Read more!

మనిషికి ఉండవలసిన గుణములు!!

 

మనిషికి ఉండవలసిన గుణములు!!

 


భక్తులు, సాధారణ వ్యక్తులు భగవంతుడి విషయంలోనూ, జీవితంలోనూ కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని, ఆ లక్షణాలు జీవితంలో పాటించాలని భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు. అవన్నీ ఈ కింది విధంగా పొందుపరచబడ్డాయి.

1.ఎవరినీ ద్వేషించకూడదు. (ఈ కాలంలో అందరిలో ద్వేషం ఎక్కువైపోయింది)

2. అందరితో స్నేహంగా ఉండాలి. (అనవసరంగా గొడవలు పడకూడదు. జీవితంలో అందరూ కొన్ని దశల తరువాత దూరం అవుతూ ఉంటారు అలాంటప్పుడు గొడవలు ఎందుకు??)

3. అతి మమకారము పనికిరాదు. (ప్రేమిస్తే ఇక ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించడం. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచడం చేస్తారు. ఈ విషయంలో మార్పు రావాలి)

4. అహంకారము అసలు పనికిరాదు, (నాకే తెలుసు అనే గుణం చాలా ప్రమాదకరమైంది).

5. అందరి పట్ల కరుణ దయ కలిగి ఉండాలి. (మనిషికి ఎన్ని మంచి గుణాలు ఉన్నా కరుణ దయ లేకపోతే వ్యర్థం)

6. సుఖదు:ఖములు సమంగా చూడాలి. (సంతోషాలకు పొంగిపోరాదు, బాధలకు కుంగిపోరాదు) 

7. అన్ని సందర్భములలో ఓర్పుకలిగి ఉండాలి. (ఓపిక లేకుంటే మనిషి జీవితం తొందరగా తప్పులలో జారిపోతుంది).

8. ఎప్పుడూ సంతోషంగా, సంతుష్టిగా ఉండాలి. (తృప్తి మనిషికి ప్రశాంతతను ఇస్తుంది).

9. మనసును అదుపులో ఉంచుకోవాలి. (అప్పుడే అది మనాం చెప్పినమాట వింటుంది)

10. చంచల స్వభావం కాకుండా ధృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. (దృఢంగా ఉన్నప్పుడే గొప్ప నిర్ణయాలు తీసుకోగలం, అందులో విజయవంతం కాగలం).

11. మనసును, బుద్ధిని ఆత్మలో ఉంచాలి. (అనవసర భౌతిక సుఖాల కోసం ఆరటపడకూడదు)

12.భయం అనేది వదిలిపెట్టాలి. తాను ఎవరికీ భయపడకూడదు. ఇతరులను భయపెట్టకూడదు (భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది).

13. కోపం వదిలిపెట్టాలి. ఎక్కువ ఆనందము పొందకూడదు, ఎక్కువగా భయపడకూడదు. (తన కోపమే తన శత్రువు)

14. దేనిమీదా ఎక్కువ మమకారము, అపేక్ష కలిగి ఉండకూడదు. (అన్నిటినీ సమాన భవంతో చూడాలి)

15. ఎల్లప్పుడూ శరీరమును, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. (మనసు శుద్దిగా ఉంటే చాలని అనుకోవడం తప్పు. శరీరం శుభ్రంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఆలోచించగలుగుతుంది)

16. ప్రతి కార్యమును శ్రద్ధతో సమర్థతతో చేయాలి. చెయ్యాల్సివచ్చిందే అని చేయకూడదు. (ఏదో మొక్కుబడిగా చేయకూడదు ఏ పని. శ్రద్ధతో చేస్తే అందులో సృజనాత్మకత బయటకొస్తుంది).

17. దేని మీదా అత్యధికమైన ప్రేమ, పక్షపాతము చూపకుండా తటస్థంగా ఉండాలి. (ఎక్కువ తక్కువల వలయం నుండి బయటపడాలి)

18. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏ వ్యాకులతా చెందకూడదు. (బాధ పడటం ఎందుకు అన్ని పనులు చేస్తున్నది మనమే, వాటి ఫలితాలు చూసినప్పుడు ఎందుకు బాధ??).

19. ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయాలి. ఆ ఫలితమును పరమాత్మకు అర్పించాలి.( ముందుగా అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ ఎదురవుతుంది. మన సమర్త్యంతో పని చేయడం మాత్రమే మనం చేయాల్సింది).

 20. తనకు సుఖం కలిగి నపుడు పొంగి పోయి నా అంతవాడు లేడనకూడదు.(దీని వల్లనే అహంకారం పెరుగుతుంది).

 

21. ఇతరులమీద ఎట్టి పరిస్తితుల మీద అసూయ పడకూడదు. ద్వేషించకూడదు. (ద్వేషించడం, అసూయపడటం చెడ్డ గుణాలు).

22. అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి. ఏడుస్తూ ఉండకూడదు. (నవ్వుతూ ఉంటే బాధలు దగ్గరకు రావు. వచ్చినా అవి అంత ప్రభావం చూపించవు).

23. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. కోరికలను విడిచిపెడితే మరి మంచిది. (కోరికలు మనిషి కి శత్రువులు).

24. శుభము, అశుభము రెండింటినీ సమానంగా అనుభవించాలి. ( సంతోషాలు ఇచ్చేవి శుభాలు, బాధనిచ్చేవి అశుభలు అయితే రెండూ మన పనుల ఫలితాలే).

25, శత్రువులను, మిత్రులను సమానంగా ఆదరించాలి. (అందరినీ సమానంగా చూడగలిగితే మనిషి ఉన్నతుడు అవుతాడు).

26. మానము అవమానము రెండింటినీ చిరునవ్వుతో భరించాలి.( ఎవరో ఎదో అన్నారని బాధపడకూడదు). 

27. అనవసరమైన విషయాలలో ఆసక్తిని వదిలి పెట్టాలి. (కొన్ని జీవితాలను ఇబ్బందిపెడతాయని తెలిసినప్పుడు వాటిని వదిలెయ్యాలి).

29. కాలానుగుణంగా వచ్చే ఎండ చలి వర్షము వీటిని సమత్వభావంతో భరించాలి. (వాటి ద్వారా మనిషిలో ఓర్పు పెరుగుతుంది).

30. ఎవరు మనలను నిందించినా, పొగిడినా చిరునవ్వుతో స్వీకరించాలి కానీ ఎగిరి గంతేయకూడదు. కిందకూడదు. (స్థిరత్వ భావన కలిగి ఉండాలి).

31. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. గడగడ వాగకూడదు. (అతి భాష మతి హాని, మిత భాష ఎంతో హాయి).

32. ఏదిదొరికితే దానితో తృప్తి చెందాలి. లేని దాని కోసం పాకులాడకూడదు. ( పాకులాడితే మనసు కలవరం కు గురవుతుంది).

33. ఉన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా పెద్ద ఇల్లు లేదని బాధపడకూడదు. ఇదంతా భగవంతున ప్రసాదము నేనే కేవలం అనుభవిస్తున్నాను అనే భావన కలిగిఉండాలి.(అప్పుడే తృప్తి) 

34, ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వము పనికిరాదు. (పరిస్థితులను బట్టి మారిపోతే నిలకడ కోల్పోతాం).

35. ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి.(భక్తి లేకపోతే క్రమశిక్షణ ఉండదు).

                                  ◆ వెంకటేష్ పువ్వాడ.