శ్రీకృష్ణునకు...పార్వతీదేవి శాపమా
శ్రీ కృష్ణునకు...పార్వతీదేవి శాపమా?
నైమిశారణ్యం-13
శ్రీ కృష్ణునకు పార్వతీదేవి శాపం ఏమిటా అని ఆశ్చర్యపోవద్దు. ఆమె శాపం శ్రీ కృష్ణుని కూడా వదల్లేదు. ఆ కథ ఏమిటంటే... ఆ రోజు వినాయకచవితి పండుగ. అందరిలాగే శ్రీ కృష్ణుడు కూడా వినాయకుని పూజించి ఆయన ఆశీస్సులు అందున్నాడు. స్వామివారి ప్రసాదం తిని కాసేపు విశ్రమించాడు. కళ్ళు తెరచి చూసేటప్పటికి బాగా చీకటి పడింది. కాసిన్ని పాలు త్రాగాలనిపించింది. చిన్నప్పటి నుంచీ కృష్ణుడికి పాలంటే కాస్త చపలం, బలహీనత. అందుకే ఇంత వయసు వచ్చినా పాలు త్రాగకుండా ఉండలేడు. వెంటనే పాలగిన్నె తీసుకుని గోశాలవైపు అడుగు వేసాడు. అంతలోనే, ఈ రోజు వినాయకచవితి కదూ.. చంద్రుని చూడకూడదు కదూ.. అన్న సంగతి గుర్తుకు వచ్చి.., గమ్మున ఉత్తరీయాన్ని తల మీద వేసుకుని, ఆకాశం వంక చూడకుండా తల వంచుకుని గోశాలలో దూరి పాలు పితకడం ప్రారంభించాడు. ఇంతలో ఎక్కడ నుంచి వీచిందో మాయదారి పాడు గాలి...కృష్ణుని తలపైనున్న ఉత్తరీయాన్ని కాస్త పక్కకు లాగింది. కృష్ణుడు తడబడుతూ పాలగిన్నెవైపు చూసాడు. అంతే.... ఆ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడనే చూసాడు శ్రీ కృష్ణుడు. ‘అయ్యో...చవితి చంద్రుని చూసానే.. ఎలాంటి అపనింద రానున్నదో’ అనుకున్నాడు. ఆ రోజులలో.. సత్రాజిత్తు అనే రాజు తన ఉపాసనతో సూర్యుని మెప్పించి, శమంతకమణిని వరంగా పొందాడు. ఆ మణి రోజుకు 16 మణుగుల బంగారం ఇస్తుంది. ఒకరోజు సత్రాజిత్తు ఆ మణిని ధరించి శ్రీ కృష్ణుని దర్శనానికి వచ్చాడు. శ్రీ కృష్ణుడు ఆ మణి సౌందర్యానికి ముచ్చటపడి, శమంతకమణిని తనకు ఇమ్మని అడిగాడు. సత్రాజిత్తు ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పి తన రాజ్యానికి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన కొన్నాళ్లకు.., సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు శమంతకమణిని ధరించి వేటకని అడవికి వచ్చాడు. అతని మెడలోనున్న మణిని ఒక సింహం చూసి., మాంస ఖండమని భ్రమించి, ప్రసేనజిత్తుయి చంపి, ఆ మణిని నోట కరుచుకుని తీసుకుని వెడుతోంది.భల్లూకరాజైన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి, ఆ మణిని తన కమార్తె జాంబవతికి ఇచ్చాడు. అసలు సంగతి తెలియని సత్రాజిత్తు.., కృష్ణుడే తన తమ్ముని చంపి శమంతక మణిని అపహరించాడు అనే అపనింద వేసాడు. ఈ సంగతి విన్న శ్రీ కృష్ణుడు .., అపనింద పోగొట్టుకుంటేనే కానీ నేను ద్వారకలో అడుగు పెట్టను అని శపధం చేసి అడవికి వెళ్లి వెతగ్గా ముందు సింహం అడుగు జాడలు , అటుపైన జాంబవంతుని అడుగుజాడలు కనిపించాయి. వాటి ఆధారంగా ఒక గుహలోకి వెళ్లాడు.అక్కడ జాంబవతి శమంతకమణితో ఆడుకుంటూ కనిపించింది. శ్రీ కృష్ణుడు ఆమె దగ్గరనుంచి ఆ మణిని తీసుకున్నాడు. జాంబవతి బిగ్గరుగా అరిచింది. ఆమె అరుపుకు లోపల నుంచి జాంబవంతుడు వచ్చి శ్రీ కృష్ణుని చూసి, అతనితో యుద్ధానికి దిగాడు. అలా ఇద్దరి మధ్య 28 రోజులపాటు యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. తనను జయించినది శ్రీ రాముడే అని గ్రహించి, క్షమించమని కోరాడు. శ్రీ కృష్ణుడు జరిగినదంతా చెప్పాడు. జాంబవంతుడు శమంతకమణితో పాటు, జాంబవతిని కూడా ఇచ్చి పంపాడు. శ్రీ కృష్ణుడు ద్వారక వచ్చి, సభ ఏర్పాటు చేసి, సత్రాజిత్తును రావించి, జరిగినదంతా చెప్పి, శమంతకమణిని ఇచ్చాడు. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని, శ్రీ కృష్ణుని క్షమించమని ప్రార్థించి, తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా యిచ్చి వివాహం జరిపించాడు. ఆ వివాహానికి వచ్చిన దేవతలు, ఋషులు శ్రీ కృష్ణునితో ‘ కృష్ణా.. నువ్వు దేవదేవుడవు కనుక నీలాపనింద వచ్చినా.., పోగొట్టుకోగలిగావు. మరి మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి’ అని అడిగారు. అప్పుడు శ్రీ కృష్ణుడు వారితో ‘ఈ శమంతకమణి కథను ఎవరైతే చదివి,ఆ కథ అక్షతలను ‘శమంతకమణి’ అంటూ ముమ్మారు శిరస్సున ధరిస్తారో,వారికి పొరపాటున చంద్ర దర్శనం చేసినా దోషం అంటదు’ అని పార్వతి శాపాన్ని సరిచేసాడు.
కొసమెరుపు
అందరి సంగతి ఏమో తెలియదుగానీ.., శ్రీ కృష్ణుడు మాత్రం పార్వతి శాపానుసారం ఇంకా నీలాపనిందలు పడుతూనే ఉన్నాడు. ఎలా అంటారా...? ‘ఎవరైనా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలను వెంటేసుకుని తిరిగితే.. వాడికేంరా..గోపాలకృష్ణుడు..అని శ్రీ కృష్ణుని ఆడిపోసుకుంటున్నామా, లేదా. పాపం శ్రీ కృష్ణుడు. పాపం శమించు గాక.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం