగారుగా గంతులేస్తూ, పరుగులు పెడుతూ నడుస్తున్నారు.సైక్లిస్ట్లులు కొందరు కార్లకీ, స్కూటర్లకి పానకంలో పుడకల్లా అడ్డు తగులుతూ అడ్డదిడ్డంగా సైకిల్ తొక్కుతూ స్వేచ్చావాయువులు ఊపిరి తిత్తుల నిండుగా పీలుస్తున్నారు. పెద్దవాళ్ళు ఏదయినా విషయం తీవ్రంగా చర్చించుకుంటున్నప్పుడు పిల్లలు వాళ్ళ మధ్యలో నుండీ అల్లరిచిల్లరగా పరుగులు పెడుతున్నట్టు ఆటోలు రద్దీగా వుండే ట్రాఫిక్లో దూరిపోయి అటూ ఇటూ పరుగులు పెడుతున్నాయి. సిటీ బస్సు గుమ్మానికి వేళ్ళాడుతున్న పాసింజర్లు విరగకాసిన ద్రాక్ష గుత్తిలా ఉన్నారు.

ఇంతటి హెవీ ట్రాఫిక్ లో కొందరు పాదచారులు రోడ్ కి అటు వైపు నుండీ ఇటు వైపుకు దాటాలని యమ ప్రయాస పడుతున్నారు.రోడ్ మీదకి కంగారు కంగారుగా వస్తున్నారు. మళ్ళీ కార్లూ, బస్సులూ వస్తుంటే చెంగున వెనక్కి ఫుట్ పాత మీదికి దూకుతున్నారు.మళ్ళీ రోడ్డు మధ్యకి వచ్చి వెనక్కి పరుగెత్తాలో, ముందుకు అడుగువెయ్యాలో తెలీక కంగారుగా అడుగులు ముందుకీ వేస్తుంటే అదేదో గమ్మత్తయిన డాన్స్ చేస్తున్నట్టు వుంది.రోడ్డు దాటే ఆ కంగారులో కొందరి కొప్పులు ఊడిపోతున్నాయ్..

మరీ కొందరి క్రాఫులు ఎగిరిపోతున్నాయ్. ఆ సందట్లో ఒకడెవడో మొపేడ్ స్పీడ్ గా నడుపుతూ చూసుకోకుండా ఆ రాచ మార్గం మధ్యలో వున్న పెద్ద గొయ్యిలోంఛి బండి పోనిచ్చి దెబ్బకి ఆరడుగుల ఎత్తుకు గాల్లో లేచి ‘క్యార్’ అని అరిచి మళ్ళీ రోడ్డుమీద సేఫ్ గా పడినందుకు సంతోషంతో పకపకా నవ్వుతూ తిరుగులేని వీరుడిలా మోపెడ్ మీద ముందుకు సాగిపోయాడు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం పూట ఏ రోడ్డుమీద చూసినా జరిగే తంతు ఇదే! రాంబాబు రోడ్డు ఆ చివరిదాకా చూసి మళ్ళీ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఈసారి దుమ్మేమీ రేగలేదు. ‘ఫరవాలేదు… ఈసారి మెల్లగాయే నిట్టూర్చినట్టున్నా’ అనుకున్నాడు. అప్పటికి అతను పావుగంట నుంచీ నిల్చుని వున్నాడు. అది లక్డీకాపూల్ ఏరియా. అతను రవీంద్రభారతి హాలుకి ఎదురుగా నిల్చున్నాడు… రోజ కోసం ఎదురుచూస్తూ. రాంబాబు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయిదున్నరకల్లా ఆఫీసు అయిపోతుంది. అక్కడనుంచి రవీంద్రభారతి పదినిముషాల్లో చేరుకున్నాడు. సరోజని అక్కడికి పావుతక్కువ ఆరుకల్లా రమ్మని చెప్పాడు. తనూ సరే అంది. కానీ ఆరు గంటలు కావస్తున్నా ఇంకా రాలేదు రోజ. రాంబాబుకి చాలా ఆతృతగా వుంది…

అంతకంటే ఎక్కువ నర్వస్ గా వుంది. ఆ రోజు వాళ్ళ కలయికకు ఎంతో ప్రాముఖ్యం వుంది. అందుకే రాంబాబు అలా ఫీలవుతున్నాడు. ఆ రోజు సరోజ రాంబాబుని వాళ్ళింటికి తీస్కెళ్ళి వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తానంది. వాళ్ళింట్లో సరోజ తండ్రితో ఎలా ప్రవర్తించాలో మూడు రోజుల నుండీ రిహార్సల్స్ పదేపదే చేస్తుకుంటున్నాడు. సమయం గడిచిన కొద్దీ అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది. సరోజ ఇంకా ఎందుకు రాలేదు? ఇంట్లో ఏమైనా అడ్డంకి ఏర్పడిందా? పోనీ ఫోన్ చేస్తేనో? వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తితే ఏం చెప్పాలి? ఒకవేళ వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తితే ఏం మాట్లాడకుండా డిస్కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా అనుకుని అక్కడికి దగ్గర్లో వున్న ఒక హోటల్ వైపు అడుగులు వేశాడు రాంబాబు. కౌంటర్ దగ్గరున్న మనిషి పర్మిషన్ తీసుకుని డయల్ చేశాడు.

”హలో… ఎవరూ?” ఫోన్ సరోజే ఎత్తింది… తీయని కంఠస్వరం! సరోజ తండ్రి గనుక ఈ ఫోన్ ఎత్తితే వెంటనే డిస్కనెక్ట్ చేయడానికి రెడీగా వున్న రాంబాబు సరోజ గొంతు వినగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ”హలో సరూ… నేనే…” అన్నాడు రాంబాబు. ”ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావ్?” అడిగింది సరోజ. ”ఎక్కడి నుండి అని అడుగుతావేం? భలేదానివే! లక్డీకాపూల్ నుండి ఫోన్ చేస్తున్నా… ఇక్కడికి రాలేదేం? కొంపదీసి మర్చిపోయావా? ఇందాకట్నుండి ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నా…” ”భలేవాడివే… ఎలా మర్చిపోతాను? సరిగ్గా ఇంటిదగ్గర బయలుదేరే సమయానికి గెస్ట్ లు వచ్చారు. అయ్యో నువ్వు రోడ్డుమీద ఎదురుచూస్తుంటావే… నీకు ఇన్ ఫార్మ్ చెయ్యడం ఎలా అని బాధపడ్తుంటే లక్కీగా నువ్వే ఫోన్ చేశావ్” ”అయితే ఇప్పుడు నువ్వు రావడంలేదా?” ”ఎందుకు రానూ? కానీ వెంటనే కాదు… వాళ్ళని పంపించి రావడానికి దాదాపు గంట టైం పడ్తుంది.” గంటా? అంతదాకా ఏం చేయాలబ్బా? అనుకున్నాడు రాంబాబు. ”పోనీ ఈ వేళ మానేసి మీ ఇంటికి నేనొచ్చే ప్రోగ్రాం మరోరోజు పెట్టుకుంటేనో?” నసుగుతూ అన్నాడు.

అతనికి ఆ సిచ్యుయేషన్ నుండి దూరంగా పారిపోవాలని వుంది. కారణం… భయం! వాళ్ళ నాన్నని ఫేస్ చేయడానికి భయం. ”అదేం కుదర్దు… ఈవేళ నువ్వు మా ఇంటికి రావాల్సిందే! మా నాన్నగారికి చెప్పాను నిన్ను తీసుకొస్తున్నట్టు” ఖచ్చితంగా చెప్పింది సరోజ. ”అదికాదూ…. మరీ … అంటే… చీకటిపడ్డాక… ఆలస్యంగా …” ఫోన్ లో నసుగుతున్నాడు రాంబాబు. ”చీకటంటే… ఆలస్యం ఏమిటి? నువ్వేమైనా ఆడపిల్లవా? ఇలా ఫోన్ లో మాట్లాడ్తూ కూర్చుంటే నేను రావడం ఇంకా ఆలస్యం అవుతుంది. నేను ఏడూ ఏడంపావు మధ్యలో వస్తాను… నువ్వు అక్కడే వుండు” గబగబా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సరోజ. రాంబాబు రిసీవర్ క్రెడిల్ చేసి అరచేతిలో పట్టిన చెమటను ఫ్యాంటుకు తుడుచుకుని కౌంటర్ లోని మనిషికి రెండు రూపాయలు చెల్లించి బయటపడ్డాడు.