Read more!

మనిషి ఖ్యాతి దీనిపై ఆధారపడి ఉంటుంది?

 

మనిషి ఖ్యాతి దీనిపై ఆధారపడి ఉంటుంది?


అవిద్వానపీ భూపాలో విద్యావృద్ధోపసేవయా | పరాం శ్రియ మవాప్నోతి జలాసన్నతరు ర్యథా ॥

రాజు విద్వాంసుడు కాకపోయినా, విద్యావంతుల సహవాసం చేత నీటికి దగ్గరగా ఉన్న చెట్టులాగా గొప్ప ఖ్యాతి పొందుతాడు.

చాలా గొప్ప సూత్రం ఇది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతడి మిత్రులను చూసి చెప్పవచ్చంటారు. అలాంటిదే ఇది. ఒక ప్రభువు గొప్పతనం అతడు చేరదీసిన వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నాటికీ మనం భోజరాజుని 'కాళిదాసు' వల్ల స్మరిస్తూంటాం. కృష్ణదేవరాయలనగానే 'అష్టదిగ్గజాలు గుర్తుకు వస్తారు. అక్బర్ ఖ్యాతి తాన్సేన్, బీర్బల్ వంటివారిపై ఆధారపడి ఉంది. అంటే, రాజుకు ఎంత అధికారం ఉన్నా, అతడు చేరదీసి, ప్రోత్సహించినవారిపై అతడి ఖ్యాతి ఆధారపడి ఉంటుందన్నమాట.

పై సూత్రానికి మరో రూపం 'రాజతరంగిణి'లో కల్హణుడు కిన్నరుడనే రాజు గురించి చెప్తూ రచించిన శ్లోకం. కిన్నరుడు పరభార్యను మోహిస్తాడు. అతడిని ఆశ్రయించినవారితో సహా నాశనమౌతాడు. ఆ సందర్భంలో కల్హణుడు 'దారం బావి గిలకను చేరి అధోగతిని పొందుతుంది. అదే పుష్పాన్ని ఆశ్రయిస్తే దేవతల శిరస్సుపై నిలుస్తుంది. అలాగే మానవులు, తాము ఆశ్రయించిన వారి గుణదోషాలను అనుసరించి ఊర్ధ్వ, అధోగతులకు పోతారు' అని వ్యాఖ్యానిస్తాడు. అంటే ప్రభువు ఉత్తముడైతే, అతడిని ఆశ్రయించినవారు సజ్జనులవుతారు. సత్ఫలితాలు పొందుతారు. అలాగాక ప్రభువు దుష్టుడయితే అతడిని ఆశ్రయించిన వారు సజ్జనులైనా దుష్ఫలితాలు అనుభవిస్తారు. ఈ నిజాన్ని నిరూపిస్తూ పురాణాలలో కూడా అనేక కథలున్నాయి.

మహాభారతంలో కర్ణుడి పాత్ర అందరికీ తెలిసిందే. కర్ణుడు ఉత్తముడు. వీరుడు. కుంతీ పుత్రుడు. సూర్యాంశ కలవాడు. పాండవులకు ఏ విషయంలోనూ తీసిపోయేవాడు కాదు. శౌర్య ధైర్యప్రతాపాల్లోనే కాదు, వ్యక్తిత్వం విషయంలో కూడా అత్యుత్తముడు. ఇచ్చిన మాట తప్పడు. దానవిశారదుడు. ప్రభుభక్తి కలవాడు, కానీ అతడు ఆశ్రయించింది సుయోధనుడిని. దుష్టుడుగా పరిగణనకు వచ్చేవాడిని. దాంతో పంచపాండవులకు ప్రతిగా పోరాడాల్సి వచ్చింది. దుష్టుడి కొమ్ము కాయటంతో అతని వీరత్వం నిస్తేజమైంది. అతడి శక్తి బలహీనమైంది. అతడి మంచితనం పనికి రానిదైంది.

ఇందుకు భిన్నంగా రావణాసురుడి తమ్ముడై కూడా విభీషణుడు అతడి దుశ్చర్యలను ఖండించాడు. రావణాసురుడిని సన్మార్గం వైపు మళ్లించాలని ప్రయత్నించాడు. కానీ మృత్యుఛాయలో ఉన్న రావణాసురుడు, విభీషణుడి సలహాను పెడచెవిన పెట్టాడు. పరుషపదాలతో దూషించాడు. దాంతో విభీషణుడు, రావణాసురుడిని వదిలిపెట్టాడు. రాముడి శరణు వేడాడు. రాక్షసుడైనా, సమస్తజనావళి మన్ననలందుకుంటున్నాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడిని ఆశ్రయించాడు కాబట్టి.

దారం బావి గిలకను ఆశ్రయించి అధోగతి పొందినట్టు, కర్ణుడు, సుయోధనుడిని ఆశ్రయించి నశించాడు. చెడ్డవాడుగా గుర్తింపు పొందాడు. రావణాసురుడి సోదరుడై, రాక్షసుడుగా పరిగణనకు రావాల్సిన విభీషణుడు, రాముడిని ఆశ్రయించటం వల్ల ఉత్తముడుగా పరిగణనకు వచ్చాడు.

ఈ సందర్భంలోనే వాల్మీకి మహత్తరమైన నాయకత్వ లక్షణాలను రామాయణంలో పొందుపరచాడు. ప్రస్తుతం అయిదు గుర్రాలు అయిదు వైపులా లాగుతూంటే, రథాన్ని నడిపించాల్సి వచ్చేటువంటి సంకీర్ణప్రభుత్వాల కాలంలో అందరి అభిప్రాయాలనూ మన్నిస్తూ, అందరినీ కూడదీసుకొని పని సాగించుకొనే నేర్చు నాయకుడికి ఉండాలని రాముడి ప్రవర్తన ద్వారా జగతికి ప్రదర్శించాడు వాల్మీకి. ఇదీ అప్పటి కాలంలో రాజు, ఇప్పటి కాలంలో నాయకుడికి ఉండాల్సిన లక్షణం.

                                   ◆నిశ్శబ్ద.