Read more!

కర్మఫలత్యాగం గూర్చి పరమాత్మ వివరణ!!

 

కర్మఫలత్యాగం గూర్చి పరమాత్మ వివరణ!!

 


【శ్లోకం:- శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే||

ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ || 

అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది. జ్ఞానము కంటే ధ్యానము గొప్పది. ధ్యానము కంటే కర్మఫలము గొప్పది కర్మఫలత్యాగము చేస్తే పరమ శాంతి చేకూరుతుంది.】

ఈ శ్లోకంలో పైన చెప్పబడిన మెట్లకు తర తమ భేదములు వర్ణిస్తున్నాడు పరమాత్మ. అభ్యాసంతో ఏదైనా సాధించ వచ్చు అని చెప్పాడు. కాని అభ్యాసాని కంటే వేదములు శాస్త్రములు పురాణములు చదివి జ్ఞానము సంపాదించడం ముఖ్యం. జ్ఞానము సంపాదించి ఆ జ్ఞానమును అభ్యాసం చేయాలి. వేదములు, శాస్త్రములు పురాణములు చదివి జ్ఞానము సంపాదించడం కంటే, ప్రతిరోజూ ధ్యానం చేయడం ఉత్తమం, ధ్యానం చేస్తే మనను, ఇంద్రియములు అదుపులో ఉంటాయి. ఈ ధ్యానం చేయడం కన్నా చేసిన కర్మల ఫలములను వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే ఈ కర్మల ఫలితములు నావి కావు, ఈ కర్మలు అన్నీ పరమాత్మ పరంగా చేస్తున్నాను. ఈ కర్మల ఫలితములు పరమాత్మవే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేస్తే ఆ కాసేపు మనసు నిర్మలంగా ఉంటుంది. అదే కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలములను పరమాత్మకు అర్పిస్తూ, వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే, నిరంతరము ఆనందము, నిర్మలత్వము, ప్రశాంతత అనుభవించవచ్చు.. ఎందుకంటే అందులో ఉండే ఆనందము, ప్రశాంతత ఇంక దేనిలో ఉండవు.

నిష్కామ యోగము, కర్మఫల త్యాగము అన్నిటి కన్నా గొప్పవి. తరువాత స్థానాలలో ధ్యానము, విజ్ఞానము, జ్ఞానము, అభ్యాసము వస్తాయి. వీటి కన్నిటికీ నిర్మలమైన మనస్సు చిత్త శుద్ధి ముఖ్యము. ఆ చిత్త శుద్ధి నిష్కామ కర్మ, కర్మఫల త్యాగము వలననే సిద్ధిస్తాయి. దానివలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకే కర్మఫలత్యాగము అన్నిటికీ పునాదిలాంటిది పునాది బలంగా ఉంటేనే కట్టడం నిలబడుతుంది. అలాగే కర్మఫలత్యాగంతో ఆరంభిస్తే, దానికి పైన ఉన్నవన్నీ వాటంతట అవే సిద్ధిస్తాయి అని అంటున్నాడు పరమాత్మ.

జ్ఞానము అన్నిటి కన్నా గొప్పది అనీ, ఏదీ వీలుకాకపోతే కర్మఫలత్యాగము ఆచరించతగ్గది అని చెప్పారు. ఇప్పుడు  కర్మఫలత్యాగాన్ని అత్యంత శ్రేష్టంగా చెప్పారు. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటంటే, మనం ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పవలసి వచ్చినపుడు దానిని గురించి గొప్పగా చెప్పడం మనకు అలవాటు. బట్టల షాపుకు వెళితే షాపువాడు చీరలు చూపిస్తాడు. అమ్మా ఈ చీర చాలా మంచిది. నేత మంచిది. కలరు పోదు దీనిని తీసుకోండి అంటాడు. మీరు ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెబుతాడు. అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా ఇంకా గొప్పగా చెబుతాడు. అంటే వాడి ఉద్దేశ్యం మీరు ఏదో ఒక చీర కొనాలని కానీ, మిగిలిన చీరలు గొప్పవి కాదు అని కాదు.

అలాగే ఇక్కడ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెబుతూ, కర్మఫలత్యాగం గొప్పది అని చెప్పడంలో అర్థం కనీసం మీచేత ఈ కర్మఫలత్యాగము అన్నా ఆచరింపచేయాలని వ్యాసుల వారి ఉద్దేశం. అంతేకానీ జ్ఞానము, ధ్యానము, అభ్యాసము, కర్మఫలత్యాగము కన్నా గొప్పవి అని కాదు. దేనికదే గొప్పది. కాకపోతే మనకు ఆచరణకు కర్మఫలత్యాగము సులభంగా ఉంటుంది కాబట్టి, దాని కంటే ఇంకా కింద ఆచరించవలసినది ఏదీ లేదు కాబట్టి, దాని గురించి గొప్పగా చెబితే అందరూ దానిని ఆచరించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, కర్మఫలత్యాగాన్ని అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పాడు. ఈ శ్లోకాన్ని అలా అర్థం చేసుకోవాలి కానీ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే విపరీతార్థాలు, పరస్పర విరుద్ధ అర్థాలు వచ్చే అవకాశం ఉంది. 

◆వెంకటేష్ పువ్వాడ