Read more!

చూసే కోణంలో స్వరూపం దాగుంటుందంటారు నిజమేనా?

 

చూసే కోణంలో స్వరూపం దాగుంటుందంటారు నిజమేనా?

ఒక సమావేశ మందిరంలో ఒక మత గురువు ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్న శ్రోతలను ఉద్దేశించి ఏదో చెప్పాలని అనుకున్నాడు. 

ఆయన  వేదిక మీదకు ఎక్కి ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఓ చిన్నపిట్ట వచ్చి కిటికీ రెక్కమీద కూర్చుని పాడసాగింది. హృదయం పూర్తిగా రంగరించి పాడింది. అది అపి ఎగిరిపోయినప్పుడు గురువు అన్నాడు: 'ఈ రోజుకు ప్రవచనం అయిపోయింది,' అని.

మనకు వున్న గొప్ప కష్టం యేమిటంటే, మనను మనం స్పష్టంగా చూసుకోగలగడం, పైపై సంగతులనుకాక అంతరంగికంగా స్పష్టంగా చూసుకోవడం. ఏ చెట్టునో, పూవునో మనిషినో చూసామని అంటాము - కాని, దానిని నిజంగా చూశామని చెప్పగలమా? లేక, మాట సృష్టించిన ప్రతిరూపాన్ని మాత్రమే చూస్తున్నామా? అంటే ఒక మేఘం వంక చూస్తున్నప్పుడు, చెట్టును తిలకిస్తున్నప్పుడు సాయంసంధ్య సరాగాలను సందర్శిస్తున్నప్పుడు దానిని యథాతథంగా చూస్తున్నామా లేక కేవలం కళ్లతోనే బుద్ధితోనే కాకుండా పూర్తిగా సంపూర్ణంగా చూస్తున్నామా?

చెట్టువంటి ఒక వస్తువును చూస్తున్నప్పుడు వేరే ఏవో తోడు అయిన భావాలతో దానిని గురించి ఇదివరకే తెలిసివున్న జ్ఞానంతో, ఏదో అపోహ తీర్పు చెట్టుకు మీకు మధ్య తెరలను దించి, అసలు వస్తువును కనిపించనీయకుండా ఉండే స్థితిలో చూస్తున్నామా? ఒకసారి ఇలా ప్రయోగం చేసి చూడండి. మీ అస్తిత్వం అంతటిలోను గమనించండి. మీ శక్తి అంతా వినియోగించి చూడండి. అప్పుడు నిజంగా ఏమవుతుందో గమనించండి. ఆ తీవ్రతలో పరిశీలకుడు అంటూ వేరుగా ఒకడు వుండడు అని అనుభవానికి వస్తుంది. సావధానత ధ్యాస అనేదే వుంటుంది. అసావధానత లేక పరధ్యానత వున్నప్పుడు పరిశీలకుడు పరిశీలన వస్తువు అన్నవి వేరువేరుగా వుంటాయి. పరిపూర్ణ సావధానతతో ఒక వస్తువును చూస్తున్నప్పుడు మధ్యలో ఊహలు దూరటానికి విరామం లేదు. జాగా లేదు. ఓ సూత్రం, జ్ఞాపకం ఉత్పన్నం కాదు. ఈ విషయం అర్థం చేసుకోడం చాల అవసరం. ఎందుకంటే, మనం ఇంకా తీవ్రతరంగా అన్వేషించి తెలుసుకోవలసిన విషయాలవైపు వెళ్లబోతున్నాం.

మనసు 'నేను' పూర్తిగా లేనటువంటి పరిపూర్ణ విసర్జన భావంతో, అనాసక్తంగా ఓ చెట్టువంక, నక్షత్రాల వంక, నదీజలాల వంక చూసినప్పుడే సౌందర్యం అంటే యేమిటో తెలిసివస్తుంది. అలా చూస్తున్నప్పుడు ప్రేమ స్థితిలో వున్నాం. సౌందర్యాన్ని మనం సరిపోల్చి చూచుకోవటానికే అలవాటు పడివున్నాం. మనిషి పోగుచేసి కలిపి చూపిన దానిలోనే సౌందర్యం ఉందనుకుంటాం. ఫలాన వస్తువు అందంగా ఉందని అంటాం. ఒక అందమయిన బంగాళ చూస్తాము. ఒకవేళ  భవన నిర్మాణ శాస్త్ర విషయంలో పరిజ్ఞానం ఉంటే గనుక   అది అందమయినదని భావిస్తారు. అందులో లోటు పాట్లు ఉంటే దాన్నీ చెప్పగలుగుతారు.  అంతకు ముంది ఎప్పుడెప్పుడో.. ఎక్కడెక్కడో… చూసిన యితర భవంతులతో దానిని పోల్చి చూసుకుంటారు. కాని 'వస్తువును ఆశ్రయించుకోకుండా అందం అనేది ఉందా?" అని. 

పరిశీలకుడు అంటూ ఒకడు వుండి, అతడు నిర్ణేతగా అనుభూతి పరుడుగా ఆలోచించేవాడుగా ప్రవర్తిస్తున్నంతసేపూ సౌందర్యం అంటూ యేమి లేదు. ఎందుకంటే, సౌందర్యం బాహ్యమైనది, పరిశీలకుడు చూసి తీర్చు ఇస్తుంటాడు. పరిశీలకుడు అంటూ ఒకడు లేనప్పుడు అయితే, దీనికి అద్భుతమయిన ధ్యానం అవసరం, లోచూపు అవసరం అప్పుడు వస్తువుతో ప్రమేయం లేకుండానే సౌందర్యం వుంటుంది. ఇలా ఒక వ్యక్తి తాను చూసిన వాటిని చూసే కోణంలో దాని స్వరూపం ఆ వ్యక్తికి అర్థమవుతుంది. 

◆నిశ్శబ్ద.