Read more!

సర్వభూతాయస్థితః అంటే అర్థం!!

 

సర్వభూతాయస్థితః అంటే అర్థం!!

 


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః।

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ॥


ఓ గుడాకేశా! (తమోగుణమును, అలసత్వమును జయించిన వాడా!) ఈ చరాచర జగత్తులో ఉన్న భూతములలో ఆత్మస్వరూపుడుగా నేను నిలిచి ఉన్నాను. ఈ సకల ప్రాణుల యొక్క పుట్టుక, పోషణ, మరణము అన్నీ నేనే అయి ఉన్నాను. నేను తప్ప మరొకటి ఉంటూ ఏదీలేదు.

“అర్జునా! నేను ఇదివరకే చెప్పాను కదా! సర్వభూతములలో ఆత్మ స్వరూపుడుగా నేనే ఉన్నాను. సమస్త ప్రాణుల యొక్క పుట్టుక, స్థితి, అంతము కూడా నేనే కదా. ఇంక చెప్పేదేముంది." అని ముందుగానే విభూతియోగం పూర్తిగా నాలుగు ముక్కలతో ముగించాడు. భగవానుడికి తన గురించి తాను చెప్పుకోవడం పరిపాటి. తన గురించి ఈ మానవులు ఎప్పటికైనా తెలుసుకుంటారేమో అని ఆయన ఆశ. కాని వింటున్న అర్జునుడికి కొంతైనా తెలిసిందేమో కానీ, మనందరమూ ఎప్పటికీ తెలుసుకోలేము అన్న సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు అందుకే మరలా మరలా చెబుతున్నాడు. ప్రతి జీవికి ఒక దేహము అందులో మనోబుద్ధిఅహంకారాలు, వాటిని సాక్షిగా చూస్తున్న ఆత్మ ఉంటాయి. ఆ ఆత్మ స్వరూపుడిని నేనే. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో లీనం అయితే జీవాత్మ అవుతుంది. కాబట్టి జీవాత్మ, ఆత్మ ఒక్కటే. వేరుకాదు. కాబట్టి మనం అందరం మన మనసును, చిత్తమును ప్రాపంచిక విషయముల నుండి లోపలకు మళ్లించి ఆత్మయందు నిలపాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా పరమాత్మదృష్టిలో తక్కువ కాదు. అందరూ ఆత్మస్వరూపులే. 

కాకపోతే ప్రతివ్యక్తి నేను ఈ శరీరం కాను, నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం పొందగలగాలి. నాలో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు అనే ఆత్మవిశ్వాసం ప్రతి మానవుడూ పొందగలగాలి. అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే రాగద్వేషాలు ఉండవు. అందరికీ ఉపకారము చెయ్యాలనిపిస్తుంది. ఎవరూ ఎవరినీ ద్వేషించరు, ఇతరులకు చేసే సేవ, వారిలో ఉన్న ఆత్మలకు చేసే సేవ, అనే అనుభూతికలుగుతుంది. (మానవ సేవేమాధవ సేవ) అప్పుడు ఎవరు కూడా పాప కార్యాలు చేయరు.

సర్వభూతాయస్థితః అంటే సకల భూతములలో ఆత్మ స్వరూపుడుగా స్థిరంగా ఉన్నాను అని అందరూ తెలుసుకోవాలి. అప్పుడే అందరూ అన్ని దుఃఖములకు దూరమై శాశ్వత ఆనందమును పొందగలరు. పరమ శాంతిని పొందగలరు.

మరి ఈ విభూతులు ఏమిటి అని ప్రశ్నించుకుంటే, పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఆయనలో లీనం అవుతుంది. ఈ ప్రకృతిలో జరిగే సృష్టి, స్థితి, లయములు ఆయన వలననే జరుగుతున్నాయి. సమస్త జీవరాసులను సృష్టించి వాటిలో ప్రవేశించి, వాటిని పోషించి, మరలా లయం చేస్తున్నాడు. ఇదీ ఒక లీలా మాత్రంగా జరుగుతూ ఉంది. ఇది ఒక నియమము. పరమాత్మ అన్నిటిలోనూ, అన్ని జీవరాసులలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అన్నది లేదు. కాకపోతే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మను తెలుసుకోడానికి అందరం ప్రయత్నించాలి. తాను వేటి వేటిలో ప్రకృష్టంగా ఉన్నాడో తన విభూతులు వేటి వేటిలో ప్రముఖంగా ఉన్నాయో తెలియజేస్తున్నాడు కృష్ణుడు. ఈ చెప్పడం కూడా మనందరికీ అర్ధం అయ్యే రీతిలో, మనకు తెలిసిన విషయాల గురించి దేవతా మూర్తులు, ఋషులు, మానవులు, జంతువులు, పక్షులు, కదలని వస్తువులు, కదిలే వస్తువులు అన్నిటిలో నా విభూతులు ఉన్నాయి. ఈ జగత్తు అంతా ఈశ్వర మయం అనే విషయాన్ని తెలియజేస్తాడు కృష్ణుడు.


                                   ◆వెంకటేష్ పువ్వాడ.