Read more!

భగవద్గీతలో నేటి భారతం!!

 

భగవద్గీతలో నేటి భారతం!! 

ప్రస్తుత ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఎన్నోచోట్ల జరుగుతున్న ఘోరాలు, అందరూ ఎక్కువగా వింటున్న దారుణాలు ఆడవాళ్లకు సంబంధించినవే. అవన్నీ కూడా బలాత్కారనికి చెందిన సంఘటనలే. ఇవన్నీ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే కారణాలు ఏవేవో చెబుతుంది సమాజం. ఇంకా మనోవిశ్లేషకులు కూడా కొన్ని చెబుతారు, చట్టానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అయితే ఇలాంటి వాటి గురించి భగవద్గీతలో కృష్ణుడు ముందుగానే ఇట్లా ప్రస్తావించాడు. 


కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః॥ 

మోహాద్గృహీత్వా౨ సహా స్రవర్తనే శుచివ్రతాః॥


కొంత మందికి విపరీతమైన కామ సంబంధమైన, స్త్రీ సంబంధమైన కోరికలు ఉంటాయి. అవి అగ్నిలో నెయ్యి పోస్తే ఎలా భగభగమండుతుందో అలా నిరంతరం పెరుగుతూ పోతుంటాయి. ఎన్నటికీ చల్లారవు. వారికి ఎంత ధనం, ఆస్తులు సంపాదించినా, ఎన్ని కోరికలు తీరినా తృప్తి అనేది ఉండదు. ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కొత్త కొత్త విపరీతమైన కోరికలు పుట్టుకొస్తాయి. 


అటువంటి వారు న్యాయస్థానం వేసే శిక్షలకు భయపడరు. తమ కోరికలు, కామ వాంఛలు తీర్చుకోవడమే వారికి ముఖ్యం. వారికి వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అంటేనే ఎక్కువ ఇష్టం. వారి కోరికలు తీర్చుకోడానికి దంభము అంటే మాయమాటలు చెబుతారు. అబద్ధాలు చెబుతారు. లేని పోని ఆశలు కల్పిస్తారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి స్త్రీలను వశం చేసుకుంటారు. అంటే లొంగదీసుకుంటారు ఆ తరువాత  అనుభవించి వదిలేస్తారు. ఇలా చేసేవాళ్లకు  అభిమానము ఎక్కువగా ఉంటుంది. తమమీద తమకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. అదేమిటని అడిగితే అడిగిన వారి మీద ఎదురు దాడికి దిగుతారు. వీరికి మదం కూడా ఎక్కువే. మదం అంటే అహంకారంతో కూడుకున్న పొగరు. తమకు ఎదురు ఎవరూ లేరనే ధీమాగా ఉంటారు. వీరికి ధనమదము, అధికార మదము ఎక్కువగా ఉంటుంది. తాము ఏమి చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో ఉంటారు.


వీరిలో మోహం ఎక్కువ. తాము చేస్తున్నది తప్పు, నేరం అని తెలుసుకోలేని మోహంలో పడి ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. ధనం ఉంటే చాలు అన్ని సమకూరుతాయి. ఏదైనా ధనంతో కొనవచ్చు అనే భ్రాంతిలో ఉంటారు. వీరికి మంచివారి సహవాసము గిట్టదు. ఎప్పుడూ దుర్మార్గుల సహవాసం చేస్తుంటారు. వీరికి తమ మాట నెగ్గాలనే పట్టుదల ఎక్కువ. తమ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఎల్లప్పుడూ నీచమైన, అసాంఘికమైన పనులు చేస్తుంటారు. వీరంతా ఆసురీసంపద ఎక్కువగా కలిగిన వారు అని గుర్తించవచ్చు. అసురీసంపద అంటే ఆసురులు అంటే రాక్షసులు. ఇట్లా అహంకారం, దుర్మార్గం, కామం వంటివి ఎక్కువగా కలిగి ఉండేవాళ్ళు రాక్షసులు అనబడతారు. 


అంటే ఇక్కడ రాక్షసులు అంటే కోరలు, కొమ్ములు పెంచుకుని మనుషులను చంపి తినేవాళ్ళు మాత్రమే కాదు. ఒకరిని హింసించడం, జాలి, దయ వంటివి లేకపోవడం. ముఖ్యంగా ఆడవాళ్లను లొంగదీసుకుని మోసం చేయడం. దౌర్జన్యం, ఈర్ష్య, అసూయ వంటి గుణాలు కలిగి ఉన్నవారిని రాక్షస ప్రవృత్తి కలిగివాళ్ళు అని అర్థం. 

ఈ రకపు గుణం కలిగినవాళ్ళు ప్రస్తుత భారతదేశంలో పెరుగుతూ పోతున్నారు. ఫలితంగా  ఎప్పుడూ ఆడవాళ్ళ మీద జరుగుతున్న దారుణాలు వినాల్సి వస్తోంది. ఈట్లా జరగడానికి కారణం ఏమిటంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేయడం. చెడ్డ వాళ్ళతో ఉన్నప్పుడు క్రమంగా ఆ గుణాలు పెరుగుతూ పోతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ