Read more!

మనిషి శరీర ప్రాముఖ్యత!!

 

మనిషి శరీర ప్రాముఖ్యత!!

ఆహారం తినడం, నీళ్లు తాగడం, ఆటపాటలు, పెళ్లిళ్లు, సంసారాలు, వంశాలు అభివృద్ధి చేసుకోవడాలు ఇవే మనిషి  జీవితం యొక్క లక్ష్యాలా? ఇవన్నీ పశుపక్ష్యాదులు కూడ చేస్తున్నాయి కదా. ఆహార వ్యవహారముల జ్ఞానము పశుపక్ష్యాదులకు కూడ ఉంది. పశువులు కూడా శారీరక సుఖములు అనుభవిస్తాయి. అలాంటప్పుడు మనిషి కేవలము భోగలకు మాత్రమే పరిమితం అయితే అపుడు పశువుకు, మనిషికి తేడా ఏముంది?? ఆ జంతువులు, పక్షులు చేయలేనిది, మనిషికి సాధ్యమైనది ఒకటే మార్గం. అది ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికత ద్వారా మనిషి తన ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మను ఆ పరమాత్మలో కలిసేలా చేయడం.

మనిషి తన జీవిత లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. 

ఒక నిర్ణీతమైన లక్ష్యం లేని జీవితం ఎలా ఉంటుంది అంటే పడవ నడిపేవాడు లేకుండా పడవ సముద్రంలో పోతున్నట్టు ఉంటుంది. అదే లక్ష్యం అనేది ఉంటే వెళ్తున్న మార్గం ఏమిటో బాగా అర్థమవుతుంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమైనది దేవుడిని పూజించడం. అలా పూజించడానికి ఈ శరీరం ఒక మార్గం అంతే!! 


కోతిలో గల సద్గుణములు, నిగ్రహము, మానవునిలో కాగడా బెట్టి వెదకినా కనబడవు. కోతికి ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ, అది రామాఫలముకాని, సీతాఫలము కాని తినదు. ఎందుకంటే, ఆ ఫలములలో, వాటియొక్క ఆరాధ్యదేవుని నామము కలసిపోయి ఉంది. కాని మనిషి, ఉచితముగ లభిస్తే భోజనము చేయడానికి కూడ సంకోచించడు. ఆత్మనిగ్రహములేని వ్యక్తులు ప్రభుభక్తికి అనర్హులు. అలాంటి వాళ్ళ జీవితం వ్యర్థం.


మనిషినిలో  ఒక విశిష్ట లక్షణం ఉంది.మనిషి కోరుకున్న దాన్ని దక్కించుకోగలడు. నావైపు ఆలోచన చేయగలడు. అంతే కాదు భక్తిని అనుభూతి చెందగలడు.  భక్తిలో గల సుఖం కుక్క మరియు పిల్లులకు లభించదు. అలాగే జంతువులు కూడ భక్తి అనుభూతి చెందలేవు. కేవలం మనిషి మాత్రమే ఆ దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు. మనిషికి మాత్రమే తపోప్పుల, పాప పుణ్యాల విచక్షణ ఉంటుంది. 

జంతువులు కొన్ని ఒకదాన్ని మరొకటి చంపుకుంటూ తింటూ ఉంటాయి. కాని మనిషి ఏ జంతువును అయినా లేదా ఇంకో మనిషిని అయినా చంపితే పాపం కలుగుతుంది అంటారు. ఇదే మనిషికీ జంతువుకు మధ్య తేడా.  పశువులకు జ్ఞానం తక్కువ. మూడు సంవత్సరాల తరువాత తల్లిని మర్చిపోయే జంతువులు ఉన్నాయి. 

అందరూ చెప్పుకునే పాప పుణ్యములు మనిషి శరీరము వల్లనే కలుగుతాయి. దేవుడు ఇచ్చిన విచక్షణా జ్ఞానం వల్ల పాపం నుండి బయటపడి భక్తి మార్గంలోకి వెళ్లే అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది. భవిష్యత్తును గురించి ఆలోచన కూడ ఒక్క మనిషి మాత్రమే చేయగలడు.


అంటే మనిషికి ఈ శరీరం ఆ పరమాత్మ అత్యంత కరుణతో అనుగ్రహించినది.  ఇంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకోని మనుషుల జీవితం అత్యంత దుఃఖభరితంగా ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్లకు ఎలాంటి బాధ ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో చాలా బాధపడతారు.  క్షణభంగురమైన ఈ జీవితంలో మనిషి శాశ్వతమైన ఆ పరమాత్మను చేరుకోవచ్చు. ఆ దేవుడు ఎన్నో శరీరాలను సృష్టిస్తాడు. కానీ మనిషి శరీరం ఎంతో ఉత్తమమైనది అని ఆ భగవంతుడే చెబుతాడు.  మానవుడు అన్ని ఫలాలను పొందగలడు. అంతేకాదు ఏదైనా సాధించగలడు. కోటి ఉపాయముల వల్లనైన పొందలేని ఈ ఉత్తమమైన ఓడ వంటి శరీరమునకు, గురువు నావికుని వంటివాడు. భగవంతుని దయకు పాత్రుడైనప్పటికీ, అనుకూల వాతావరణములో నడుచే గురువు మార్గదర్శి అయినప్పటికీ, మనిషి ఈ అమూల్యమైన జీవన నౌకను పొంది కూడ, భవసాగరమును దాటలేకున్నాడు. భగవంతుడు మనిషికి శరీరాన్ని ఇచ్చి  కరుణ చూపిస్తే ఇప్పుడు మనిషి తనపై తాను కరుణించుకోవాలి.


మనిషి తనకు తాను మిత్రుడు కావచ్చును లేక శత్రువు కావచ్చును.  కానీ ఆ దేవుడిని తెలుసుకుంటేనే అతని జీవితానికి సార్థకత. మనిషికి మాత్రమే పరమాత్మ దర్శనం లభిస్తుంది. దేవతలకు లభించదు. స్వర్గంలో పుణ్యం క్షీణించిపోతుంది. స్వర్గంలోనికి వెళ్ళిన దేవతలు పుణ్యఫలమును మాత్రమే అనుభవిస్తారు. కాని తపస్సు చేయరు. మనిషి ఒక్కడే భక్తి పూర్వక జీవితమును గడపి భగవంతుని పొందగలడు. 

ఇలా మనిషి శరీరానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉందని ఆధ్యాత్మికత చెబుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ